‘మైనార్టీలను జగన్‌ నమ్మించి మోసం చేశారు’
eenadu telugu news
Published : 19/10/2021 04:02 IST

‘మైనార్టీలను జగన్‌ నమ్మించి మోసం చేశారు’

మాట్లాడుతున్న ముస్తాక్‌ అహ్మద్‌, పక్కన నసీర్‌

పట్టాభిపురం, న్యూస్‌టుడే: జగన్‌ అధికారంలోకి వచ్చాక రాష్ట్రం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని తెదేపా రాష్ట్ర మైనార్టీ సెల్‌ అధ్యక్షుడు మౌలానా ముస్తాక్‌ అహ్మద్‌ విమర్శించారు. జిల్లా తెదేపా కార్యాలయంలో సోమవారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ‘పాదయాత్రలో జగన్‌ మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఆంధ్ర జాతికి వెన్నుపోటు పొడిచారు. భవన నిర్మాణ కార్మికులు పనుల్లేక రోడ్డు మీద పడ్డారు. మద్య నిషేధం హామీ ఊసే లేదు. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌, విద్యుత్తు ఛార్జీలు పెంచుకుంటూ పోతున్నారు. ఇంటి పన్ను, రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు పెంచారు. చివరకు చెత్తపై కూడా పన్ను విధిస్తున్నారు. జగనన్న వస్తే రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకువెళ్తారని నమ్మి ఓట్లేసిన ప్రజలను నట్టేట ముంచారు’.. అని ధ్వజమెత్తారు. తెదేపా జాతీయ అధికార ప్రతినిధి మహమ్మద్‌ నసీర్‌ మాట్లాడుతూ ‘మైనార్టీలను జగన్‌ నమ్మించి మోసం చేశారు. మైనార్టీలకు జరుగుతున్న అన్యాయం, దాడులపై ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషా ఎందుకు నోరు మెదపడం లేదు. దుగ్గిరాల ఎంపీపీ ఎన్నికల బరిలో నిలిచిన జబీన్‌కు కుల ధ్రువీకరణ పత్రం ఇవ్వకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారు. ఇది రాష్ట్రంలో ఉన్న మైనార్టీలందరికీ సంబంధించిన విషయం. జబీన్‌కు న్యాయం జరిగే వరకు ప్రతి ఒక్కరూ పోరాడాలి’.. అని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మైనార్టీ నాయకులు హసన్‌ బాషా, జాదా, హుస్సేన్‌, ఖుద్దూస్‌, రఫీ, జమీర్‌ఖాన్‌, రబ్బానీ, తెలుగు మహిళ అధ్యక్షురాలు అన్నాబత్తుని జయలక్ష్మి, షేక్‌ రిజ్వానా తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని