వ్యాక్సిన్‌ కొరత.. తప్పని పడిగాపులు
eenadu telugu news
Published : 23/09/2021 01:34 IST

వ్యాక్సిన్‌ కొరత.. తప్పని పడిగాపులు

మోమిన్‌పేట: అర్హులందరికీ కరోనా టీకా ఇవ్వాలని జిల్లా వ్యాప్తంగా ఈ నెల 16వ తేదీ నుంచి ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగానే మోమిన్‌పేట మండలంలో తొమ్మిది ఆరోగ్య ఉపకేంద్రాల్లో టీకా వేస్తున్నారు. వారం రోజులు గడవక ముందే వ్యాక్సిన్‌ సరఫరా అంతంత మాత్రంగానే ఉండడంతో టీకా కోసం వచ్చిన వారికి నిరీక్షణ తప్పడంలేదు. బుధవారం తొమ్మిది ఉప కేంద్రాలకు వ్యాక్సిన్‌ అందక పోవడంతో వైద్య సిబ్బందితో ప్రజలు వాగ్వాదానికి దిగారు.

కొడంగల్‌ గ్రామీణం (బొంరాస్‌పేట), న్యూస్‌టుడే: గ్రామాల్లో కారోనా టీకాలకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. బొంరాస్‌పేట, దౌల్తాబాద్‌, కొడంగల్‌ మండలాల్లోని ఉపకేంద్రాల్లోనే టీకాలు ఇస్తున్నారు. ఆయా గ్రామాల్లోని అంగన్‌వాడీ ఉపాధ్యాయులు, ఆశా కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి అర్హులైన వారంతా టీకాలు తీసుకునే విధంగా అవగాహన కల్పిస్తున్నారు. టీకాలు వేసుకునేందుకు గ్రామీణులు ఆసక్తి చూపుతున్నట్లు వైద్య సిబ్బంది చెప్పారు.


64 వేల మందికి టీకా

వికారాబాద్‌ మున్సిపాలిటీ, న్యూస్‌టుడే: జిల్లాలో ఆరు రోజుల్లో 64,981 మందికి కొవిడ్‌ టీకా వేశామని జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ తుకారాంభట్‌ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ ఈనెల 16న 22.3 శాతం 17న (34.2), 18న (48.2), 19న (33.2), 20న (11.1), 21న 50.2 శాతం టీకా ఇచ్చారన్నారు. జిల్లాలో 139 ఉప ఆరోగ్య కేంద్రాల్లో, వికారాబాద్‌, పరిగి, తాండూరు, కొడంగల్‌ పురపాలికలోని 97 వార్డుల్లో వ్యాక్సిన్‌ వేసే కేంద్రాలను ఏర్పాటు చేసి పంపిణీ చేస్తున్నామని చెప్పారు.


వ్యాక్సినేషన్‌కు అంగన్‌వాడీల తోడ్పాటు

వికారాబాద్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: ఇంటింటికీ వ్యాక్సిన్‌ కార్యక్రమంలో అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొంటున్నారని జిల్లా మహిళా, శిశు సంక్షేమాధికారిణి లలితకుమారి తెలిపారు. బుధవారం ఆమె ‘న్యూస్‌టుడే’తో మాట్లాడుతూ.. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు వారు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 1,106 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయని వీటిల్లో 839 అంగన్‌వాడీ ఉపాధ్యాయినులు, 139 మినీ అంగన్‌వాడీ కార్యకర్తలు విధులు నిర్వహిస్తున్నారని వివరించారు. గ్రామాల్లో 18 ఏళ్లు దాటిన వారిని కేంద్రాలకు వచ్చేలా ప్రయత్నిస్తున్నారన్నారు. జిల్లాలో 81 అంగన్‌వాడీ ఉపాధ్యాయినులు, సహాయకుల భర్తీకి ప్రకటన జారీ చేశామన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని