పాపం..పసివాడు!.. పుట్టుకతో బయటనే మూత్రాశయం
eenadu telugu news
Updated : 23/09/2021 11:53 IST

పాపం..పసివాడు!.. పుట్టుకతో బయటనే మూత్రాశయం

ఆదుకునే వారి కోసం ఎదురుచూపులు

ఈనాడు, హైదరాబాద్‌: పుట్టుకతోనే ఆ చిన్నారి నరక యాతన అనుభవిస్తున్నాడు. పుట్టినప్పటి నుంచే చిన్నారికి మూత్రాశయం (బ్లాడర్‌) బయట ఉంది. ఆ పసివాడు పడుతున్న బాధ చూసి తల్లిదండ్రులు విలవిలలాడుతున్నారు. ఇప్పటికే ఒకసారి నిలోఫర్‌ ఆసుపత్రిలో శస్త్ర చికిత్స చేయించినా ప్రయోజనం లేకపోయింది. మళ్లీ సమస్య మొదటికే వచ్చింది. ప్రస్తుతం ఆ చిన్నారి సాధారణ స్థితికి చేరాలంటే దీర్ఘకాలంగా వైద్యం అందించాలని వైద్యులు సూచిస్తున్నారు. రెండు, మూడు శస్త్రచికిత్సలు చేయాల్సి ఉంటుందన్నారు. ఇందుకు లక్షల్లోనే ఖర్చు అవుతుందని చెప్పడటంతో దిక్కుతోచని స్థితిలో ఆ తల్లిదండ్రులు నిస్సహాయులుగా మారారు. రెక్కాడితే తప్ఫ..డొక్కాడని బతుకులు కావడంతో అంత సొమ్ములు సమకూర్చలేక లబోదిబోమంటున్నారు. సూర్యాపేటకు చెందిన శ్రీను, హరిత దంపతులు నగరంలోని అంబర్‌పేటలోని మల్లికార్జున్‌నగర్‌లో ఉంటున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు. తొలి సంతానంలో ఇద్దరు ఆడపిల్లలు (కవలలు) పుట్టారు. రెండో సంతానం కింద బాబు జన్మించాడు. పుట్టినప్పటి నుంచే పిల్లాడికి జన్యుపరమైన సమస్య ఏర్పడింది. దీనిని వైద్య పరిభాషలో క్లాసిక్‌ బ్లాడర్‌ ఎక్స్‌ట్రోపీగా వ్యవహరిస్తారు. ఇలాంటి పిల్లల్లో మూత్రాశయం శరీరం బయటే ఉంటుంది. పురుషాంగం కూడా అందులో కలిసి పోవడంతో మూత్రానికి వెళ్లడం కూడా కష్టమే. ఇది చాలా సంక్షిష్టమైన సమస్య అని వైద్యులు తెలిపారు. ఒకటే సర్జరీతో కాకుండా...విడతల వారీగా శస్త్ర చికిత్సలు చేసి మొత్తం వ్యవస్థను పునరుద్ధరించాలి. తమిళనాడు వేలూరులో ఈ తరహా చికిత్సలు చేస్తున్నారు. ఖర్చు కూడా ఎక్కువే. తండ్రి శ్రీనివాస్‌ ఓ ప్రైవేటు సంస్థలో మెకానిక్‌. పదివేల వరకు జీతం వస్తోంది. ఇది కుటుంబ పోషణకే సరిపోవడం లేదని వాపోతున్నాడు. కుమారుడికి శస్త్ర చికిత్సకు దాదాపు 8 లక్షలపైనే ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారని శ్రీనివాస్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. పెద్ద మనసుతో దాతలు స్పందించి తన కుమారుడిని ఆదుకోవాలని కోరుతున్నాడు. సహాయం చేయదల్చుకున్నవారు ఈనాడు ప్రతినిధిని 8008055788 నంబరులో సంప్రదించగలరు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని