నిమజ్జన వేడుకలకు సిద్ధం
eenadu telugu news
Published : 19/09/2021 03:01 IST

నిమజ్జన వేడుకలకు సిద్ధం

నిమజ్జన ప్రాంతాలను పరిశీలిస్తున్న మంత్రి గంగుల, ఎమ్మెల్యే రసమయి

కార్పొరేషన్‌, మానకొండూర్‌, న్యూస్‌టుడే: కరీంనగర్‌లో ఆదివారం జరిగే గణేశ్‌ నిమజ్జనానికి నగరపాలక అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మండపాల దగ్గర, నిమజ్జనానికి వెళ్లే మార్గాలు, రద్దీ ప్రాంతాల్లోని రహదారులపై కంకరపొడి పోయించారు. మానకొండూర్‌, కొత్తపల్లి చెరువులు, చింతకుంట వంతెన దగ్గర పనులు పూర్తి చేశారు. టవర్‌సర్కిల్‌ ప్రాంతంలో స్మార్ట్‌సిటీ పనులు నడుస్తుండగా తాత్కాలికంగా నిలిపి వేసి, వాహనాలకు ఆటంకాలు లేకుండా ప్యాచ్‌ వర్క్‌, పారిశుద్ధ్య పనులు పూర్తి చేశారు. విగ్రహాలకు విద్యుత్తు తీగలు తగలకుండా పైకి లేపడం వంటి పనులు విద్యుత్తు శాఖ చేపట్టింది.

మూడు ప్రాంతాల్లో ...

మానకొండూర్‌ చెరువు దగ్గర మూడు క్రేన్లు, చింతకుంటలో రెండు, కొత్తపల్లిలో రెండు క్రేన్లు బిగిస్తున్నారు. అదేవిధంగా విద్యుత్తు అంతరాయం కలగకుండా మూడు జనరేటర్లు, ఆయా ప్రాంతాల్లో షామియానాలు, ఫ్లడ్‌ లైటింగ్స్‌ కోసం టవర్లు బిగించారు. పోలీసుల బందోబస్తుకు ప్రత్యేక ఏర్పాట్లు, సీసీ కెమెరాలు, మైకు సౌకర్యం వంటివి బిగిస్తున్నారు. ఈ ఏర్పాట్లను ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌, నగర మేయర్‌ వై.సునీల్‌రావు, ఇన్‌ఛార్జి కమిషనర్‌ గరిమ అగ్రవాల్‌, ఎస్‌ఈ పి.వి.కృష్ణారావు, ఈఈ రామన్‌ అధికారులతో కలిసి పలుమార్లు పర్యవేక్షించారు. తహసీల్దార్లకు, నగరపాలక సంస్థలో పని చేస్తున్న అధికారులకు, ఉద్యోగులకు బాధ్యతలు అప్పగించారు. వీరంతా నిమజ్జనం పూర్తయ్యేవరకు విడతల వారీగా ఆయా ప్రాంతాల్లో విధులు నిర్వర్తించనున్నారు.

కరీంనగర్‌ కొత్తపల్లి: వినాయక నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు పూర్తయ్యాయని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. శనివారం మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌, అధికారులతో వినాయక నిమజ్జనం జరిగే మానకొండూర్‌ చెరువు, చింతకుంట కెనాల్‌, కొత్తపల్లి చెరువులను సందర్శించి అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పట్టణంలో సుమారు 500కు పైగా మండపాల్లో వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసినట్లు, ఒక్కో నిమజ్జన కేంద్రానికి సుమారు 200 విగ్రహాలు తరలి వస్తాయని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. భారీ గణపతి విగ్రహాలు మానకొండూర్‌ చెరువుకు తరలించేలా చర్యలు తీసుకున్నామన్నారు. రాంనగర్‌ పరిసర ప్రాంతాల విగ్రహాలు చింతకుంట కెనాల్‌, టవర్‌ సర్కిల్‌ పరిసర ప్రాంతాల విగ్రహాలు మానకొండూర్‌, కోర్టుచౌరస్తా పరిసర ప్రాంతాల విగ్రహాలు కొత్తపల్లి తరలి వెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ ఆర్‌.వి కర్ణన్‌, సీపీ సత్యనారాయణ, జిల్లా వైద్యాధికారి జువేరియా, జడ్పీటీసీ సభ్యులు, మున్సిపల్‌ ఇంజినీరింగ్‌, ఇరిగేషన్‌, అధికారులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని