రాజన్న క్షేత్రంలో వినాయకుడి నిమజ్జనోత్సవం
eenadu telugu news
Published : 19/09/2021 03:01 IST

రాజన్న క్షేత్రంలో వినాయకుడి నిమజ్జనోత్సవం

ధర్మగుండంలో నిమజ్జనం చేస్తున్న అర్చకులు, భక్తులు

వేములవాడ ఆలయం, న్యూస్‌టుడే: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన వినాయకుడి నిమజ్జనోత్సవం శనివారం వైభవంగా నిర్వహించారు. వినాయకుడికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అందంగా అలంకరించిన పెద్ద సేవపై వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఊరేగించారు. రాత్రి ఆలయ ధర్మగుండంలో అధికారులు, అర్చకుల, భక్తుల కోలాహలం మధ్య నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, ఎస్‌పీఎఫ్‌, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

ఆలయాల్లో ప్రత్యేక పూజలు: రాజన్న ఆలయంలో శనివారం భాద్రపద శుద్ధ ద్వాదశిని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం హవనానంతరం స్థానాచార్యుడు అప్పాల భీమాశంకర్‌ శర్మ ఆధ్వర్యంలో పూర్ణాహుతి నిర్వహించారు. శనిత్రయోదశి సందర్భంగా భీమేశ్వరాలయంలో నవగ్రహాలకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి.

ఏర్పాట్ల పరిశీలన

సిరిసిల్ల పట్టణం : సిరిసిల్ల మానేరువాగు ఒడ్డున వినాయక నిమజ్జనం కోసం చేపడుతున్న ఏర్పాట్లను కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి శనివారం పరిశీలించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పట్టణంతో పాటు విలీన గ్రామాలలో వినాయక నిమజ్జన ఏర్పాట్లు బాగా చేయాలని కలెక్టర్‌ మున్సిపల్‌ అధికారులను ఆదేశించారు. నిమజ్జనం పరిసరాలలో ఎలాంటి అపరిశుభ్రత లేకుండా చూసుకోవాలన్నారు. మండపాల నిర్వాహకులు కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఆదివారం మధ్యాహ్నం నుంచే నిమజ్జనానికి రావాలని ఆయన పేర్కొన్నారు. రెవెన్యూ, పురపాలక, పోలీసు సిబ్బంది మండపాల నిర్వాహకులకు, ప్రజలకు సహకరిస్తారని తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఎవరికీ ఇబ్బంది కల్గకుండా వినాయక నిమజ్జనం జరుపుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ జిందం కళ, ఆర్డీవో శ్రీనివాసరావు, మున్సిపల్‌ కమిషనర్‌ సమ్మయ్య, తహసీల్దార్‌ విజయ్‌కుమార్‌, సీఐ అనిల్‌కుమార్‌ తదితరులున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని