ప్రజాప్రతినిధుల బినామీలకే పనులు!
eenadu telugu news
Published : 19/09/2021 03:01 IST

ప్రజాప్రతినిధుల బినామీలకే పనులు!

సిరిసిల్ల పట్టణం, న్యూస్‌టుడే

గుంతలో కూరుకుపోయిన వాహనం

సిరిసిల్ల పురపాలక సంఘంలో ఎక్కువగా కొందరు ప్రజాప్రతినిధుల బినామీలే పనులు చేస్తున్నారు. బంధువులు, అనుచరుల పేరున లైసెన్సులు తీసుకుని పనులను దక్కించుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా పిలిచిన టెండర్లే ఇందుకు ఉదహరణగా పేర్కొంటున్నారు. కొన్నింటిని ముందే చేపట్టి తరవాత టెండర్లు పిలవడం గమనార్హం.

సిరిసిల్ల పురపాలక సంఘంలో రూ.82.80 లక్షలతో 19 పనులు చేపట్టడానికి ఈనెల 10న టెండర్లు పలిచి 15న తెరిచారు. వాటిలో ఆరు పనులకు గత నెలలో టెండర్‌లు పెట్టగా ఎవరూ వేయకపోవడంతో మరోసారి వాటికి టెండర్‌లు పిలిచారు. పట్టణ ప్రగతి నిధులు, మున్సిపల్‌ సాధారణ నిధులు ఈ పనులకు కేటాయించారు. పట్టణంలోని 22వ వార్డులో గ్రావెల్‌ రోడ్డు ఏర్పాటుకు రూ.2 లక్షలు, 27వ వార్డు అభివృద్ధి పనుల పేరిట రూ.5 లక్షలు, 7వ వార్డులో సీసీ రోడ్డు నిర్మాణానికి రూ.5 లక్షలు, 9వ వార్డుకు రూ.5 లక్షలు, 25వ వార్డుకు రూ.5 లక్షలు, 37వ వార్డుకు రూ.5 లక్షలతో పనులు చేపట్టేందుకు టెండర్ల ప్రక్రియను పూర్తి చేశారు.

నిమజ్జనం పేరిట...

సిరిసిల్లలోని వినాయక నిమజ్జనం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు అత్యధికంగా నిధులు కేటాయించారు. వర్షాలు అధికంగా పడి సిరిసిల్ల మానేరువాగులో నీటి ప్రవాహం పుష్కలంగా కనిపిస్తుంది. అయినప్పటికీ వినాయక నిమజ్జనం కోసం గుంతలు తవ్వడానికి జేసీబీ, బ్లేడ్‌ ట్రాక్టర్‌, పొక్లెయిన్‌కు రూ.5 లక్షలు నిధులు కేటాయించారు. విగ్రహాలు నిమజ్జనం చేయడానికి హైడ్రాలిక్‌ క్రేన్‌ అద్దెకు రూ.2 లక్షలు వెచ్చించనున్నారు. నిమజ్జన ప్రాంతాల్లో అద్దె ప్రాతిపదికిన లైటింగ్‌, బారికేడ్ల ఏర్పాటుకు రూ.3లక్షలు వెచ్చించారు. పలు వార్డులలో రోడ్లు చెడిపోవడంతో వాటిని బాగుచేయడానికి రూ.10 లక్షలు, ఉద్యానవనాలకు, దోబీఘాట్‌ వద్ద ఉన్న కమ్యూనిటీ గదులకు పెయింటింగ్‌ వేయడానికి రూ.3లక్షలు కేటాయించారు. మంచినీటి సరఫరా నిర్వహణకు, బ్లీచింగ్‌ పౌడర్‌ కొనుగోలుకు రూ.5 లక్షలు వెచ్చించారు. పలు వార్డుల్లో గుంతలు పడినచోట మొరం పోయడానికి రూ.5 లక్షలు ఖర్చు చేశారు. ఆ మొరం పూర్తిగా నాసిరకంగా ఉంది. దీనివల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. మొరం పేరిట పెద్ద పెద్ద రాళ్లను తీసుకువచ్చి గుంతలు, రోడ్ల పక్కన పోయడంతో వాహనదారులు మరింత ప్రమాదంలో పడుతున్నారు. ఈ పనుల్లో అత్యధికంగా ఓ ప్రజాప్రతినిధి, ఆయన అనుచరులే దక్కించుకున్నట్లు తెలిసింది.

పారదర్శకంగా టెండర్లు నిర్వహించాం

-సమ్మయ్య, మున్సిపల్‌ కమిషనర్‌, సిరిసిల్ల

19 పనులకు గానూ రూ.82.80 లక్షలతో టెండర్లు పిలిచాం. ఈనెల 10న పిలిచి 15న తెరిచాం. పనులు ప్రారంభమయ్యాయి. పారదర్శకంగా పనులు జరుగుతున్నాయి. అత్యవసరంగా కొన్ని పనులు పెట్టడం జరిగింది. నాణ్యతగా పనులు జరిగేలా చూస్తాం.

ముందే పనులు చేపట్టి...

కలెక్టర్‌ కార్యాలయం వద్ద కచ్చ నాలా ఏర్పాటుకు పొక్లెయిన్‌ను అద్దెకు తీసుకోగా రూ.5 లక్షలు, ప్రధాన మురుగు కాలువ వెంబడి చైన్‌లింక్‌మెష్‌ ఏర్పాటుకు రూ.5లక్షలు, కరకట్ట వద్ద నీటిని మళ్లించడానికి ఆర్‌సీసీ పైపులు వేయడానికి రూ.2.80 లక్షలను ఖర్చు చేశారు. పట్టణంలో వర్షం వల్ల రోడ్లు చెడిపోగా గ్రావెల్‌ పోసి చదును చేయడానికి రూ.5 లక్షలు, వరదల వల్ల రహదారుల్లో ఏర్పడిన వ్యర్థాలను తొలగించడానికి వాహనాలను సమకూర్చడంతో పాటు కార్మికులను పెట్టడానికి రూ.5 లక్షలు వెచ్చించారు. అయితే ఈ పనులకు ఈ నెల 10న టెండర్లు పిలిచి 15న తెరిచారు. కానీ 10వ తేదికి వారం రోజుల ముందే ఈ పనులు చేపట్టారు. టెండర్లు పిలవక ముందే పనులు మొదలుకాగా ఇప్పుడు ఎందుకు పిలిచారని పలువురు కౌన్సిలర్లు ప్రశ్నిస్తున్నారు. మున్సిపల్‌లో జరిగే పనులన్నీ ఓ ప్రజాప్రతినిధి, తన బంధువులు, అనుచరులే చేస్తున్నట్లు ప్రచారం ఉంది. వారిని బినామీలుగా పెట్టి తతంగం అంతా నడిపిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని