లబ్ధిదారులకు తక్షణమే బ్యాంకు ఖాతా
eenadu telugu news
Published : 24/09/2021 02:50 IST

లబ్ధిదారులకు తక్షణమే బ్యాంకు ఖాతా


సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా పాలనాధికారి కర్ణన్‌ 

కరీంనగర్‌ సంక్షేమ విభాగం, న్యూస్‌టుడే: దళితబంధు పథకంలో అర్హులై ఉండి డబ్బులు రాని లబ్ధిదారులకు బ్యాంకు ఖాతాను తక్షణం తెరిపించాలని జిల్లా పాలనాధికారి ఆర్‌వీ.కర్ణన్‌ అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా పాలనాధికారి సమావేశమందిరంలో దళితబంధు క్లస్టర్‌ అధికారులు, ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. అర్హులైన లబ్ధిదారులందరికీ రెండు మూడు రోజుల్లో డబ్బులు జమ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు పాలనాధికారులు శ్యాంప్రసాద్‌లాల్‌, గరిమ అగ్రవాల్‌, జడ్పీ సీఈఓ ప్రియాంక పాల్గొన్నారు.

డెయిరీ యూనిట్లు లాభదాయకం

దళితబంధు పథకం లబ్ధిదారులు డెయిరీ యూనిట్లు ఎంచుకుంటే లాభదాయకమని జిల్లా పాలనాధికారి ఆర్‌వీ.కర్ణన్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. హుజూరాబాద్‌ నియోజవర్గంలోని ఐదు మండలాల్లో ప్రభుత్వం 21000 దళిత కుటుంబాలను గుర్తించి దళితబంధు పథకం అమలు చేస్తున్నట్లు చెప్పారు. 30 రకాల స్వయం ఉపాధి పథకాలను ఎంపిక చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని తెలిపారు. డెయిరీ యూనిట్‌ ఎంపిక చేసుకున్న వారికి షెడ్డు నిర్వహణకు ముందే రూ.లక్ష ఇవ్వనున్నట్లు చెప్పారు. డెయిరీ రంగంలో శిక్షణ ఇప్పించి కరీంనగర్‌ డెయిరీ వారితో అనుసంధానం చేయిస్తామన్నారు. లబ్ధిదారులను ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్లి వారు కోరుకున్న గేదెలను కొనుగోలు చేసి ఇవ్వనున్నట్లు తెలిపారు. గ్రామాల్లోనే పాల కేంద్రాలుంటాయని..పాల కేంద్రాలకు తీసుకెళ్లడానికి ద్విచక్రవాహనం ఈ యూనిట్‌లో కొనుగోలు చేసి ఇస్తారని పేర్కొన్నారు. కరీంనగర్‌ డెయిరీతో పాడి రైతులకు వినూత్న సంక్షేమ పథకాలు చేపడుతున్నట్లు వెల్లడించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని