Published : 21/04/2021 02:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కదిలారో.. కటకటాలే!

ఎన్నికల నేపథ్యంలో రౌడీషీటర్లపై నిఘా

బైండోవర్ల ప్రక్రియ మొదలు

న్యూస్‌టుడే, వరంగల్‌క్రైం

ఒకరా..ఇద్దరా.. 267 మంది రౌడీషీటర్లు.. అదీ నగరం పరిధిలోనే.. వీరందరినీ కట్టడి చేయడంపై ఇప్పుడు పోలీసులు దృష్టిపెట్టారు. నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో వీరి కదలికలపై నిఘా ఉంచారు. ఏమాత్రం కాలు కదిపినా కటకటాల వెనక్కి నెట్టేందుకు సిద్ధమవుతున్నారు.

వరంగల్‌ నగర పాలక సంస్థ పరిధిలో ఎన్నికల సందడి మొదలైంది. నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావొస్తోంది. ఈ ఎన్నికల్లో డబ్బుల పంపిణీ, బెదిరింపులు, రౌడీయిజం ఎక్కువ కానవస్తోంది. వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో 51 ఠాణాలుండగా అందులో 11 స్టేషన్ల పరిధిలో ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిని సజావుగా నిర్వహించేందుకు పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. కమిషనర్‌ డాక్టర్‌ తరుణ్‌జోషి రౌడీషీటర్లపై ప్రత్యేక దృష్టి పెట్టి బైండోవర్‌ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మూడు రోజుల నుంచి అన్ని ఠాణాల్లోని రౌడీషీటర్లను పోలీసులు తహసీల్దార్ల ముందు బైండోవర్‌ చేస్తున్నారు. కమిషనరేట్‌ పోలీసులు వారి వారి ఠాణాల పరిధిలోని రౌడీషీటర్ల జాబితాను తయారు చేసుకొని వారు ప్రస్తుతం ఎక్కడ ఉంటున్నారు.. చేస్తున్న పనుల గురించి ఆరా తీస్తున్నారు. బైండోవర్‌ చేసిన వారు ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. కొంతమంది అనుమానితులపైనా నిఘా పెంచారు. సెంట్రల్‌ జోన్‌ డీసీపీలతోపాటు నలుగురు ఏసీపీల పర్యవేక్షణలో బైండోవర్ల ప్రక్రియ సాగుతోంది. ఇటీవల నగరంలో జరిగిన హత్య కేసుల్లో నిందితులుగా ఉన్న వారిపైనా దృష్టి సారించారు. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు కమిషనరేట్‌లో నాలుగు డివిజన్లలో ఏసీపీ, సీఐలతో పాటు ఎస్సైలనూ ప్రత్యేకంగా నియమించారు. వీరు ఠాణా పరిధిలో ఎన్నికల విధులతోపాటు పెట్రోలింగ్‌ నిర్వహిస్తారు.


గల్లీ గల్లీలో పెట్రోలింగ్‌ చేస్తాం...

-కె. గిరికుమార్‌, వరంగల్‌ ఏసీపీ

వరంగల్‌ పోలీసు కమిషనర్‌ డాక్టర్‌ తరుణ్‌జోషి ఆదేశాల మేరకు ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు రౌడీయిజంపై ఉక్కు పాదం మోపుతాం. రౌడీషీటర్లతో పాటు ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం. వరంగల్‌ డివిజన్‌లో ఎక్కువ మంది రౌడీ షీటర్లు ఉన్నారు. ఇప్పటికే వీరందరిని బైండోవర్‌ చేశాం. ఎన్నికలు పూర్తయ్యే వరకు రోజూ నిఘా ఉంటుంది. గల్లీ గల్లీలో పెట్రోలింగ్‌ చేస్తాం. ఎక్కడైనా రౌడీయిజం చేస్తే స్థానికులు 100కు కాల్‌ చేసి చెప్పాలి. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుంటారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని