నాలా.. ఆక్రమణల పీడ
eenadu telugu news
Published : 28/09/2021 04:38 IST

నాలా.. ఆక్రమణల పీడ

శివారు మున్సిపాలిటీల్లో అధ్వానంగా వ్యవస్థ

జనావాసాలకు తగ్గట్టుగా విస్తరణ కరవు

ఈనాడు- సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి

 


మీర్‌పేట చందన్‌చెరువు వద్ద నిలిచిన నాలా నిర్మాణ పనులు

కోటి జనాభా ఉన్న మహా నగరంలో ఒక్క రోజులో పది సెంటీమీటర్ల వర్షం కురిస్తే చాలు ముంపు సమస్యతో 30 లక్షలమంది తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి ప్రధాన కారణం రోడ్ల మీద పడ్డ వర్షం నీటిని నాలాలు కిందికి తీసుకువెళ్లక పోవడమే. ప్రధాన నాలాలన్నీ ఆక్రమణ కోరల్లో చిక్కినా కూడా అధికారులు విస్తరణ చేయకపోవడంతోనే ఈ పరిస్థితి. ఏటా తూతూ మంత్రంగా నాలాల విస్తరణ చేపట్టి మమ అనిపిస్తున్నారు.

బల్దియా పరిధిలో 7500 కిలో మీటర్ల పొడవున నాలాలు ఉన్నాయి. నగరంలో నాలాల వ్యవస్థను విస్తరించి అసరమైన చోట కొత్త నాలాలను నిర్మించాలంటే కనీసం రూ.20 వేల కోట్ల వ్యయం అవుతుందని కిర్లోస్కర్‌ కమిటీ తేల్చి చెప్పింది. రెండేళ్ల కిందట జీహెచ్‌ఎంసీ ఇంజినీర్లతో కమిటీ వేస్తే, మేజర్‌ నాలాల్లో మొదటి దశ కింద ఆక్రమణలను తొలగించి విస్తరిస్తే కొంతమేర ముంపు సమస్య తీరుతుందని చెప్పారు. ఇందుకు రూ.2 వేల కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. గత ఏడాది రూ.850 కోట్లు కూడా మంజూరు చేసినా పనులు కేవలం రూ.1.50 కోట్లవి జరిగాయి. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ నాలాల విస్తరణపై పట్టుదలగా ఉన్నా క్షేత్ర స్థాయిలో పనులు జరగడం లేదు. ఫలితం.. అయిదు సెంటీమీటర్ల వర్షం ఏకబిగిన కురిస్తే చాలు రోడ్లు చెరువులుగా మారుతున్నాయి.

శివార్లను వణికిస్తున్నాయ్‌..

హైదరాబాద్‌ చుట్టుపక్కల 22 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్లు ఉన్నాయి. ఏర్పడి మూడేళ్లు కావొస్తున్నా మౌలిక సదుపాయాలు కొరవడ్డాయి. గత పదేళ్లలో శివారు ప్రాంతాల్లో జనావాసాలు భారీగా పెరిగాయి. జనాభా రెట్టింపైనా అందుకు తగ్గట్టుగా నాలాల విస్తరణ చేపట్టలేదు. దాదాపుగా అన్ని మున్సిపాలిటీల్లో ఓపెన్‌ నాలాలే ఉన్నాయి. వీటిని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. భారీ వర్షాలు కురిస్తే నాలాలు పొంగి వీధులన్నీ మురుగుతో నిండిపోతున్నాయి. వ్యూహాత్మక నాలాల అభివృద్ధి ప్రణాళికలో భాగంగా రూ.858 కోట్లతో జీహెచ్‌ఎంసీ సహా శివారు మున్సిపాలిటీల్లో నాలాల అభివృద్ధి చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. రూ. 348కోట్లతో మీర్‌పేట, బడంగ్‌పేట, నిజాంపేట కార్పొరేషన్లు, జల్‌పల్లి, పెద్ద అంబర్‌పేట మున్సిపాలిటీల్లో పనులు జరగాల్సి ఉన్నా ప్రారంభం కాలేదు. మీర్‌పేట, బడంగ్‌పేట, నార్సింగి, మణికొండ, బండ్లగూడ జాగీర్‌ సహా 13 మున్సిపాలిటీల్లో భూగర్భ డ్రైనేజీ పనులు చేపట్టారు. సింహభాగం కార్పొరేటర్లు, కౌన్సిలర్లు గుత్తేదారుల అవతారం ఎత్తి దక్కించుకున్నారు. అంచనాలు పెంచి పనులు చేపట్టారు. మణికొండ మున్సిపాలిటీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ రజనీకాంత్‌ వరదలో గల్లంతుకు భూగర్భ డ్రైనేజీ పనులే కారణం. కనీస జాగ్రత్త చర్యలు తీసుకోకుండా పనులు చేపట్టారు.


కబ్జాల చెరలో చిక్కి...

* బండ్లగూడ జాగీర్‌లో పీరం చెరువు నుంచి ఈసీ నది వరకు ఉన్న నాలా ఆక్రమణల చెరలో చిక్కుకుంది. దాదాపు ప్రతి చోటా కుంచించుకు పోయింది. వైష్ణవి ఒయాసిస్‌ వద్ద నామ రూపాల్లేకుండా పోయింది.

* హైదర్షా కోట్‌లోని ఎర్రకుండ వరద నాలా కబ్జాకు గురైంది.● మణికొండ మున్సిపాలిటీ పంచవటి కాలనీలో 20 అడుగుల వెడల్పులో ఉండాల్సిన బుల్కాపూర్‌ నాలా నాలుగు అడుగులకు కుంచించుకు పోయింది.

* నిజాంపేటలో లేక్‌ రిడ్జ్‌ అపార్టుమెంట్స్‌ నుంచి సిరి బాలాజీ అపార్టుమెంట్‌ వరకు ఉన్న నాలాను ప్రైవేటు వ్యక్తులు మళ్లించి నిర్మాణాలు చేపట్టారు. నీటి పారుదల శాఖాధికారులు అడ్డగోలుగా ఎన్‌వోసీలు ఇచ్చారు.

* పోచారంలో అధికార పార్టీ నాయకులే నాలాలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని