వ్యాధి నిర్ధరణ.. ప్రజలకు సాంత్వన
eenadu telugu news
Published : 20/10/2021 00:58 IST

వ్యాధి నిర్ధరణ.. ప్రజలకు సాంత్వన

కేంద్రంలో పరీక్షలు చేస్తున్న సిబ్బంది

నూస్‌టుడే, వికారాబాద్‌ మున్సిపాలిటీ: ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా సర్కారు ముందుకు సాగుతోంది. ఇందుకోసం వివిధ కార్యక్రమాలను అమలు చేసి, భరోసా కల్పిస్తోంది. ఇందులో భాగంగానే రోగ నిర్ధారణ పరీక్షల కేంద్రానికి శ్రీకారం చుట్టింది. జిల్లా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా జిల్లా కేంద్రంలో 57 రకాల పరీక్షలు చేయించుకునే వెసులుబాటు కల్పించింది.

గతంలో ప్రాథమిక, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యానికి వచ్చిన వారికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయకుండానే చికిత్స చేసేవారు. ఎంతకూ తగ్గకపోతే పెద్ద ఆసుపత్రికి వెళ్లాలని, లేదా బయట రోగ నిర్ధారణ పరీక్షలు చేయించాలని సూచించే వారు. ఇప్పడు కేంద్రం అందుబాటులోకి రావడంతో అటువంటి పరిస్థితి లేదు. ఆసుపత్రికి వచ్చే వారి నుంచి రక్త నమూనాలు సేకరించి వికారాబాద్‌ రోగ నిర్ధారణ పరీక్షా కేంద్రానికి పంపిస్తున్నారు. ఫలితాల ప్రకారం వైద్య నిపుణులు చికిత్స జరుపుతున్నారు. ఉదయం పరీక్షించి, 24 గంటల్లో సంబందిత వ్యక్తి చరవాణి నంబరుకు, ఆసుపత్రికి నివేదిక పంపిస్తున్నారు. నిర్వహణ బాగుందని ఇటీవల ఆసుపత్రిని సందర్శించిన కేంద్ర బృందం సిబ్బందిని అభినందించింది.

వికారాబాద్‌ సామాజిక ఆరోగ్య కేంద్రంలో రూ.3.50 కోట్లతో జూన్‌ 9న ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. వివిధ ఆసుపత్రుల నుంచి నమూనాల సేకరణకు ఇటీవల ఆరు వాహనాలను సమకూర్చారు. వీటి ద్వారా కార్యకలాపాలు మరింత విస్తృతపరిచారు. ప్రస్తుతం జిల్లాలోనే కాకుండా ఇతర జిల్లాల నుంచి నమూనాలను సేకరిస్తున్నారు. జిల్లా ఆసుపత్రి, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచే కాకుండా సంగారెడ్డి జిల్లా మల్‌చెల్మ, రంగారెడ్డి జిల్లా షాబాద్‌, కొందుర్గు, శంకర్‌పల్లి, టంగుటూర్‌, మోయినాబాద్‌, చేవెళ్ల ఆసుపత్రుల నుంచి రక్త నమూనాలను ఈ కేంద్రానికి పంపిస్తున్నారు.

ఇప్పటివరకు 14,884..: కేంద్రం ప్రారంభం నుంచి ఈనెల 14వ తేదీ వరకు నాలుగున్నర నెలల్లో 14,884 రక్త నమూనాలను పరీక్షించి ఫలితాలను వెల్లడించారు. నిత్యం 300 వరకు చేస్తున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ప్రతి సోమ, శుక్రవారాల్లో గర్భిణులు వస్తారు. ఈ రెండు రోజులు నమూనాలు సంఖ్య అధికంగా ఉంటుందని సిబ్బంది పేర్కొంటున్నారు. వైద్యం అందించడంలో రోగ నిర్ధారణ పరీక్షలే కీలకం. ఇందుకోసం ఆధునిక పరికరాలు వినియోగిస్తున్నారు. వీటిలో ఒక్కో యంత్రం గంటకు 400 నుంచి 700 వరకు నివేదికలను అందజేస్తోంది. కేంద్రం నోడల్‌ అధికారి, మేనేజర్‌, సీనియర్‌ ల్యాబ్‌ టెక్నిషీయన్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్‌ విధులు నిర్వహిస్తున్నారు.

అంతా ఉచితం : డాక్టర్‌ బెజిలిల్‌, నోడల్‌ అధికారి

వికారాబాద్‌ రోగ నిర్ధారణ పరీక్షా కేంద్రంలో ప్రతి నెలా 3 వేల వరకు పరీక్షలు జరుపుతున్నాం. 57 రకాల పరీక్షలు చేస్తున్నాం. ఇందులో కొన్ని ఖరీదైనవి ఉన్నా, ఉచితమే. 33 ఆసుపత్రుల నుంచి నమూనాలు ఇక్కడికు పంపిస్తున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని