close

ఆదివారం, జులై 21, 2019

ప్రధానాంశాలు

ప్రైవేటు ట్యాంకర్ల నీటితో వ్యాధుల ముప్పు!

కలుషిత నీటిని  సరఫరా చేస్తున్న వైనం
శివార్లలోని  చెరువుల చుట్టూ అక్రమ బోర్లు
డిమాండ్‌  దృష్ట్యా అధిక ధరల వసూలు
ఈనాడు, హైదరాబాద్‌

గ్రేటర్‌ వ్యాప్తంగా మంచి నీటి ట్యాంకర్లకు ఏర్పడిన డిమాండ్‌ను కొందరు సొమ్ము చేసుకుంటున్నారు. ప్రైవేటు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్న నీళ్లలో కనీస నాణ్యత ఉండటం లేదు. చాలా ప్రాంతాల్లో కలుషిత జలాలను సరఫరా చేస్తున్నారు. శివార్లలో ఈ దందా జోరుగా నడుస్తోంది. సింగూరు, మంజీరా ప్రాజెక్టులు అడుగంటడంతో ఒకేసారి నీటి సరఫరాకు విఘాతం ఏర్పడింది. శేరిలింగంపల్లి, మాదాపూర్‌, కొండాపూర్‌, గచ్చిబౌలి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌, ముసాపేట, అమీర్‌పేట, సనత్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో చాలా మంది ట్యాంకర్ల కోసం జలమండలికి ఫోన్లు చేసి బుక్‌ చేస్తున్నారు. వాస్తవానికి బుక్‌ చేసిన 24 గంటల్లోనే ట్యాంకర్‌ను సరఫరా చేయాలి. నెల రోజుల నుంచి ట్యాంకర్లకు విపరీతమైన డిమాండ్‌ ఏర్పడింది. వారం, పది రోజులకు కూడా ట్యాంకర్ల జాడ కనిపించడం లేదు. నిత్యం ఏడువేల కాల్స్‌ వరకు వస్తుంటే.. గరిష్ఠంగా 4500 కు మించి సరఫరా చేయలేక పోతున్నారు. మిగతా 3500 ట్యాంకర్లు పెండింగ్‌ జాబితాలోకి చేరుతున్నాయి. ఇలా నిరీక్షణ జాబితా చాంతాడంత పెరుగుతోంది. ఈ నేపథ్యంలో చాలామంది రోజువారీ అవసరాల కోసం ప్రైవేటు ట్యాంకర్లను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా ధర పెంచుతున్న ప్రైవేటు ట్యాంకర్ల వారు కనీసం స్వచ్ఛమైన నీటిని సరఫరా చేయడం లేదని జనం వాపోతున్నారు.
చెరువుల్లో బోర్లు..
నగరం చుట్టూ చాలా చెరువులు ఉన్నాయి. పారిశ్రామిక వాడల నుంచి వస్తున్న వ్యర్థాలతో ఇవి నిండిపోతున్నాయి. ప్రైవేటు ట్యాంకర్ల నిర్వాహకులు ఈ చెరువుల చుట్టూ పక్కల అక్రమంగా బోర్లు వేసి ఆ నీటిని ఇళ్లకు సరఫరా చేస్తున్నారు. రసాయనక వ్యర్థాలు కలిసి ఉండటంతో ఈ నీళ్లు ఘాటు వాసనలు వస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. వేరే దారి లేక ఆ నీటినే తెప్పించుకోవాల్సి వస్తోందని చెబుతున్నారు. మాదాపూర్‌, మియాపూర్‌ పరిధిలోని సున్నం చెరువు, తమ్మిడికుంట, మొండికుంట, అమీన్‌పుర చెరువు, గంగారం పెద్ద చెరువు, ప్రగతి నగర్‌ చెరువుల సమీపంలో వందల సంఖ్యలో అక్రమ బోర్లు ఉన్నాయి. ఇక్కడ నుంచే నీటిని ప్రైవేటు ట్యాంకర్లు తరలిస్తున్నారు. బోరు నుంచి వచ్చే నీటి స్వచ్ఛతను సైతం పరిశీలించకుండానే సరఫరా చేస్తున్నారు. ఇక కొందరు ప్రైవేటు స్థలాల్లో బోర్లు వేసి నీటిని అమ్ముకుంటున్నారు. జలమండలి సరఫరా ట్యాంకర్లు ధరలకు అందిస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదు. ప్రైవేటు ట్యాంకర్ల వారు మాత్రం డిమాండ్‌ను బట్టి రెండింతలు ధరలు వసూలు చేస్తున్నారు. అయిదు వేల లీటర్లు ఉన్న ట్యాంకర్‌ను గృహ అవసరాలకు రూ.500కే జలమండలి సరఫరా చేస్తోంది. అదే వాణిజ్య అవసరాలకు రూ.850 తీసుకుంటున్నారు. దీనికి రెండు రెట్లు ప్రైవేటు ట్యాంకర్ల వారు కొన్ని ప్రాంతాల్లో ప్రజల నుంచి గుంజుతున్నారు. దీనికి తోడు కలుషిత జలాలు కావడంతో అంటు వ్యాధులు సోకే ప్రమాదం ఉంది. డయేరియా, టైపాయిడ్‌, పచ్చకామెర్లు, చర్య వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసే నీళ్లు వాసన రావడం, రుచిలో తేడా కన్పిస్తే వాడకూడని వైద్యులు హెచ్చరిస్తున్నారు. స్నానం చేసిన తర్వాత దురదలు రావడం, చర్మం ఎర్రగా మారితే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. కలుషిత నీటిని సరఫరా చేసే ప్రైవేటు ట్యాంకర్లపై నిఘా పెట్టాల్సిన అవసరం కూడా ఉంది.
రికార్డు స్థాయిలో డిమాండ్‌
జలమండలి సరఫరా చేసే ట్యాంకర్లకు రికార్డు స్థాయిలో డిమాండ్‌ పెరిగింది. మేలో దాదాపు 1.05లక్షల మంది ట్యాంకర్ల కోసం బుక్‌ చేసుకున్నారు. ఏప్రిల్‌తో పోల్చితే దాదాపు 20 వేల అదనం. జలమండలి వద్ద దాదాపు వెయ్యి ట్యాంకర్లు ఉన్నాయి. ఇందులో 200 ట్యాంకర్లను ఉచిత ట్రిప్పులకు వాడుతున్నారు. మిగిలిన ట్యాంకర్లతో నీటిని జలమండలి విక్రయిస్తోంది. వాటికి డిమాండ్‌ పెరగడంలో సకాలంలో సరఫరా చేయలేని పరిస్థితి ఏర్పడింది. 9, 10, 11 డివిజన్లలో బుక్‌ చేసిన వారం, పదిరోజులకు కూడా అందజేయలేక పోతున్నారు. నగర వ్యాప్తంగా 60నుంచి70 వేల బోర్లు ఎండిపోవడం కూడా ఒక కారణం. రుతుపవనాలు మరింత ఆలస్యం కానుండటంతో ట్యాంకర్లకు మరింత డిమాండ్‌ తప్పదని అధికారులు భావిస్తున్నారు. వర్షాలు పడి వాతావరణం చలగా మారితే డిమాండ్‌ తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.