close

శనివారం, అక్టోబర్ 19, 2019

ప్రధానాంశాలు

డొల్ల కళాశాలలకు గడ్డుకాలమే!

న్యాక్‌ గుర్తింపు  ఉంటేనే ఆదరణ
ప్రాంగణ ఎంపికలపైనా ఆరా
 గుర్తింపు కళాశాలలకే ప్రాధాన్యం ఇస్తున్న అభ్యర్థులు
ఈనాడు, హైదరాబాద్‌

పేరున్న ప్రముఖ కళాశాలలో ఏదో ఒక కోర్సులో సీటు వస్తే చాలనుకునే రోజులు పోయాయి. ఎవరో చెప్పారని చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపడం లేదు. సొంతంగా అన్ని విషయాలనూ సమగ్రంగా పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా చేరబోయే కళాశాలకు న్యాక్‌ గుర్తింపు ఉందా? గతంలో ఎన్ని సంస్థలు ప్రాంగణ ఎంపికలకు వచ్చాయి? వాటిలో ఎంత మంది చేరారు? ఆ కళాశాలల్లో వసతులు ఎలా ఉన్నాయి? నిపుణులైన అధ్యాపకులు ఉన్నారా? తదితర సమగ్ర వివరాలు తెలుసుకుంటున్నారు. ఆ తర్వాతే ఆ కళాశాలలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కళాశాలలకు న్యాక్‌ గుర్తింపు ఉంటేనే అందులో చేరతామంటూ తెగేసి చెబుతున్నారు. నచ్చిన కోర్సులను ఎంపిక చేసుకొని అందులో సీటు వస్తేనే చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఆ కోర్సులో సీటు రాకపోతే ఇతర కళాశాలల్లో చేరేందుకు మొగ్గు చూపుతున్నారు. గ్రేటర్‌లోనే ఎక్కువ డిగ్రీ, ఇంజినీరింగ్‌ కళాశాలలు ఉన్నాయి. వీటిల్లో చాలా డొల్ల కళాశాలలు ఉన్నాయి. ఫీజు రియంబర్స్‌మెంటు నిధులు వస్తాయనే కోణంలో అప్పట్లో కళాశాలలు పుట్టుకొచ్చాయి. ప్రస్తుతం వీటిల్లో చాలా మూతపడుతూ వస్తున్నాయి. నిబంధనల ప్రకారం అన్నీ ఉంటేనే జేఎన్‌టీయూ, ఉస్మానియా విశ్వవిద్యాలయాలు ఆయా కళాశాలలకు గుర్తింపు ఇస్తున్నాయి. కళాశాలలను మూసుకొనేందుకే యాజమాన్యాలు మొగ్గు చూపుతున్నాయి. న్యాక్‌ గుర్తింపు విద్యాసంస్థలకు తప్పనిసరిగా ఉండాలని కేంద్రం నిబంధన పెట్టడంతో కళాశాలలు ఆ దిశగా సాగుతున్నాయి. న్యాక్‌లో మెరుగైన శ్రేణి గుర్తింపు దక్కించుకునేందుకు విద్యాసంస్థలు పోటీ పడుతున్నాయి. వసతుల కల్పనపైనా దృష్టి పెడుతున్నాయి.
10 వేల సీట్లు కోత... కాలం చెల్లిన కోర్సుల్లో విద్యార్థులు చేరే పరిస్థితి లేదు. భవిష్యత్తు బాగుంటుందనుకున్న కోర్సులనే ఆదరిస్తున్నారు ఒకప్పుడు ఎంతో పోటీపడే కొన్ని కోర్సులు ప్రస్తుతం నిరాదరణకు గురవుతున్నాయి. 2019-20 విద్యా సంవత్సరంలో ఇంజినీరింగ్‌ కళాశాలల్లోనే సుమారు 10 వేల సీట్లకు కోతపడింది. ఎన్ని కోర్సులు ఉన్నాయి... వాటిల్లో ఎన్ని సీట్లు.. తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని అధ్యాపకులను ఆయా కళాశాలలు భర్తీ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకరిద్దరు విద్యార్థులే ఉన్న కోర్సులకూ తప్పకుండా ఆ సబ్జెక్టులో నిపుణులైన అధ్యాపకులను భర్తీ చేసుకోవాల్సిందే. ఈ నిబంధనతో ఆదరణ లేని చాలా కోర్సులు రద్దు చేసుకునేందుకు కళాశాలలే ముందుకు వస్తున్నాయి. గత విద్యా సంవత్సరంలో 43 డిగ్రీ కళాశాలల్లో ఒక్క అభ్యర్థీ చేరలేదు. ఇలాంటివి అన్నీ మూతపడుతూ వస్తున్నాయి. గత ఏడాదిలో డిగ్రీ కళాశాలల్లో నూరుశాతం సీట్లు నిండినవి 10 కళాశాలలే ఉండటం విశేషం.
తరగతుల నిర్వహణ తప్పనిసరి...
గ్రేటర్‌లో ఉన్న చాలా ఇంజినీరింగ్‌, డిగ్రీ కళాశాలలకు విద్యార్థులు రాకపోయినా హాజరు వేసేసి పరీక్షలకు అనుమతి ఇచ్చేసే విధానం కొన్నేళ్ల నుంచి సాగుతోంది. 2018-19 విద్యా సంవత్సరంలో జేఎన్‌టీయూ, ఉస్మానియా విశ్వవిద్యాలయాలు బయోమెట్రిక్‌ విధానాన్ని తెరమీదకు తెచ్చాయి. కళాశాలల్లో తరగతులకు విద్యార్థులు తప్పకుండా హాజరైతేనే పరీక్షలకు అనుమతించే విధానాన్ని తెరమీదకు తెచ్చింది. 75 శాతం హాజరు లేకపోతే విద్యార్థులను పరీక్షలకు అనుమతించట్లేదు. దీంతో విద్యార్థులు కళాశాలలకు వస్తున్నారు. కళాశాలలు తప్పనిసరిగా తరగతులను నిర్వహిస్తున్నాయి. విద్యాసంస్థలకు న్యాక్‌ గుర్తింపు ఉంటేనే విద్యార్థులు చేరుతున్నారు. దీంతో డొల్ల కళాశాలలు మూతపడుతున్నాయి. రెండేళ్లలో గ్రేటర్‌లో సుమారు 20 ఇంజినీరింగ్‌ కళాశాలలు, 40కిపైగా డిగ్రీ కళాశాలలు మూతపడ్డాయి. అభ్యర్థులు కళాశాలను ఎంచుకునేటప్పుడు అన్ని విషయాలనూ సమగ్రంగా పరిశీలించడం మంచి పరిణామం అని విద్యారంగ నిపుణులు వివరిస్తున్నారు

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.