close

సోమవారం, డిసెంబర్ 09, 2019

ప్రధానాంశాలు

బతుకు బండి తిరగబడింది

ఉపాధి కోసం ప్రత్యామ్నాయాల వైపు ఆర్టీసీ కార్మికులు

చిన్నచిన్న పనులు చేస్తూ కుటుంబాలను నెట్టుకొస్తున్న వైనం

సాఫీగా సాగుతున్న బతుకు బండి... కుదుపునకు లోనై చక్రాలకు ఒక్కసారిగా బ్రేక్‌ పడింది. అంతే బతుకు బండి రివర్స్‌ గేర్‌లోకి మారిపోయింది. సమ్మెతో నిలిచిపోయిన ఆదాయం కోసం ఆర్టీసీ కార్మికులు ప్రత్యామ్నాయ మార్గాల కోసం అన్వేషిస్తున్నారు. ఉద్యోగంలో చేరకముందు చేసిన పని.. కుల వృత్తినే ఆధారం చేసుకొని కుటుంబ పోషణ కోసం పడరాని పాట్లు పడుతున్నారు. సమ్మె వ్యవహారం తేలే వరకు ఇంటి అవసరాలు తీర్చుకోకుండా ఉండలేని పరిస్థితి. ఒకరికి వైద్య ఖర్చులు... మరొకరికి ఇంటి అద్దెలు... పిల్లల ఫీజులు... బ్యాంకు రుణాలు.. ఇలా ప్రతి అవసరానికి అప్పు చేయాల్సిన దుస్థితి వారిది. బస్సు చక్రాలు ఆగిపోయినట్లు అవసరాలను ఆపలేం. అందుకే ఆర్టీసీలో చేరకముందు చేసిన బీడీలు చుట్టడం... టైలరింగ్‌... వ్యవసాయ పనులను నమ్ముకొని ధైర్యాన్ని కూడదీసుకుంటున్నామని ‘న్యూస్‌టుడే’తో వారు పేర్కొంటున్నారు.

ఫీజులు చెల్లించడం కష్టమవుతోంది

బాల్కొండ: నా పేరు ఆర్‌ శ్రీనివాస్‌. ఆర్మూర్‌ డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్నాను. బాల్కొండ మండలం కిసాన్‌నగర్‌ స్వగ్రామం. గత రెండు నెలలుగా వేతనాలు రాకపోవడంతో బీడీ వృత్తినే నమ్ముకున్నారు. కుటుంబ సభ్యులు బీడీ టేకేదారుగా కొనసాగుతుండడంతో ఆ పనిలోనే కుదురుకున్నాను. పెద్దగా ఆదాయం లేకున్నా.. కుటుంబ పోషణ కోసం పనిచేయాల్సి వస్తోంది. ఒక్కరు చేసే పనినే.. ఇద్దరం చేస్తున్నాం. సెప్టెంబరులో పనిచేసినా.. అక్టోబరులో వేతనాలు ఇవ్వలేదు. రెండు నెలలుగా జీతం లేక కుటుంబ పోషణ భారంగా మారింది. పిల్లల ఫీజులు చెల్లించలేక పోతున్నాం. నా కొడుకు నిజామాబాద్‌లో ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ చదువుతున్నాడు. సకాలంలో ఫీజు చెల్లించకపోవడంతో ఇంటికి పంపారు. అప్పు చేసి ఫీజు చెల్లించాను. సమ్మెతో వేతనాలు రాక ఇబ్బందిపడుతున్నాం. ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించాలి.

లారీ నడుపుతూ..

ఎల్లారెడ్డి: లారీ డ్రైవర్‌గా మారిన ఈ వ్యక్తి పేరు బాస్కర్‌. బాన్సువాడ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. 11 ఏళ్లుగా బస్సును నడుపుతున్నా ఆయనకొచ్చే వేతనం అంతంత మాత్రమే. ఏ నెల జీతం ఆ నెలకే సరిపోతుంది. ఇప్పుడు మరీ కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత సమ్మె కారణంగా జీతాలు రాక కుటుంబాన్ని పోషించుకోవడానికి గతంలో లారీ డ్రైవర్‌గా పనిచేసేవారు. ఆ పనిలోనే మళ్లీ కుదిరారు. ఎంత ఇబ్బందైనా పోరాటం చేస్తామని, తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తే కష్టాలు తొలగుతాయని పేర్కొంటున్నారు.

ఖర్చుల కోసం దర్జీగా మారి..

ఎల్లారెడ్డి: ఇక్కడ టైలరింగ్‌ పనులు చేస్తున్న వ్యక్తి బాన్సువాడ డిపోలో కండక్టరు. ఆయన పేరు నర్సింలు. ఎల్లారెడ్డి పట్టణంలో నివాసం ఉంటారు. సమ్మె కారణంగా చేతిలో డబ్బులు లేక కుటుంబ పోషణకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఖర్చుల కోసం సోదరుడి టైలరింగ్‌ షాపులో దర్జీగా మారి విధులు నిర్వర్తిస్తున్నారు. పదేళ్లుగా కండక్టరుగా పనిచేస్తున్నా.. అరకొర ఆదాయమే వస్తోంది. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, అందుకే కుటుంబ పోషణకు టైలరింగ్‌ చేస్తున్నానని చెప్పారు. న్యాయస్థానం కార్మికుల పక్షాన ఉందని, సమస్యలు పరిష్కారమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

పొలం దున్నుకుంటున్నారు

 

మద్నూర్‌: మద్నూర్‌ మండలం మేనూర్‌కు చెందిన అశోక్‌ గత ఐదేళ్లుగా బాన్సువాడ ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. సమ్మె బాట పటడంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. తప్పని పరిస్థితుల్లో డ్రైవర్‌గా మారి తన పొలాన్ని దున్నుకుంటున్నారు. తాను ముందునుంచీ రైతుని, పనులన్నీ వస్తాయని చెప్పారు.

ఎక్కడైనా కలిసే పనిచేస్తాం..

డిచ్‌పల్లి గ్రామీణం: ఈ చిత్రాన్ని గమనించండి.. డిచ్‌పల్లికి చెందిన మామిడాల దేవేందర్‌ (కండక్టర్‌), ఘన్‌పూర్‌కు చెందిన బొల్లారం గంగాధర్‌ (డ్రైవర్‌) ఇద్దరు కామారెడ్డి డిపోలో పనిచేస్తున్నారు. గత 41 రోజులుగా ఆర్టీసీ సమ్మె కొనసాగుతుండడంతో వారిద్దరూ గతంలో చేసిన వృత్తులను నమ్ముకున్నారు. కండక్టర్‌ దేవేందర్‌ చొక్కాలను కుడుతుండగా.. డ్రైవర్‌ గంగాధర్‌ కొత్త దుస్తులకు ఇస్త్రీ చేస్తున్నారు. డిపోలో ఇద్దరు కలిసే పనిచేస్తుండేవారు. ఇప్పుడు కూడా టైలర్‌ దుకాణంలో కలిసే పనిచేస్తూ కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. ముఖ్యమంత్రి వెంటనే ఆర్టీసీ సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు. ఏ వృత్తి రాని కార్మికుల కుటుంబాలు దుర్భరంగా మారాయని, దసరా, దీపావళి పండుగలను సైతం చేసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

రైతుకూలీగా సత్తార్‌

ఎల్లారెడ్డి: పొలం పనులు చేస్తున్న ఈ వ్యక్తి పేరు సత్తార్‌. గత 30 ఏళ్లుగా ఆర్టీసీ డ్రైవర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. రెండు నెలలుగా వేతనాలు రాకపోవడంతో స్వగ్రామం గండిమాసానిపేట్‌లో రైతు కూలీగా అవతారమెత్తారు. తన పొలం పనులతో పాటు ఇతర రైతుల వద్ద కూలీ పనులు చేస్తూ ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు కష్టపడుతున్నారు. ప్రభుత్వం ఇకనైనా తమ కష్టాలను చూసి డిమాండ్లను పరిష్కరించాలని వేడుకుంటున్నారు.

పత్తి ఏరుతున్న ప్రకాశ్‌రావు

కామారెడ్డి గ్రామీణం: కామారెడ్డి మండలం ఇస్రోజివాడికి చెందిన లోకోటి ప్రకాశ్‌రావు కామారెడ్డి డిపోలో డ్రైవరుగా పనిచేస్తున్నారు. కొన్నాళ్లుగా గ్రామంలోనే వ్యవసాయ కూలీగా మారారు. ప్రస్తుతం రోజూ పత్తి ఏరేందుకు వెళ్తున్నారు. రోజుకు రూ. 300 వరకు కూలి పడుతోందని ఆయన ‘న్యూస్‌టుడే’తో చెప్పారు. ఉద్యోగంలో చేరకముందు వ్యవసాయపనులు చేసేవాణ్ని అని.. తిరిగి ఆ పనినే నమ్ముకున్నట్లు వివరించారు. ఎంత కష్టమైనా ఉద్యమం ఆపమంటున్నారు.

బీడీ కార్మికురాలిగా..

ఎల్లారెడ్డి: టిక్కెట్లు ఇచ్చే చేతితోనే బీడీలు చుడుతున్న ఈమె పేరు సవిత. పదేళ్లుగా బాన్సువాడ డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్నారు. ఉద్యోగం చేస్తూ కుటుంబ పోషణలో భాగస్వామ్యమవుతున్న ఆమెకు రెండు నెలలుగా వేతనాలు రావడం లేదు. ఇంటి అవసరాలకు డబ్బులు లేకపోవడంతో గత కొన్నిరోజులుగా బీడీలు చుడుతున్నారు. మానవతా దృక్పథంతో ప్రభుత్వం స్పందించి ఆర్టీసీ సమస్యలు పరిష్కరించాలని ఆమె కోరుతున్నారు.

బీడీలు చుడుతూ.. బతుకు వెళ్లదీస్తూ..

ఎల్లారెడ్డి: బీడీలు చుడుతున్న ఈమె పేరు రాణి. గత నాలుగేళ్లుగా బాన్సువాడ డిపోలో కండక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. వృత్తిలో అష్టకష్టాలు పడుతున్న తమకు సరైన వేతనం లభించడం లేదని సమ్మెకు వెళ్లారు. రోజు రోజుకు కుటుంబ పోషణ భారంగా మారుతోంది. ఇంటిని నెట్టుకురావడం కోసం బీడీలు చుడుతున్నారు. వచ్చే డబ్బులతో ఇంటి అవసరాలు తీర్చుకుంటున్నారు. మా కష్టాలను చూసైనా ప్రభుత్వం దయ చూపాలని ఆమె కోరుతున్నారు.

ట్రాక్టర్‌ డ్రైవర్‌గా

ఎల్లారెడ్డి: ట్రాక్టర్‌ నడుపుతున్న ఈ వ్యక్తి పేరు హజీపాషా. 20 ఏళ్లుగా బాన్సువాడ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. సమ్మె కారణంగా వేతనాలు రాకపోవడంతో పిల్లల చదువు, కుటుంబ పోషణ భారంగా మారింది. స్వగ్రామం ఎల్లారెడ్డిలో ట్రాక్టర్‌ డ్రైవర్‌గా మారారు. నిత్యం వచ్చే కూలీ డబ్బులతో సర్దుకుంటున్నారు. ఇకనైనా కార్మికుల సంక్షేమం గురించి ఆలోచించి ప్రభుత్వం చర్చలు జరిపి తమ డిమాండ్లను పరిష్కరించాలని పేర్కొంటున్నారు.
 

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.