close

శనివారం, జనవరి 18, 2020

ప్రధానాంశాలు

బడ్జెట్

సమన్వయం.. అభివృద్ధి ఘనం

ఆదర్శంగా మేడ్చల్‌ మండలంలోని మునీరాబాద్‌
మద్యం, పాలిథిన్‌ సంపూర్ణ నిషేధం
ఈనాడు, హైదరాబాద్‌, న్యూస్‌టుడే, మేడ్చల్‌ రూరల్‌

 

ఎటుచూసినా పచ్చదనం.. మచ్చుకైనా కనిపించని ప్లాస్టిక్‌ వినియోగం.. మౌలిక వసతుల కల్పనలో వడివడిగా సాగుతూ ఆ గ్రామం అభివృద్ధిలో దూసుకుపోతోంది. కలెక్టర్‌ ప్రత్యేక చొరవ తీసుకుని సలహాలు, సూచనలు అందించడంతో ప్రత్యేకంగా గుర్తింపు సాధిస్తోంది. అదే నగర శివారు మేడ్చల్‌ మండలంలోని మునీరాబాద్‌ గ్రామం. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన 30 రోజుల ప్రణాళికలో వివిధ కార్యక్రమాలను సమర్థంగా అమలు చేయడంతో మండలస్థాయిలో ఉత్తమంగా నిలిచి ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల ప్రశంసలు అందుకుంది. దాదాపు పుష్కరం కిందటే బహిరంగ మలమూత్ర విసర్జన రహిత గ్రామంగా నాటి రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం చేతులమీదుగా జాతీయ నిర్మల్‌ గ్రామీణ పురస్కారం అందుకోవడం మునీరాబాద్‌ మరో ప్రత్యేకత. గ్రామంలోని ప్రజలు హరిత స్ఫూర్తిని అందుకుని ముందుకు సాగుతున్నారు. పంచాయతీ తరఫున ఇంటింటికి ఆరు మొక్కలను పంపిణీ చేశారు. వాటిని నాటి సంరక్షించి పల్లెకు పచ్చందాలు అందిస్తున్నారు.

కలెక్టర్‌ పర్యటనతో..
మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్‌ ఎంవీరెడ్డి గ్రామాల్లో వసతులు, అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. 30 రోజుల ప్రణాళికలో భాగంగా మునీరాబాద్‌లో పర్యటించి పది అంశాల అమలు తీరును పరిశీలించి అధికారులకు, ప్రజాప్రతినిధులకు సూచనలు చేశారు. వాటిని పక్కాగా అమలు చేసి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపారు. ఆయన చొరవతో గ్రామ రూపురేఖలే మారిపోయాయి.

* పంచాయతీ ఆవిర్భావం : 1981
* ఆవాసాలు 525
* జనాభా 1790 (2011 లెక్కల ప్రకారం)
* గ్రామంలోని సౌకర్యాలు: ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం.

ఇవీ చేపట్టిన అభివృద్ధి పనులు..
* రూ.9 లక్షలతో గ్రామంలో అంతర్గత మురుగు కాలువలు, డీఎంఎఫ్‌టీ నిధులు రూ.14.50 లక్షలతో రోడ్లు, పాఠశాల మరమ్మతులు
* రూ.2 లక్షలతో డంపింగ్‌యార్డు నిర్మాణం
* హరితహారం కార్యక్రమం ఎవెన్యూ ప్లాంటేషన్‌లో భాగంగా 416 మొక్కలను రోడ్డుకు ఇరువైపులా నాటి సంరక్షిస్తున్నారు.
* వైకుంఠధామం, డంపింగ్‌యార్డుల నిర్మాణానికి రూ.1.30 లక్షలతో పనులను చేపట్టి సుందరంగా తీర్చిదిద్దారు.
* విద్యుత్‌శాఖ అధికారుల సమన్వయంతో విద్యుత్‌ సమస్యలు లేని గ్రామంగా రూపుదిద్దుకుంది.
* నూతన నర్సరీ ఏర్పాటు.
* తడి, పొడి చెత్త వేరు చేసేందుకు చెత్త బుట్టల పంపిణీ.
* గ్రామంలో పాలిథిన్‌ నిషేధం పక్కాగా అమలు చేస్తూ, మద్యం గొలుసు దుకాణాలను పూర్తిగా తొలగించారు.
* గ్రామస్థుల సహకారంతో వంద ఇంకుడుగుంతలను నిర్మించారు.

గ్రామాలన్నీ అభివృద్ధి బాట పట్టాలి
- ఎంవీ.రెడ్డి, కలెక్టర్‌, మేడ్చల్‌-మల్కాజిగిరి
ప్రభుత్వం చేపట్టిన 30 రోజుల ప్రణాళిక ప్రకారం గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టాం. అన్ని గ్రామాల్లో వసతుల కల్పనకు శ్రీకారం చుట్టాం. మునీరాబాద్‌లో స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు సంయుక్తంగా ముందడుగు వేసి అభివృద్ధి సాధించారు. జిల్లాలోని అన్ని గ్రామాలు ఇదే స్ఫూర్తిని అందిపుచ్చుకుంటున్నాయి.

అందరి సహకారంతోనే..
- గణేష్‌, సర్పంచి, మునీరాబాద్‌
గ్రామాభివృద్ధికి ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టాం. మంత్రి మల్లారెడ్డి, జిల్లా కలెక్టర్‌ ఎంవీ రెడ్డి ఎంతో ప్రోత్సాహం అందించారు. వారి సహకారంతో గ్రామాన్ని మండలంలో ఉత్తమంగా నిలిపాం. ఇదే స్ఫూర్తిని కొనసాగించి జిల్లా స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చేందుకు కృషి చేస్తాం.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.