close

మంగళవారం, జనవరి 28, 2020

ప్రధానాంశాలు

మేడారం

జాబితా.. ఆమోదితమేనా

అభ్యంతరాలు అరకొరే

ఇక రెండు రోజులే గడువు

ఈనాడు, నిజామాబాద్‌

13వ డివిజన్‌లోని సారంగాపూర్‌లో ధర్మపురి హిల్స్‌, ఆటోనగర్‌, సతీష్‌నగర్‌

ప్రాంతాలను కలపొద్దని కాలనీవాసులు కమిషనర్‌కు విన్నవించారు.

పురపాలక ఎన్నికల నేపథ్యంలో వార్డు జాబితాలపై అభ్యంతరాల స్వీకరణ గడువు రెండు రోజుల్లో ముగియనుంది. ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులు చూస్తే ఆమోదితంగానే భావిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చిన అరకొర వినతులు కూడా వ్యక్తిగతంగా అందించినవే. రాజకీయ పార్టీల నుంచి ఇంకా ఎలాంటి స్పందన లేదు. అన్ని అంశాలు నిశితంగా పరిశీలించాకే జాబితాలు తయారు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. గతంలో జనం నుంచి వచ్చిన ఫిర్యాదులను ఇప్పటికే పరిష్కరించినట్లు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఏవైనా అభ్యంతరాలుంటే గడువు ముగిసే లోపు యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లాల్సి ఉంది. లేని పక్షంలో ప్రస్తుతం కార్యాలయాల్లో ప్రదర్శించిన వివరాలతోనే ఎన్నికలకు వెళ్తారు.

ఉమ్మడి జిల్లాలోని నిజామాబాద్‌ నగరపాలక సంస్థతో పాటు ఆరు మున్సిపాలిటీల్లో గతంలో రూపొందిన జాబితాల్లో అనేక పొరపాట్లు చోటు చేసుకున్నాయి. వీటిపై పత్రికల్లో కథనాలు వచ్చాయి. రాజకీయ పార్టీలు కొన్నింటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లాయి. ముసాయిదా జాబితాల్లో ఇవేవీ సవరించకపోవటంతో కొందరు కోర్టును ఆశ్రయించారు. కోర్టు తీర్పు నేపథ్యంలో ఎన్నికల ఏర్పాట్లను మరోమారు పునఃపరిశీలనకు అవకాశం ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే జులైలో చేసిన వార్డుల విభజనపై అభ్యంతరాలు తెలిపేందుకు ఈ నెల 9వ తేదీ వరకు అవకాశమిచ్చారు. ప్రజల నుంచి వచ్చే అభ్యంతరాలను పరిష్కరించి జాబితాలు అందివ్వాల్సి ఉంటుంది.

ఆశావహుల నుంచే..

పురపోరులో బరిలోకి దిగాలనే ఆలోచన చేస్తున్న పలువురు ఆశావహులు జాబితాలపై దృష్టి పెట్టారు. తమ వార్డు సంఖ్య, ఏ కాలనీలు వస్తున్నాయి, విభజన సరిగా చేశారా అనే అంశాలను పరిశీలిస్తున్నారు. వీరు ఇప్పటికే ఆయా మున్సిపాలిటీల్లో ఫిర్యాదులు అందించారు. కానీ వీరి సంఖ్య స్వల్పంగానే ఉంది.

వచ్చిన ఫిర్యాదులు ఇవే..

● నిజామాబాద్‌ నగరపాలక సంస్థలో నాగారం ప్రాంతం 9వ డివిజన్‌గా ఏర్పాటైంది. పెద్దబజార్‌, సాయినగర్‌ ఈ డివిజన్‌లో కలపటంపై స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. వడ్డెర లేబర్‌ కాంట్రాక్ట్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీ, వడ్డెర సంఘం వారు శుక్రవారం ఫిర్యాదు చేశారు. 9వ డివిజన్‌లో ఉండాల్సిన ఓటర్లను 10లోకి, 8వ డివిజన్‌లో ఉండాల్సినవి 9లో వచ్చాయన్నారు. మార్పు చేయాలని విన్నవించినట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు. హమాల్‌వాడీ ప్రాంతం 36 డివిజన్‌ ఓటర్ల వివరాలు నాగారం, దుబ్బ ప్రాంత పోలింగ్‌ కేంద్రాల్లోని జాబితాల్లో వచ్చాయని ఫిర్యాదులొచ్చాయి.

బోధన్‌ మున్సిపాలిటీలో సరస్వతినగర్‌, పాతబోధన్‌, అనితానగర్‌ ప్రాంతాల వాసులు అభ్యంతరాలు తెలిపారు. ఒక కాలనీ వాసులందరూ ఒకే వార్డులో ఉండేలా చూడాలని, విభజన శాస్త్రీయంగా జరపలేదని విన్నవించారు.

ఆర్మూర్‌లో రెండు దరఖాస్తులొచ్చాయి. పట్టణంలోని అంబేడ్కర్‌ కూడలిని ప్రామాణికంగా తీసుకొని ఉత్తరం, తూర్పు, దక్షిణం, పడమర దిక్కుల ప్రమాణాలను పాటిస్తూ వార్డుల విభజన చేశామని అధికారులు చెబుతున్నారు. జిరాయత్‌నగర్‌ నుంచి మొదలై పెర్కిట్‌, కోటార్మూర్‌, మామిడిపల్లి, మీదుగా తిరిగి జిరాయత్‌నగర్‌ సమీపానికి విభజన ముగిసింది. కాగా ఎమ్మెల్యే నేతలు అధికారులను కలిసి పెర్కిట్‌ నుంచి వార్డుల విభజన ప్రక్రియ ప్రారంభించాలని కోరినట్లు సమాచారం. ఇక భాజపా నాయకులు శుక్రవారం సమావేశమై జాబితాలు పరిశీలించి అభ్యంతరాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేసుకున్నారు.

భీమ్‌గల్‌ పట్టణ శివారులో ఉండే లింబాద్రి గుట్ట ప్రాంతాన్ని రెండో వార్డులో ఉంచారు. పురాణపేట రోడ్డు ఉండే ప్రాంతంతో కలిసి ఉండేలా మార్పు చేయాలని కోరుతూ దరఖాస్తు వచ్చింది.

కామారెడ్డి మున్సిపాలిటీలో పది దరఖాస్తులు రాగా.. ప్రధానంగా శివారు ప్రాంతాల్లో కాలనీల విభజన సరిగా లేదని ఉన్నాయి. రాజీవ్‌కాలనీ ప్రాంతవాసులు 6, 7 వార్డుల విభజనలపై దరఖాస్తులు అందించారు.

నచ్చజెప్పే ప్రయత్నాలు : వార్డుల విభజనపై వస్తున్న ఫిర్యాదులు స్వీకరిస్తున్న సందర్భంలోనే అధికారులు దరఖాస్తుదారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సరిగానే చేశామని, నిబంధనలు పాటించి నాలుగు దిక్కులకు అనుగుణంగా హద్దులు నిర్ణయించామని చెబుతున్నారు. మొదటి- చివరి వార్డుల్లోని ఓటర్ల సంఖ్యలతో పోల్చి మిగతా వాటిల్లోనూ ఓటర్ల సంఖ్య వ్యత్యాసం పది శాతానికి లోపే ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నామని వివరిస్తున్నారు. ఇలా సర్ది చెబుతున్నప్పటికీ ఫిర్యాదులను మాత్రం స్వీకరిస్తున్నారు. వీటిని పరిష్కరించేందుకు ఈ నెల 10 నుంచి 16 వరకు సమయం ఉంది.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.