close

మంగళవారం, జులై 23, 2019

తాజా వార్తలు

ప్రమాదాలు ఆగాలి

నియంత్రణకు చెన్నైలో ఎల్‌ఈడీ దీపాలు
 మన నగరంలోనూ సరికొత్త ప్రయోగం
ఈనాడు, హైదరాబాద్‌

మెట్రో నగరాల్లో రహదారులపై నిత్యం ప్రమాదాలే.. రోజుకు సగటున ఐదు వరకు నమోదవుతున్నాయి. ట్రాఫిక్‌ సిగ్నళ్లున్నా సరే... కూడళ్ల వద్ద రయ్యిమంటూ వాహనాలు దూసుకెళ్తుంటాయి. చోదకుల వేగానికి కళ్లెం వేసేందుకు... రహదారులపై ప్రమాదాలు నియంత్రించేందుకు చెన్నై పోలీసులు ట్రాఫిక్‌ స్టాప్‌లైన్ల వద్ద ఎల్‌ఈడీ దీపాలను అమర్చారు. వన్‌వేలు, ఫ్రీ లెఫ్ట్‌లు, కూడళ్లను ముందుకు జరపడం వంటి చర్యలను చేపట్టినా ఫలితాలు రావడం లేదని ఈ కొత్త విధానాన్ని అమలు చేస్తున్నారు. చెన్నై నగరంలోని కామరాజ్‌ సాలై(మార్గం)లో గాంధీ విగ్రహం వద్ద, కూడళ్ల వద్ద స్టాప్‌లైన్‌ ఉన్న చోట రహదారిపై ఎల్‌ఈడీ దీపాలు ఏర్పాటు చేశారు. వీటిని ) ట్రాఫిక్‌ సిగ్నళ్లకు అనుసంధానించారు. సిగ్నళ్ల వద్ద లైట్ల రంగు మారినప్పుడు ఎల్‌ఈడీ లైట్ల రంగు కూడా మారుతుంది. రాత్రి వేళ సెకన్ల వ్యవధిలో వెలిగి ఆరిపోతుంటాయి. ద్విచక్ర వాహనదారుల వేగాన్ని నియంత్రించేందుకు ఈ ప్రయత్నం చేశామని చెన్నై పోలీసులు చెబుతున్నారు.
ట్రాఫిక్‌ సిగ్నళ్లను సంప్రదాయ పద్ధతుల్లో కాకుండా వినూత్నంగా మార్చేందుకు ట్రాఫిక్‌ పోలీస్‌ ఉన్నతాధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. విదేశాలు, దేశ రాజధానిలో ట్రాఫిక్‌ సిగ్నళ్ల వ్యవస్థను అధ్యయనం చేసి స్థానిక పరిస్థితులకు అనుగుణంగా మార్చుకోవాలని ఆరేడు నెలల నుంచి సమాచారం సేకరిస్తున్నారు. విజయవాడ ట్రాఫిక్‌ పోలీసులు కూడళ్ల వద్ద నాలుగు వైపులా నాలుగు అడుగులు ఎత్తున్న స్తంభాలను ఏర్పాటు చేసి వాటికి ఎల్‌ఈడీ దీపాలను అమర్చారు. కూడళ్ల వద్ద సిగ్నళ్లు ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగులో మారినప్పుడు... స్తంభాల వద్ద ఉన్న ఎల్‌ఈడీ దీపాలు రంగు మార్చుకుంటాయి. దూరం నుంచి కార్లలో వస్తున్నవారికి, ద్విచక్రవాహన చోదకులకు ఈ దీపాలు కనిపించడం ద్వారా కూడళ్ల సమీపంలో వేగాన్ని తగ్గించుకుంటున్నారు.
సరైన జాగ్రత్తలు తీసుకుంటేనే..
చెన్నై ట్రాఫిక్‌ పోలీసులు రహదారులపై ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ దీపాలు ప్రమాదాల నియంత్రించేందుకు ఉపకరించినా వాటి నిర్వహణపై సరైన జాగ్రత్తలు తీసుకోవాలని హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు అంటున్నారు. రహదారిపై అమర్చిన ఎల్‌ఈడీ దీపాలకు రక్షణ కవచాలను ఉంచినా వాహనాల చక్రాలు వాటిపై వెళ్లినప్పుడు ముద్రలు పడడం, పదిహేను, నెలరోజులకే రక్షణ కవచాలు విరగడం వంటివి జరిగే అవకాశాలున్నాయని వివరించారు. కూడళ్ల వద్ద వేగనిరోధకాల తరహాలో ఏర్పాటు చేయడం లేదా భూగర్భంలో వాటిని ఉంచినా నిర్వహణ సక్రమంగా ఉండాలని, వాహనాల చక్రాలు, భారీ వాహనాల టైర్లు రక్షణ కవచాలపై వెళ్లినా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండే పరికరాలను, రక్షణ కవచాలను వినియోగించాలని అభిప్రాయపడ్డారు. విదేశాల్లోని నగరాల్లో ఈ తరహా విధానాలున్నాయని, అక్కడ వాహనాల రాకపోకలు మనతో పోల్చుకుంటే తక్కువగా ఉన్నందున అవి విజయవంతంగా కొనసాగుతున్నాయన్నారు.
మన నగరంలో కూడళ్ల వద్ద కాకుండా కాస్త దూరంలోనూ, ట్రాఫిక్‌ రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేకంగా స్తంభాలను ఏర్పాటు చేస్తున్నారు. స్తంభం నుంచి రోడ్డు మధ్యకు వచ్చేలా ఎల్‌ఈడీ లైట్లున్న బీమ్‌ను అమర్చుతారు. దీంతో 50 మీటర్ల నుంచి 100 మీటర్ల దూరం వరకూ ఈ ఎల్‌ఈడీ లైట్లు కనిపిస్తాయి. వీటి ద్వారా కూడళ్ల వద్ద 15 శాతం ప్రమాదాలు తగ్గే అవకాశాలు ఉన్నాయని పోలీస్‌
అధికారులు చెబుతున్నారు.

https://betagallery.eenadu.net/htmlfiles/112813.html

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

మేం చూస్తున్నాం.. చర్యలు తీసుకోండి 

శనివారం ట్విట్టర్‌లో ఉంచిన వీడియో వైరల్‌ అయింది. నిముషాల వ్యవధిలోనే రామ్‌గోపాల్‌ వర్మ వీడియోను నెటిజన్లు రీ-ట్వీట్‌చేశారు. ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించి రాంగోపాల్‌ వర్మ, అతడి సహ దర్శకులు వెళ్తుంటే ఏం చేస్తున్నారంటూ.. హైదరాబాద్‌, సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులను అందులో ప్రశ్నించారు. శిరస్త్రాణం తప్పక ధరించకపోతే జరిమానాలు విధిస్తున్న మీరు.. హెల్మెట్‌ పెట్టుకోకుండా వస్తున్నా... ముగ్గురూ బుల్లెట్‌పై కనిపిస్తున్నా చర్యలు తీసుకోరా? అంటూ రీ-ట్వీట్ల వర్షం కురిపించారు. వెంటనే స్పందించిన సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు రాంగోపాల్‌ వర్మ వెళ్తున్న బుల్లెట్‌ ఆధారంగా వారు ఎక్కడి నుంచి వచ్చారని ఆరా తీశారు. శిరస్త్రాణం ధరించకుండా ద్విచక్రవాహనం నడుపుతున్నందుకు, ముగ్గురూ ఒకే బైక్‌లో ప్రయాణిస్తున్నందుకు రూ.1335 జరిమానా విధించారు. ఇలాంటి ట్వీట్‌లు రాంగోపాల్‌ వర్మకే పరిమితం కాదు... వాహన చోదకులు, కారు డ్రైవర్లు ఎవరైనా ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే వెంటనే ఫొటోలు తీసి ట్విట్టర్‌లో ఉంచుతున్నారు. ఆ ఫొటో లేదా వీడియో తీసిన సమయం, ప్రదేశం వివరాలను పోలీసులు సేకరించి ఉల్లంఘనులకు జరిమానాలు విధిస్తున్నారు.

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.