close

ఆదివారం, డిసెంబర్ 08, 2019

తాజా వార్తలు

ఆగని మృత్యు పిలుపులు

● ఎన్‌హెచ్‌-16పై మరణ మృదంగం

● జాగరూకతతోనే ప్రాణాలు పదిలం

దరి చేరే వరకు దారి కనిపించదు... హెచ్చరిక బోర్డులూ సరిగా ఉండవు... ఏ వాహనం ఎటు నుంచి వస్తుందో తెలియదు... అలా అని తెగించి ముందుకుపోయారో ప్రమాదం జరుగక మానదు... విగతజీవులో లేక క్షతగాత్రులో కాక తప్పదు... ఇదీ చిలకలూరిపేట నియోజకవర్గం మీదుగా వెళ్లే చెన్నై-కోల్‌కత జాతీయ రహదారి-16లో నెలకొన్న పరిస్థితి.

న్యూస్‌టుడే, చిలకలూరిపేట గ్రామీణ: చిలకలూరిపేట మండలం తాతపూడి వద్ద నుంచి యడ్లపాడు మండలం బోయపాలెం వరకు 24 కి.మీ. మేర ఉన్న జాతీయ రహదారిని పరిశీలిస్తే.. బొప్పూడి ఆలయం, గొర్రెల మండి, అడ్డరోడ్డు సెంటర్‌, ఎన్‌ఆర్‌టీ సెంటర్‌, బస్టాండ్‌, ఏఎంజీ, గణపవరం, స్పిన్నింగ్‌ మిల్లుల ప్రాంతం, తిమ్మాపురం సెంటర్‌, యడ్లపాడు, వంకాయలపాడు తదితర ప్రాంతాల్లో అడ్డదారులు ఉండటంతో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. దీనికితోడు ఆరు వరుసలుగా ఉండే రహదారిలో వేగంగా వచ్చే వాహనాలు ఇటు చిలకలూరిపేట మండలం రామచంద్రాపురం అడ్డరోడ్డు వద్ద నుంచి అటు యడ్లపాడు మండలం తిమ్మాపురం నుంచి నాలుగు వరుసలలోకి మారినా అదే వేగాన్ని 16 కి.మీ. మేర కొనసాగిస్తుండడం ప్రమాదాలకు కారణంగా కనిపిస్తుంది.

ఏం చేయాలంటే...: చిలకలూరిపేట రూరల్‌, అర్బన్‌ సర్కిళ్ల పోలీసు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటేనే ప్రమాదాలను అరికట్టే అవకాశం ఉంది. ప్రధానంగా 80 కి.మీ.కన్నా వేగంతో వెళ్లే వాహనాలకు తక్షణ జరిమానా విధించే ప్రక్రియ ఉండాలి. కూడళ్ల వద్ద సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా చిలకలూరిపేట ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద నియంత్రణకు ఎవరూ లేక ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. విజయా బ్యాంకు వద్ద పోలీసు ఉంటున్నా ప్రమాదాలు ఆగడం లేదు. ఏఎంజీ వద్ద పట్టణం నుంచి వచ్చే వాహనాలు రహదారి దాటే క్రమంలో తగిన జాగ్రత్తలు తీసుకునేలా చర్యలు చేపట్టాలి. కూడళ్ల వద్ద వాహనదారుల వేగ నియంత్రణ ఉండేలా చూడాలి. ప్రధానంగా నాదెండ్ల మండలం గణపవరం నుంచి తిమ్మాపురం అడ్డరోడ్డు వరకు ఎక్కువగా పత్తి ఆధారిత పరిశ్రమలు ఉండటంతో నిత్యం కార్మికులు రహదారి దాటుతుంటారు. అయితే విద్యుత్తు దీపాల్లేక చీకట్లు అలముకొని ఉండటం ప్రమాదాలకు ఎక్కువ ఆస్కారమిస్తున్నందున వాటితోపాటు ఈ ప్రాంతంలో రహదారికిరువైపులా ఇనుప గ్రిల్స్‌ పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయాలి.

పేరుకే పెట్రోలింగ్‌ రహదారిపై ఎక్కడపడితే అక్కడ నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నిలిపి ఉంటున్నప్పటికీ హైవే పెట్రోలింగ్‌ వాహనం పట్టించుకుంటున్న దాఖలాలు లేవు. చిలకలూరిపేట పట్టణంలో ఎక్కువగా ఈ పరిస్థితి కనిపిస్తోంది. నిరంతరం ఈ మార్గంలో తిరుగుతూ వాహనాలు నిలుపుదల చేసిన వారికి జరిమానాలు విధిస్తుంటే ప్రమాదాలు తగ్గుముఖం పడతాయి.

నివారణ చర్యలు తీసుకుంటున్నాం.. తాతపూడి నుంచి బోయపాలెం వరకు జాతీయ రహదారిపై ప్రమాదాలు జరుగకుండా అన్ని చర్యలూ తీసుకుంటున్నాం. ఇప్పటికే ఎన్‌హెచ్‌ఏఐ అధికారులను పిలిపించి ప్రధాన కూడళ్ల వద్ద చేపట్టవలసిన చర్యలను చూపించాం. వారు తమ ప్రతిపాదనలను ఉన్నతాధికారులకు పంపారు. వాటికి ఆమోదం రాగానే పనులు చేపట్టి వాహనాల వేగాన్ని నియంత్రిస్తాం. వాహనదారులు, రహదారి దాటే చోదకులు, పాదచారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. రెండు నెలల వ్యవధిలో ప్రమాదాలను చాలా వరకు తగ్గించగలిగాం.

- ఎం.సుబ్బారావు, సీఐ, చిలకలూరిపేట గ్రామీణ

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.