Latest Telugu News, Headlines - EENADU
close

ప్ర‌త్యేక క‌థ‌నం

పప్పుల తిప్పలు

కిలో ధర రూ.95 నుంచి 100
3 నెలల్లో రూ.20కి పైగా పెరుగుదల
దిగుమతుల ఆలస్యంతో దేశీయ మార్కెట్‌పై ప్రభావం
మార్క్‌ఫెడ్‌ వద్ద 2.72 లక్షల క్వింటాళ్ల నిల్వలు
మార్కెట్‌లో అమ్మేందుకు సిద్ధమవుతున్న సమాఖ్య
ఈనాడు - హైదరాబాద్‌

వంటింట్లో పప్పులు ఉడకటం లేదు.. ధరలు పైపైకి ఎగబాకడమే ఇందుకు కారణం.. మూడు నెలల వరకు స్థిరంగా ఉన్న ధరలు మెల్లగా పెరగడం మొదలుపెట్టాయి. కందిపప్పు, మినప్పప్పు ధరలు రూ.100కి చేరువలో ఉన్నాయి. సగటు వినియోగదారుడు వీటిని కొనాలంటే బెంబేలెత్తుతున్నాడు. నగరాలు, పట్టణాలు, పల్లెల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. నైరుతి రుతుపవనాలు ఆలస్యం కావడం, దిగుమతుల్లో జాప్యం.. వంటి కారణాలు ధరల పెరుగుదలకు కారణమయ్యాయి. పండుగల సీజన్‌ సమీపిస్తుండటంతో సామాన్య ప్రజల్లో ఆందోళన నెలకొంది.

బహిరంగ విపణిలో పప్పుల ధరలు మండుతున్నాయి. గత మూడు నెలల్లోనే కిలోకు రూ.20కి పైగా చిల్లర మార్కెట్‌లో ధరలు పెరిగాయి. ప్రస్తుతం వీటి చిల్లర ధరలు కిలోకు రూ.95 నుంచి 100 వరకూ ఉన్నాయి. నైరుతి రుతుపవనాలు ఆలస్యం కావడం, విదేశాల నుంచి దిగుమతుల్లో జాప్యం.. వంటి కారణాలతో దేశీయ మార్కెట్‌లో వీటి ధరలు ఎగబాకుతున్నాయి. గత రెండేళ్లుగా రైతులు ఈ పంటలు అమ్మినప్పుడు ధరల్లేక నష్టపోయారు. ఇప్పుడు అవే పప్పులను అధిక ధరలకు కొనలేక సామాన్యులు సతమతమవుతున్నారు. ఇప్పటికీ ఈ పంటకు ధర లేదని ప్రభుత్వ గోదాముల్లో లక్షలాది క్వింటాళ్లు మూలుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకార మార్కెటింగ్‌ సమాఖ్య(మార్క్‌ఫెడ్‌) వద్ద 2.53 లక్షల క్వింటాళ్ల కందులు, మరో 21 వేల క్వింటాళ్ల మినుములున్నాయి. వీటిని గతేడాది రైతుల వద్ద మద్దతు ధరకు కొన్నారు. వీటిని లాభాపేక్ష లేకుండా అమ్మేందుకు టెండర్లు పిలవాలని సమాఖ్య ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు కేంద్రం తరఫున మద్దతు ధరకు కొన్న ‘జాతీయ సహకార మార్కెటింగ్‌ సమాఖ్య(నాఫెడ్‌) వద్ద కూడా 10 లక్షల క్వింటాళ్ల వరకూ నిల్వలున్నాయి. మార్కెట్‌లో పప్పుల ధరలు మరింత ఎగబాకితే వీటిని మార్కెట్‌లోకి విడుదల చేయాలని కేంద్రం యోచిస్తోంది.

దేశంలో ఇలా..
దేశంలో కంది పంట సాగు ప్రారంభించే జూన్‌, జులై నెలల్లో వర్షాలు సరిగ్గా కురవక సాగు విస్తీర్ణం తగ్గుతోంది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా ఖరీఫ్‌లో సాధారణ సాగు విస్తీర్ణం కోటీ 7 లక్షల ఎకరాలు కాగా కోటి ఎకరాల్లో వేసినట్లు కేంద్ర వ్యవసాయశాఖ తాజా నివేదికలో వెల్లడించింది.

రాష్ట్రంలో ఇలా..
తెలంగాణలో కంది సాగు 7.29 లక్షల ఎకరాలకు గాను 6.61 లక్షల ఎకరాలకు పడిపోయింది. అన్ని పప్పు ధాన్యాల పంటల సాగు విస్తీర్ణం రాష్ట్రంలో ప్రస్తుత ఖరీఫ్‌లో లక్షా 74 వేల ఎకరాలు తగ్గడం గమనార్హం. నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా రావడంతో పాటు, వచ్చిన తరువాత కూడా వర్షాలు లేక తీవ్రస్థాయిలో 38 శాతం వరకూ వర్షపాతం లోటు ఏర్పడింది. ఆగస్టులో వర్షాలు కురుస్తున్నా పప్పుధాన్యాల సాగు సమయం దాటిపోయింది.

దిగుమతుల పరిస్థితి ఇదీ
* ఈ ఏడాది 4 లక్షల టన్నుల కందిపప్పు దిగుమతి చేసుకోవాలని, వాటిని కొత్త పంట వచ్చేలోగా అంటే అక్టోబరులోగా తెప్పించాలనే షరతు పెట్టారు. ఇందులో తొలిదశగా 2 లక్షల టన్నుల దిగుమతికి అనుమతించినా అవి తెప్పించలేక వ్యాపారులు సతమతమవుతున్నారు. ప్రధానంగా మయన్మార్‌ నుంచి కంది పప్పు దిగుమతి చేసుకోవడం ఆనవాయితీ. అక్కడ పంట నిల్వలు లేకపోవడంతో లక్షన్నర టన్నులకు మించి దొరక్కపోవచ్చని వ్యాపార వర్గాల అంచనా.
* కందుల దిగుమతికి మొజాంబిక్‌తో భారతదేశానికి ఒప్పందం ఉంది. ఆఫ్రికా దేశాల్లో ఆగస్టు తరువాత పంట మార్కెట్‌కు వస్తుంది. దాన్ని అక్టోబరులోగా తెప్పించడం కష్టమనేది వ్యాపారుల అంచనా.
* మినుము, పెసలు కూడా లక్షన్నర టన్నుల చొప్పున విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలని కేంద్రం నిర్ణయించింది.

తగ్గుతున్న దిగుబడి
గతేడాది భారతదేశంలో 36.80 లక్షల టన్నుల కంది పంట దిగుబడి వచ్చింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 6.10 లక్షల టన్నుల దిగుబడి తగ్గింది. ఈ పంట దిగుబడి తగ్గడం వరుసగా ఇది రెండో ఏడాది.
* రైతులు పంట సాగు చేసినా ప్రభుత్వం మద్దతు ధరకు కొంటే తప్ప బయట మార్కెట్‌లో సరైన ధర రావడం లేదు. గతేడాది పంట మార్కెట్‌కు వచ్చినప్పుడు రాష్ట్రంలో క్వింటా రూ.4 వేలకే ఒక దశలో వ్యాపారులు కొన్నారు.
* మార్కెట్‌లో పంటకు ధర లేదని లక్షలాది టన్నుల కందులను మార్క్‌ఫెడ్‌ వేలంలో క్వింటా రూ.3200కే అమ్మేసింది. అప్పుడు అంత తక్కువకు పంట అమ్మగా ఆ తరవాత క్రమంగా పప్పు ధరలు పెరుగుతూ వస్తున్నాయి.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.