close

ప్ర‌త్యేక క‌థ‌నం

మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు..

ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రిలో వ్యాధిగ్రస్థుల దయనీయ స్థితి 
నయమైనా ఇళ్లకు తీసుకెళ్లని కుటుంబసభ్యులు 
ఏళ్ల తరబడి వైద్యశాలలోనే జీవనం 
కుమిలిపోతున్న బాధితులు 
ఈనాడు-సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి

మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు.. 
మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు 
అందెశ్రీ రాసిన ఈ పాట గుర్తొస్తుంది మానసిక ఆస్పత్రుల్లో రోగుల దీనావస్థను చూస్తే. వైద్యంతో రుగ్మత నయమైనా కుటుంబసభ్యులే వారిని తిరిగి ఇంటికి తీసుకెళ్లడానికి నిరాకరిస్తున్న వైనం నిర్ఘాంతపరుస్తోంది. తప్పుడు చిరునామాలు ఇచ్చి, ఫోన్‌ నంబర్లు మార్చేసి పలువురు రోగుల కుటుంబసభ్యులు చేస్తున్న ప్రయత్నాలు చూసి ఆసుపత్రి వర్గాలు విస్తుపోతున్నాయి. మానసికంగా బాగైందని ఆనందపడాలో.. తమవారే తమను వదిలించుకోవాలనుకుంటున్నారని ఆవేదన చెందాలో తెలియక బాధితులు కుమిలిపోతున్నారు. దీనికంటే తమకు నయమవకపోయినా బాగుండేదని కన్నీరుమున్నీరవుతున్నారు. 
లమైన సంఘటన.. మానసిక సంఘర్షణ.. ఆప్తుల్ని కోల్పోయిన ఆవేదన.. ప్రేమలో వైఫల్యం.. వైవాహిక జీవితంలో స్పర్థలు.. కారణాలేవైనా ఓ మనిషి మానసిక వ్యాధిగ్రస్తుడిగా మారాడంటే అతని జీవితం ఆస్పత్రికే పరిమితమైపోతోంది. మానసిక వ్యాధి ఉందని ప్రభుత్వాసుపత్రుల్లో చేర్పిస్తున్న కుటుంబసభ్యులు, బంధువులు వ్యాధి నయమైనా వారిని ఇంటికి తీసుకెళ్లడానికి వెనకడుగు వేస్తున్న పరిస్థితి మానవ సంబంధాలు ఎలా కొడిగడుతున్నాయో కళ్లకు కడుతోంది. ఆరోగ్యం కుదుటపడినా అయిన వాళ్లు పట్టించుకోక ఏళ్ల తరబడి ఆస్పత్రిలోనో, స్వచ్ఛంద సంస్థల పంచనో భారంగా బతుకు వెళ్లదీస్తున్న బాధితులను చూస్తే గుండె బరువెక్కుతుంది. వ్యాధి నయమైన వారిని కుటుంబీకుల చెంతకు చేర్చడంలో పోలీసులు సహకరించకపోవడం సమస్యను మరింత పెంచుతోంది. మానసికంగా బాగుపడినా అయినవారు ఆదరించని వారు ఎర్రగడ్డ ప్రభుత్వ మానసిక ఆస్పత్రిలోనూ, స్వచ్ఛంద సంస్థల దగ్గర పదుల సంఖ్యలో ఉన్నారు. ‘ఈనాడు’ పరిశీలనలో హృదయాలను మెలిపెట్టే ఈ దీనగాథలు కనిపించాయి. 
హైదరాబాద్‌ ఎర్రగడ్డలోని మానసిక ఆస్పత్రి.. మానసిక ఆరోగ్యం దెబ్బతిన్న అభాగ్యులకు స్వస్థత చేకూర్చే వైద్యశాల. వైద్యులు, సిబ్బంది ఎంతో శ్రమించి, రోగుల చేష్టలన్నీ భరించి వారికి వైద్యం చేసి నయం చేస్తున్నారు. కానీ వారిలో చాలామందిని ఇంటికి తీసుకెళ్లడానికి కుటుంబసభ్యులు వెనకంజ వేస్తుండడం దారుణం. ఈ వైద్యశాలలో 650 పడకలు ఉన్నాయి. వ్యాధి బాగా ముదిరిన వారి కోసం ఇందులో 200 పడకలను ప్రత్యేకించారు.  మిగిలినవి జనరల్‌ వార్డుల్లోని పడకలు. ప్రతి రోజూ 400 నుంచి 500 మంది పాత రోగులు మళ్లీ చూపించుకోవడానికి వస్తుంటారు. 
కొత్తవారు రోజూ 50 మంది వరకు వస్తుంటారు. కుటుంబసభ్యులు మానసిక వ్యాధిగ్రస్థులైన తమవారిని ఈ ఆస్పత్రిలో చేర్చి నయమయ్యాక ఇళ్లకు తీసుకెళుతుంటారు. అయితే కొందరు మాత్రం తమవారిని ఆస్పత్రిలో చేర్చాక మళ్లీ ఇటువైపు చూడడం లేదు. వారికి నయమైనా ఇంటికి తీసుకెళ్లకుండా తప్పించుకునేందుకు కావాలనే తప్పుడు చిరునామాలు ఇస్తున్నారు. ఫోన్‌ నెంబర్లు మార్చేస్తున్నారు. వ్యాధిగ్రస్తులు నయమై ఇంటికి వచ్చినా జీవితాంతం మందులు వాడాల్సి రావడం, ఇతరత్రా సేవలు చేయాలన్న ఉద్దేశం, డబ్బు ఖర్చు అన్న భావనతో చాలామంది కుటుంబీకులు ఇలా ప్రవర్తిస్తున్నారని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. మతిస్థిమితం కోల్పోయి రోడ్ల మీద తిరుగుతున్నవారిని, ఇతరత్రా కేసుల్లో ఉండి మానసిక రోగులుగా మారినవారిని పోలీసులు కోర్టులో హాజరుపరుస్తున్నారు. కోర్టు ఆదేశాల మేరకు వారిని ఆస్పత్రిలో చేరుస్తున్నారు. వీరి గురించి వచ్చేవారు అయితే దాదాపు ఉండరనే చెప్పాలి.

నయం చేస్తున్నా..

తీవ్రమైన మానసిక వ్యాధితో ఆస్పత్రిలో చేరినవారికి కూడా 15 రోజుల నుంచి రెండు నెలల్లోపు దాదాపుగా వ్యాధి నయమవుతుంది. మందులతో ఆ వ్యక్తి సాధారణ జీవనం గడపవచ్చు. వ్యాధి బాగా ముదిరి విపరీతమైన చేష్టలు చేస్తున్న రోగులను కూడా మానసిక ఆస్పత్రి వైద్యులు, సహాయకులు ఓపికగా వైద్య సేవలందించి సాధారణ స్థితికి తీసుకువస్తున్నారు.

వైద్యురాలే రోగిలా.. 

వారణాసికి చెందిన సునంద హైదరాబాద్‌లో ఎంబీబీఎస్‌ పూర్తి చేశారు. ఏమైందో తెలియదు గానీ మతిస్థిమితం లేక నాంపల్లిలో రోడ్లపై తిరుగుతుంటే పోలీసులు ఆమెను గత దీపావళి రోజున అదుపులోకి తీసుకున్నారు. కోర్టు ఆదేశాల మేరకు ఆస్పత్రిలో చేర్చారు. పూర్తిగా నయమై ప్రస్తుతం కస్తూర్బా హాస్టల్‌లో ఉంటున్నారు. ఇటీవల తల్లి చిరునామా తెలుసుకుని ఆమెతో మాట్లాడితే భర్త, కుమారుడు చనిపోవడంతో తానే మేనల్లుడి పంచన బతుకుతున్నానని సమాధానమిచ్చింది. సునందను తాను తీసుకువెళ్లలేనని చెప్పడంతో అక్కడి వారికి ఏమి చేయాలో పాలుపోలేదు.

ఆస్తులున్నా అనాథే 

అనంతపురం జిల్లాకు చెందిన రాజశేఖరెడ్డి అయిదేళ్ల కిందట కోర్టు ఆదేశాల మేరకు ఆస్పత్రిలో చేరారు. కొన్ని నెలల్లోనే ఆయన మానసిక వ్యాధి పూర్తి నయమైంది. రోజూ ఒకటి, రెండు మాత్రలు వేసుకుంటూ సాధారణ జీవితాన్ని గడపగలుగుతున్నారు. రాజశేఖర్‌రెడ్డికి భార్యాబిడ్డలు లేరని, ఆయన స్వగ్రామంలో భూములున్నాయని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. అతణ్ని ఇంటికి పంపించడానికి నాలుగేళ్లుగా ప్రయత్నిస్తున్నా కుటుంబీకులు ఒప్పుకోవడం లేదని వైద్యులు తెలిపారు. కోర్టు ఆదేశాల మేరకు పోలీసుల భద్రతతో ఇంటికి పంపించాలని ప్రయత్నాలు చేస్తున్నారు.

చేతులెత్తేస్తున్న పోలీసులు

పూర్తిగా నయమైనవారి చిరునామాలను తెలుసుకుని వారి బంధువులతో మాట్లాడి వైద్యుల పర్యవేక్షణలో ఇళ్లకు చేర్చడం పోలీసుల బాధ్యత. చిరునామాలు తెలిసినా స్వస్థత పొందిన రోగులను ఇళ్లకు తరలించే విషయంలో పోలీసులు చొరవ చూపడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మానసిక ఆస్పత్రిలో వ్యాధి నయమై ఇళ్లకు చేర్చాల్సిన రోగుల సంఖ్య 153 మంది. ఇందులో 106 మంది పురుషులు, 47 మంది మహిళలు. వీరిలో వ్యాధి నయమై సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్న 11 మందిని కుటుంబీకులు తీసుకువెళ్లకపోవడం వల్ల అయిదేళ్లుగా ఆస్పత్రిలోనే ఉంటున్నారు. మూడేళ్లుగా మరో 25 మంది ఇలాగే వైద్యశాలలోనే బతుకు వెళ్లదీస్తున్నారు.

భర్తే భరించలేనన్నాడు

గుడివాడకు చెందిన ఉషను ఏడేళ్ల కిందట ఆస్పత్రిలో చేర్చారు. కొన్ని నెలలకే ఆమెకు నయమైంది. అయితే అప్పటికే రెండో పెళ్లి చేసుకున్న ఉష భర్త భార్యను తీసుకెళ్లడానికి ససేమిరా అన్నాడు. ఆసుపత్రి వర్గాలు ఉష కుమారుడిని పిలిపించి మాట్లాడితే తాను ఇంజినీరింగ్‌ చదువుతున్నానని, చదువు పూర్తయి ఉద్యోగం వచ్చిన తరువాత తల్లిని ఇంటికి తీసుకువెళతానని చెప్పాడు. కొడుకు వచ్చి ఏనాటికైనా తనను ఇంటికి తీసుకెళతాడని ఉష వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. 

ప్రేమ పేరిట వంచనకు గురై..

హైదరాబాద్‌కు చెందిన ఓ బాలిక 16 ఏళ్ల వయస్సులోనే ఓ యువకుడితో ప్రేమలో పడింది. ప్రేమికుడు ఆమెను చెన్నై రైల్వేస్టేషన్‌లో వదిలేసి వెళ్లిపోవడంతో మానసికంగా దెబ్బతింది. తరువాత ఇక్కడి ఆస్పత్రిలో చేర్చారు. కొన్నేళ్లపాటు ఆస్పత్రిలోనే ఉండి చికిత్స పొందింది. ఇటీవల ఆమెను ఇంటికి పంపించామని, కానీ తన మానసిక పరిస్థితి బాగాలేదంటూ బంధువులు తరచూ ఫోన్లు చేస్తున్నారని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. 

ఏవీ రక్షిత గృహాలు?

మెంటల్‌ హెల్త్‌కేర్‌ యాక్ట్‌ -2017 ప్రకారం మానసిక వైద్యం పొంది నయమైన వారిని ఒక చోట ఉంచడానికి ప్రభుత్వాలు రక్షితగృహాలను ఏర్పాటు చేయాలి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ప్రభుత్వపరంగా అతిపెద్ద మానసిక వైద్యశాల ఎర్రగడ్డలో ఉన్నా ప్రభుత్వం రక్షితగృహాలు ఏర్పాటు చేయడం లేదు. వీటిని ఏర్పాటు చేస్తే నయమైన వారికి ఉన్నంతలో చక్కటి తోడ్పాటు లభించేది.

పెద్ద మనసుతో చేరదీస్తున్నారు 

కస్తూర్బా గాంధీ నేషనల్‌ మెమోరియల్‌ ట్రస్టు మానవతను చాటుతోంది. ఈ ఆశ్రమంలో 47 మంది మానసిక రోగులున్నారు. ఇందులో 12 మందికి వ్యాధి నయమైనా బంధువులు వారిని ఇళ్లకు తీసుకెళ్లడం లేదు. తామే వీరందరికీ ఎలాంటి లోటు రాకుండా చూసుకుంటున్నామని ఆశ్రమ నిర్వాహకురాలు పద్మావతి ‘ఈనాడు’కు తెలిపారు. రోగుల బంధువులను ఒప్పించి వీరిని ఇళ్లకు పంపించడానికి ప్రయత్నిస్తున్నామన్నారు.

16 సీసీ కెమెరాలతో పర్యవేక్షణ 

మానసిక వ్యాధిగ్రస్థులకు పూర్తి స్థాయిలో వైద్యం అందిస్తున్నాం. ఆస్పత్రి వార్డుల్లోనూ, ప్రాంగణంలోనూ 16 సీసీ కెమేరాలను ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. ఆస్పత్రిలో చేరిన రోగులను కొద్ది రోజుల్లోనే సాధారణ స్థితికి తీసుకురాగులుతున్నాం. అయితే నయమైన తర్వాత వారు కుటుంబసభ్యుల చెంతకు చేరితే మరింత ఆనందంగా ఉంటుంది. ఈ విషయంలో అన్ని రకాలుగా సాయం అవసరం.
- డాక్టర్‌ ఎం.ఉమాశంకర్‌, ఆస్పత్రి సూపరింటెండెంట్‌

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.