Latest Telugu News, Headlines - EENADU
close

ప్ర‌త్యేక క‌థ‌నం

వేతనాల్లోనూ వ్యత్యాసం

భారత్‌లో మహిళలకు 19% తక్కువగా జీతాలు
దాదాపు అన్ని రంగాల్లోనూ ఇదే తీరు
 మాన్‌స్టర్‌ తాజా వేతన సూచీలో వెల్లడి

దిల్లీ: ఆకాశంలో సగం! కానీ, వేతనాల్లో మాత్రం కాదు. ఇప్పటికీ మన దేశంలో పురుషుల కంటే మహిళా ఉద్యోగుల వేతనాలు సగటున 19% తక్కువగానే ఉన్నాయంటూ మాన్‌స్టర్‌ ఇండియా సంస్థ తన తాజా సర్వేలో వెల్లడించింది. 2018కి సంబంధించిన వేతన సూచీ (ఎంఎస్‌ఐ)ని గురువారం విడుదల చేసింది.

‘‘ప్రస్తుతం పురుషులతో పోల్చితే మహిళలు 19% తక్కువగా వేతనాలు పొందుతున్నారు. గంట వ్యవధిలో మహిళల కంటే పురుషులు సగటున 46.19 రూపాయలు అధికంగా సంపాదిస్తున్నారు. ఇది ఏ ఒక్క రంగానికో పరిమితం కాలేదు. కీలకమైన ఐటీ, ఐటీ ఆధార సేవా రంగాల్లో 26%; తయారీ రంగంలో 24% ఎక్కువగా పురుషుల వేతనాలున్నాయి. విచిత్రమేమంటే... మహిళా ఉద్యోగులు అధికంగా ఉండే ఆరోగ్య సేవలు, కేరింగ్‌ సర్వీసులు, సామాజిక సేవా రంగాల్లోనూ మగవారి వేతనాలు 21% ఎక్కువగా ఉంటున్నాయి. ఆర్థిక సేవలు, బ్యాంకింగ్‌, బీమా రంగాల్లో మాత్రం మహిళల కంటే పురుషులు కేవలం 2% మాత్రమే ఎక్కువ జీతాలు పొందుతున్నారు.

తొలగని అపోహలు..

పని ప్రదేశాల్లో తాము ఇప్పటికీ వివక్షకు గురవుతున్నామనీ, దాన్ని రూపుమాపాల్సి ఉందని 60% మంది మహిళలు అభిప్రాయపడ్డారు. పెళ్లయిన తర్వాత మహిళలు పనిపై అంతగా శ్రద్ధ కనబరచరన్న అభిప్రాయం నెలకొంది. గర్భం దాల్చిన తర్వాత ఇక వారు ఉద్యోగం మానేస్తారన్న అపోహ ఉందని, తాము మగవారిలా ఎక్కువసేపు పనిచేయలేమన్న అభిప్రాయం కూడా లేకపోలేదని 46% మంది మహిళా ఉద్యోగులు చెప్పారు’’ అని సర్వే పేర్కొంది.

ప్రజా రవాణాతోనే భద్రత
9% మహిళల విశ్వాసం: ఓలా సర్వే

ముంబయి: ప్రజా రవాణా సాధనాల్లో ప్రయాణమే శ్రేయస్కరమని 9% మంది మహిళలు, 11% మంది పురుషులు భావిస్తున్నట్టు ప్రముఖ క్యాబ్‌ సేవల సంస్థ ‘ఓలా’ పేర్కొంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారమిక్కడ ఓ నివేదికను విడుదల చేసింది. హైదరాబాద్‌ సహా దేశవ్యాప్తంగా 11 నగరాల్లో మొత్తం 9,935 మందిని ప్రశ్నించి దీన్ని రూపొందించింది. ‘‘35% మంది ప్రజలు రాత్రి వేళలు మినహా మిగతా సమయాల్లో ప్రజా రవాణా ఎంతో భద్రమని భావిస్తున్నారు. ఖర్చు తక్కువగా ఉంటుందని 40% మంది, సౌకర్యంగా ఉంటుందని 26% మంది, మరో ప్రత్యామ్నాయం లేక 15% మంది ఈ సాధనాలను ఉపయోగిస్తున్నారు’’ అని ఓలా పేర్కొంది.

తగ్గింది ఒక్క శాతమే

2017లో స్త్రీ-పురుష ఉద్యోగుల మధ్య వేతన వ్యత్యాసం 20% ఉండేది. 2018లోనూ పెద్దగా మార్పు రాలేదు. మహిళల వేతనాలు 19% తక్కువగా ఉన్నట్టు మా సర్వేలో తేలింది. నిజాయతీగా దీన్ని సమీక్షించాల్సిన అవసరముంది.
- అభిజీత్‌ ముఖర్జీ, మాన్‌స్టర్‌.కామ్‌, ఏపీఏసీ అండ్‌ గల్ఫ్‌ సీఈవో

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.