close

ప్ర‌త్యేక క‌థ‌నం

క్రేజీ క్రేజీ కేజ్రీవాల్‌

పట్టువదలని విక్రమార్కుడు! 
లౌక్యం తెలిసిన అపర చాణక్యుడు! 
క్రమశిక్షణకు నిలువెత్తు నిదర్శనం! 
అవినీతిపై పోరాడే యోధుడు.. 
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌!

పేరు: అరవింద్‌ కేజ్రీవాల్‌ 
తల్లిదండ్రులు: గోవింద్‌రామ్‌ కేజ్రీవాల్‌, గీతా దేవి  
పుట్టిన తేదీ: 16, ఆగస్టు 1968 
స్వస్థలం: సివానీ(భివానీ జిల్లా), హరియాణా 
విద్యార్హత: ఐఐటీ ఖరగ్‌పూర్‌ నుంచి మెకానికల్‌ ఇంజినీరింగ్‌ 
పార్టీ: ఆమ్‌ ఆద్మీ పార్టీ 
ముఖ్యమంత్రిగా: 2013 డిసెంబరు- 2014 ఫిబ్రవరి (49రోజుల పాలన), 2015 నుంచి దిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నారు 
ప్రత్యేకత: రామన్‌ మెగసెసె అవార్డు గ్రహీత (2006లో)

ది 1992 ఆదాయపు పన్నుల శాఖలో అసిస్టెంట్‌ కమిషనర్‌ హోదాలో కేజ్రీవాల్‌ తొలిరోజు ఆఫీసులో అడుగుపెట్టారు. ‘రెండు చేతులతో సంపాదించుకోగల ఉద్యోగమిది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి మనం..’ అంటూ లంచాలు తీసుకోవడంలో సిద్ధహస్తుడైన ఓ సహోద్యోగి హితబోధ చేశాడు. ఆ రోజే, ఆ క్షణమే కేజ్రీవాల్‌ అవినీతిపై పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు. కేజ్రీవాల్‌ తండ్రి గోవింద్‌రామ్‌ కేజ్రీవాల్‌ బిర్లా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో ఎలక్ట్రికల్‌ ఇంజినీర్‌గా పని చేసేవారు. గోవింద్‌కు తరచూ బదిలీలు ఉండటంతో కేజ్రీవాల్‌ బాల్యం గాజియాబాద్‌, హిస్సార్‌, సోనేపట్‌లో గడిచింది. చదువులో ఎప్పుడూ ముందుండే కేజ్రీవాల్‌ ఐఐటీ ఖరగ్‌పూర్‌ నుంచి 1989లో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేశారు. కొన్నాళ్లు కోల్‌కతాలోని రామకృష్ణ మిషన్‌లో గడిపారు. మదర్‌ థెరిస్సాను కలిసి ఆమె సేవల గురించి తెలుసుకునేవారు. ఓ ఏడాది తరువాత టాటా స్టీల్‌ సంస్థలో చేరారు. సంతృప్తి లేకపోవడంతో రాజీనామా చేసి సివిల్స్‌పై దృష్టిపెట్టారు. తొలి ప్రయత్నంలోనే ర్యాంకు సాధించి ఆదాయపు పన్నుల శాఖలో అసిస్టెంట్ కమిషనర్‌గా కొలువులో చేరారు.

అరవింద్‌ కేజ్రీవాల్‌ ఇల్లాలు సునీత మస్సోరీలో తనతోపాటు ట్రైనింగ్‌ తీసుకున్న బ్యాచ్‌మేట్‌. అక్కడే ఇద్దరి పరిచయం ప్రేమగా మారింది. వారికి ఇద్దరు సంతానం. సునీత ఆదాయపు పన్నుల శాఖలో కమిషనర్‌గా పనిచేశారు. 2016లో స్వచ్ఛందంగా పదవీ విరమణ పొందారు.

ఉద్యోగం - సేవ.. 
ఉద్యోగం చేస్తూనే ‘పరివర్తన్‌’ స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. విద్యుత్‌, ఆదాయపు పన్నులు, ప్రజా సంక్షేమ పథకాలు.. ఇలా పలు అంశాలకు సంబంధించి ప్రజల సమస్యల్ని తెలుసుకుని పరిష్కారానికి కృషి చేసేవారు. ఆర్టీఐ చట్టంపై అవగాహన కల్పిస్తూ సామాన్యులు ప్రభుత్వాన్ని ప్రశ్నించేలా చైతన్య పరిచేవారు. ఈ సేవలకు కేజ్రీవాల్‌ను రామన్‌మెగసెసె అవార్డు వరించింది. తద్వారా వచ్చిన మొత్తాన్ని కేజ్రీవాల్‌ వ్యక్తిగత అవసరాలకు కాకుండా.. కార్పస్‌ నిధిని ఏర్పాటు చేశారు. ‘పబ్లిక్‌ కాజ్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌’ను స్థాపించారు. 2006లో జాయింట్‌ కమిషనర్‌ హోదాలో ఉద్యోగానికి రాజీనామా చేశారు. స్వచ్ఛంద సేవలకు పరిమితమయ్యారు. అప్పుడే 2010లో జరిగిన దిల్లీ కామన్వెల్త్‌ క్రీడల్లో అవినీతి కేజ్రీవాల్‌ దృష్టికొచ్చింది. ఆ విషయం గురించి సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌తో వాదించినా ఫలితం లేకపోయింది. అందుకు సంబంధించి చర్యలు తీసుకోవడానికి కేజ్రీవాల్‌కు ఏ అర్హతా లేకపోవడం బాధించింది. అదే సమయంలో అన్నాహజారే, కిరణ్‌బేడీ వంటి వారితో కలిసి జన్‌లోక్‌పాల్‌ ఉద్యమానికి తెరలేపారు. కొన్ని నిబంధనలు, నియమావళిని రూపొందించి జన్‌లోక్‌పాల్‌ బిల్లును అమలు చేయాలని ప్రభుత్వంతో పోరాటం చేశారు. 
ఆలోచన నుంచి ఉద్భవించిన ఆప్‌... 
వ్యవస్థను బాగు చేయడానికి ప్రభుత్వాన్ని బతిమాలుకోవడం కేజ్రీవాల్‌కు నచ్చలేదు. పైగా    లోక్‌పాల్‌ బిల్లు విషయంలో ప్రభుత్వం ఆయన మాటల్నీ తోసిపుచ్చింది. తానే ఎందుకు పార్టీని స్థాపించి... ముఖ్యమంత్రి అవ్వకూడదు అని ఆలోచించారు. ఆ యోచన  నుంచి ఉద్భవించిందే.. ఆమ్‌ ఆద్మీ పార్టీ. 2012 నవంబరులో ఈ పార్టీని అధికారికంగా ప్రకటించారు. ఏడాది తిరిగేసరికి ఆప్‌ దిల్లీ ప్రజలకు దగ్గరైంది. కేజ్రీవాల్‌ ఓ బ్రాండ్‌గా మారిపోయారు. అవినీతి లేని పాలన, అభివృద్ధే అజెండాగా 2013లో ఆప్‌ కార్యకర్తలకు సీట్లు ఇచ్చి దిల్లీ బరిలో దించారు. 
మోదీపై పోటీ.. 
70 అసెంబ్లీ స్థానాల్లో భాజపా 31, ఆప్‌ 28, కాంగ్రెస్‌ 8, జనతాదళ్‌, శిరోమణి అకాలీదళ్‌, స్వతంత్ర అభ్యర్థులు ఒక్కో స్థానం చొప్పున గెలుచుకున్నారు. కాంగ్రెస్‌, జనతాదళ్‌, స్వతంత్ర అభ్యర్థి మద్దతులో కేజ్రీవాల్‌ బలం 38కి చేరడంతో  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నారు. 2013 డిసెంబరు 28న సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. జన్‌లోక్‌పాల్‌ బిల్లు విషయమై ముఖ్యమంత్రిగా మళ్లీ పోరాటం మొదలుపెట్టారు.  కేంద్రంపై అసంతృప్తితో 49 రోజుల్లోనే సీఎం పదవికి రాజీనామా చేశారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో కేజ్రీవాల్‌్ మోదీకి ప్రత్యర్థిగా వారణాసి బరిలో దిగారు. ఆ దఫా జనమంతా నమో జపం చేయడంతో  కేజ్రీవాల్‌ నాలుగులక్షల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తరువాత ఆప్‌ కార్యకర్తల్ని బలోపేతం చేసి .. మళ్లీ ప్రజల మనిషిగా దిల్లీ ప్రజల్లోకి వెళ్లారు. 2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్‌ 67 అసెంబ్లీ స్థానాలను సొంతం చేసుకుని దిల్లీ పీఠంపై ఆశీనులయ్యారు.

ఆసక్తికర విషయాలు

ఎప్పుడూ శాంతంగా ఉంటారు.  
నాలుగు గంటలకు మించి నిద్రపోరు.  
ఆఫీసులో గుమస్తా సేవలు వద్దంటారు. తన టేబుల్‌ తానే శుభ్రం చేసుకుంటారు.  
నిత్యం విపాసన ధ్యానం చేస్తారు.  
సీఎం అయినా దిల్లీ మెట్రోలో తరచూ ప్రయాణిస్తారు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.