close

ప్ర‌త్యేక క‌థ‌నం

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
పల్లెలకు జై

గ్రామీణ ప్రాంతాల్లోనే కొత్త పారిశ్రామిక పార్కులు
1.40 లక్షల ఎకరాల సేకరణకు సన్నాహాలు

ఈనాడు, హైదరాబాద్‌: పల్లెల్లో పరిశ్రమల సైరన్‌లు త్వరలో మోగనున్నాయి. రాష్ట్రంలో కొత్త పారిశ్రామికవాడలన్నింటిని గ్రామీణ ప్రాంతాల్లోనే ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. నగరాల్లో రకరకాల రద్దీ, భూముల కొరత, మౌలిక వసతుల కల్పనకు సమస్యల దృష్ట్యా ప్రభుత్వం గ్రామాల వైపే మొగ్గు చూపుతోంది. దీనికి అనుగుణంగా రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ ఏర్పాట్లు చేస్తోంది. తాజాగా హైదరాబాద్‌కు 50 కిలోమీటర్ల దూరంలోని చందనవళ్లిలో రూ.రెండువేల కోట్లతో వెల్‌స్పన్‌ పరిశ్రమ ప్రారంభమైన సంగతి తెలిసిందే. మరో తొమ్మిది పరిశ్రమలు అక్కడి పారిశ్రామిక సమూహంలో రానున్నాయి.  3,600 ఎకరాల్లో షాబాద్‌లో రాష్ట్రంలోనే అతిపెద్ద పరిశ్రమను స్థాపిస్తామని మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. మరో 50కి పైగా పారిశ్రామిక పార్కులు గ్రామీణ ప్రాంతాలకు  రానున్నాయి.
గ్రామాల వైపే మొగ్గు
నగరాల్లో రకరకాల రద్దీ, భూముల కొరత, మౌలిక వసతుల కల్పనకు సమస్యల దృష్ట్యా ప్రభుత్వం గ్రామాల వైపే మొగ్గు చూపుతోంది. దీనికి అనుగుణంగా రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ ఏర్పాట్లు చేస్తోంది.పరిశ్రమల కోసం ఇప్పటికే 1.57 లక్షల ఎకరాల భూసేకరణ జరిగింది. ఇందులో 1.40 లక్షల ఎకరాలు గ్రామీణ ప్రాంతాలవే.
* 2015లో నగరానికి 30 కిలోమీటర్ల దూరంలోని సుల్తాన్‌పూర్‌లో ఓఆర్‌ఆర్‌ బయట వేయి ఎకరాల్లో వైద్య పరికరాల ఉత్పత్తి పార్కును  ప్రభుత్వం ప్రారంభించింది.
* గత సంవత్సరం హైదరాబాద్‌కు 40 కిలోమీటర్ల దూరంలోని దండు మల్కాపూర్‌లో రెండు వేల ఎకరాల్లో దేశంలోనే మొట్టమొదటి సూక్ష్మ,  చిన్న పరిశ్రమల పార్కు ప్రారంభమైంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం, రావిర్యాలలో 940 ఎకరాలలో రెండు ఎలక్టాన్రిక్‌ తయారీ పార్కులను రూ.1,098 కోట్ల అంచనా వ్యయంతో నెలకొల్పింది.
* దేశంలోనే అతిపెద్ద జౌళి పార్కును వరంగల్‌ నగరానికి  25 కిలోమీటర్ల దూరంలోని శాయంపేట, చింతలపల్లి అనే రెండు పల్లెటూర్ల మధ్య ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించారు.
* ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలకనుగుణంగా మంత్రి కేటీఆర్‌ ఆధ్వర్యంలో కొత్త పార్కుల రూపకల్పన జరుగుతోంది.  వికారాబాద్‌ జిల్లా రాకంచర్లలో 150 ఎకరాలలో, బూచనెల్లిలో 373 ఎకరాలలో,  సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం శివనగర్లో ఎల్‌ ఈడీ పార్కు, పటాన్‌చెరు సమీపంలోని ఇంద్రకరణ్‌లో, చిట్కుల్‌, లక్డారం, మెదక్‌ జిల్లా వడియారం,   రంగారెడ్డి జిల్లా  ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడు గ్రామంలో 1,129 ఎకరాల వైమానిక పార్కు, కొంగర కలాన్‌, రాయరావు పేటలో 40 ఎకరాలలో చిన్న పరిశ్రమల పార్కు ఏర్పాటు చేస్తున్నారు.
* ఇబ్రహీంపట్నంలో 123 ఎకరాలలో  ఫైబర్‌ గ్లాస్‌ కంపోసైట్‌ పార్కు, మొండి గౌరెల్లి, కొత్తపల్లి, నాగిరెడ్డిపల్లి, కొత్తపల్లి, నడిజి సింగారం, తుమ్మలూరు, మేడ్చల్‌ జిల్లా మాదారం, బౌరంపేట్‌, దుండిగల్‌ వద్ద, సిద్దిపేట జిల్లా తూప్రాన్లో.. బెజ్జంకి, దుద్దెడ, నర్మెట, మందపల్లి, తునికి బొల్లారం, బండ మైలారం, కొత్తూరు, ఆకుతాయిపల్లి, మెదక్‌ జిల్లా వడియారంలలో పారిశ్రామిక పార్కులు ఏర్పాటు కానున్నాయి. వరంగల్‌ నగర జిల్లా మడికొండలో 50 ఎకరాలలో జౌళి పార్కు,  సిరిసిల్ల జిల్లా నర్మాల, పెద్దూరు, జిల్లెల వద్ద, నల్గొండ జిల్లా చిట్యాల వద్ద, వనపర్తి జిల్లా వెలిగొండ, కామారెడ్డి జిల్లా జంగంపల్లి,  ఆదిలాబాద్‌ జిల్లా నాన్నల్‌, జగిత్యాల జిల్లా స్తంబంపల్లి, జోగులాంబ గద్వాల జిల్లాలలో గద్వాల్‌, సూర్యాపేటలో, మనోహరాబాద్‌ వద్ద, మంచిర్యాల జిల్లా అంతర్గాం,  రామగుండంలలో, మిర్యాలగూడ, బాన్సువాడ, తాండూరు శివార్లలో కొత్తగా ఆటోనగర్‌ పార్కులు వస్తున్నాయి. వరంగల్‌ నగర జిల్లా స్టేషన్‌ ఘన్‌పూర్‌లో  బహుళ ఉత్పత్తుల పార్కు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి.

ఐటీకి సైతం...
సాధారణంగా తయారీ పరిశ్రమలే నగరాలకు దూరంగా ఉంటాయి. ఐటీ పరిశ్రమలకు నగరాలే కేంద్రంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున ఐటీ, సాఫ్ట్‌వేర్‌ పరిశ్రమలు పనిచేస్తున్నాయి. ఐటీ ప్రగతిని ద్వితీయ శ్రేణి నగరాలు, పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాలకు విస్తరించేందుకు వీలుగా ప్రభుత్వం సన్నాహాలు చేపట్టింది.   రంగారెడ్డి జిల్లా బుద్వేల్లో 327 ఎకరాలలో హైటెక్‌ సిటీకి ధీటుగా మరో ఐటీ పార్కును అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం  సన్నద్ధమవుతోంది.  ఓఆర్‌ఆర్‌ అవతల గల దుండిగల్‌లో 320 ఎకరాలలో,  బౌరంపేటలో 140 ఎకరాలలో, ఉస్మాన్‌సాగర్‌(కొల్లూరు)లో 66 ఎకరాలలో కొత్త ఐటీ పార్కులను ప్రారంభించేందుకు సమాయత్తమైంది. 


ఆహారశుద్ధికి...

సిద్దిపేట జిల్లాలోని బండతిమ్మాపూర్లో 150 ఎకరాలలో ఆహారశుద్ధి పార్కు, మహబూబాబాద్‌ జిల్లా కాంపల్లిలో  మిర్చి శుద్ధి పార్కు, సంగారెడ్డి జిల్లా సదాశివపేట్‌ మండలంలో  ఔషధపార్కు, నిజామాబాద్‌ జిల్లా వేల్పూరులో 40 ఎకరాలలో సుగంధద్రవ్యాల పార్కు. కరీంనగర్‌ జిల్లా కళ్లెంలో, మక్క రాజ్‌పేట, మిట్టపల్లి, తునికి బొల్లారం, లక్కంపల్లిలో  ఆహారపార్కులు, మాసాయిపేట్లో మాంసం, గుడ్ల శుద్ధి పార్కుల ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. 


స్థానిక నిరుద్యోగులకు పెద్దపీట

గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమల స్థాపనకు ఇప్పటికే పలు సంస్థలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. మరికొన్ని దరఖాస్తు చేసుకున్నాయి. బహుళజాతి, దేశీయ పారిశ్రామికవేత్తలతో పాటు స్థానిక పారిశ్రామికవేత్తలను పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం ఆహ్వానిస్తోంది. స్థానిక నిరుద్యోగ యువకులకు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించాలని సంకల్పించింది. భూములు, ఇతర వనరుల లభ్యత తదితర అంశాలను ప్రాతిపదికగా తీసుకొని పార్కుల ప్రతిపాదనలను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.