క్లోన్‌ రైళ్ల మర్మమేంటో!
close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
క్లోన్‌ రైళ్ల మర్మమేంటో!

ప్రైవేటు ఆపరేటర్ల కోసమేనని సందేహాలు
బయల్దేరేది అసలు రైళ్ల కంటే ముందుగానే..
వాటిలో ప్రయాణానికే ప్రయాణికుల మొగ్గు

ఈనాడు-హైదరాబాద్‌: ప్రైవేటు రైళ్లను ఏడాదిన్నర వ్యవధిలో పట్టాలు ఎక్కించేలా రైల్వేశాఖ ముందుకు వెళ్తోంది. మరోవైపు కొద్దిరోజుల క్రితం ప్రయోగాత్మకంగా క్లోన్‌ రైళ్లను ప్రారంభించిన రైల్వేశాఖ త్వరలో మరికొన్నింటిని తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తోంది. ఈ రైళ్లను నడుపుతున్న తీరు, ప్రత్యేకంగా వీటికి కల్పిస్తున్న వెసులుబాటును పరిశీలిస్తే రైల్వే శాఖ ప్రైవేటు రైళ్ల కోసం సన్నాహాలు చేస్తుందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

క్లోన్‌ రైలు ఎందుకంటే..
తెలంగాణలోని సికింద్రాబాద్‌, బిహార్‌లోని దర్భంగా మధ్య ఒక రెగ్యులర్‌ రైలు ఉంది. ఈ రైలుకు డిమాండ్‌ ఉన్న దృష్ట్యా.. నిత్యం వందల మంది ప్రయాణికులు నిరీక్షణ జాబితా(వెయిటింగ్‌ లిస్ట్‌)లో ఉంటారు. అలాంటి ప్రయాణికుల ప్రయాణానికి వీలుగా రైల్వే బోర్డు ఇటీవల క్లోన్‌ రైలును ప్రవేశపెట్టింది.

రెగ్యులర్‌ రైలుతో పోల్చితే క్లోన్‌ రైలులో ప్రయాణం 3.20 గంటలు తక్కువ. దీంతో ఛార్జి ఎక్కువైనా.. ప్రయాణికులు క్లోన్‌ రైలులో వెళ్లడానికే మొగ్గు చూపుతున్నారు. రైల్వేశాఖ దేశవ్యాప్తంగా 40 క్లోన్‌ రైళ్లను నడుపుతుండగా.. విశాఖపట్నం-సికింద్రాబాద్‌ మధ్య కూడా ఓ క్లోన్‌ రైలును నడిపేందుకు దాదాపు నిర్ణయం తీసుకుంది. లింగంపల్లి-తిరుపతి, సికింద్రాబాద్‌-దిల్లీ, విజయవాడ-విశాఖపట్నం, సికింద్రాబాద్‌-గువాహటి మధ్య కూడా నడిపే ప్రణాళిక ఉన్నట్లు సమాచారం.

ఇదీ ప్రణాళిక
కొన్ని రైళ్లల్లో ఆరేడు వందల మందికిపైగా నిరీక్షణ జాబితాల్లో ఉంటున్నారు. అలాంటి గిరాకీ రైళ్లకు సమానంగా క్లోన్‌ రైళ్లను నడపాలని, రెగ్యులర్‌ రైలు బయల్దేరిన అరగంట తర్వాత ఈ రైళ్లను నడపాలన్న ఉద్దేశంతో రైల్వే శాఖ గతంలో ప్రణాళిక రూపొందించింది. కానీ ఇప్పుడు అందుకుభిన్నంగా రెగ్యులర్‌ రైలు కంటే ముందే వీటిని నడుపుతుండటం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ప్రైవేటు రైళ్లకు పెద్ద సంస్థల దరఖాస్తులు
దేశంలోని 12 మార్గాల్లో 151 ప్రైవేటు రైళ్లను నడిపే ప్రక్రియను రైల్వేశాఖ ముందుకు తీసుకెళ్తోంది. సికింద్రాబాద్‌ క్లస్టర్‌ నుంచే 11 ప్రైవేటు రైళ్లను నడిపేందుకు రైల్వే శాఖ ప్రణాళికను సిద్ధం చేసింది. వీటిని నడిపేందుకు బీహెచ్‌ఈఎల్‌, ఎల్‌అండ్‌టీ, జీఎంఆర్‌, మెగా ఇంజినీరింగ్‌ తదితర పెద్ద సంస్థలతోపాటు మరికొన్ని సంస్థల నుంచి 120 దరఖాస్తులు వచ్చాయి. హైదరాబాద్‌లో ప్రైవేటు రైళ్లు ఎక్కడి నుంచి బయల్దేరాలన్న విషయంపై కూడా కసరత్తు మొదలైంది. నాగులపల్లిలో ప్రత్యేక రైల్వే టెర్మినల్‌ వచ్చే అవకాశాలున్నాయని ద.మ.రైల్వే వర్గాలు తెలిపాయి.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు