close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మీ ఖాతాతో మీకే టోకరా!  

నమ్మిస్తారు.. నగదు మాయం చేస్తారు
సైబర్‌ నేరగాళ్ల సరికొత్త ఎత్తుగడలు

ధునిక సాంకేతికతతో సైబర్‌ నేరాలకు పాల్పడుతూ బ్యాంకు ఖాతాల్లోని సొమ్మును స్వాహా చేస్తున్న ఘరానా మోసగాళ్లు రోజుకొక కొత్త అవతారం ఎత్తుతున్నారు. ఎప్పటికప్పుడు సరికొత్త తరహా మోసాలకు తెరతీస్తున్నారు. కొద్దిరోజులుగా వారు చేస్తున్న కొత్త రకం మోసాల గురించి పోలీసుల దృష్టికి వచ్చింది. తాజాగా ఈ నేరగాళ్లు ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ సౌకర్యమున్న ఖాతాదారులను లక్ష్యంగా చేసుకొని, సాంకేతికత సాయంతో వారి పాస్‌వర్డ్‌లు సంపాదిస్తున్నారు. బ్యాంకు అధికారులమంటూ ఫోన్‌ చేసి ఓటీపీ తెలుసుకొని నగదు కొల్లగొడుతున్నారు. ఈ కేసులను పోలీసులు అధ్యయనం చేస్తున్నారు. నేరగాళ్లను పట్టుకోడానికి దర్యాప్తు మొదలుపెట్టారు.


ఇలా కొల్లగొడుతున్నారు..

* సైబర్‌ నేరస్థులు మొదట ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ను ఉపయోగిస్తున్న ఖాతాదారుల పేరు, ఫోన్‌ నంబరు తదితర వివరాలు తెలుసుకుంటారు. మొబైల్‌యాప్‌, ల్యాప్‌టాప్‌, కంప్యూటర్‌ ద్వారా తరచూ నగదు లావాదేవీలు నిర్వహిస్తున్నవారిని ఎంపిక చేసుకొని సాంకేతిక పద్ధతుల ద్వారా ఆన్‌లైన్‌ ఖాతా పాస్‌వర్డ్‌ కనిపెడతారు.

* తర్వాత అదే బాధితుడికి ఫోన్‌చేసి బ్యాంక్‌ నుంచి మాట్లాడుతున్నామని.. మీఖాతాలో రూపాయి కూడా బ్యాలెన్స్‌ లేదు ఒకసారి చూసుకోమంటారు. బాధితుడు ఖాతా పరిశీలించుకుని బెంబేలెత్తిపోగానే.. కంగారేం లేదు ఐటీ విభాగం పొరపాటు వల్ల ఇలా అయ్యింది.. వెంటనే సరిచేస్తున్నామంటూ సర్దిచెబుతారు.

* ఆ ఖాతాలోని నగదు నిల్వలను బ్యాంకులు అందిస్తున్న ఈ-టీడీఆర్‌ (టెర్మ్‌ డిపాజిట్‌) సదుపాయం ద్వారా ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌గా మార్చేస్తారు.

* ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసిన మొత్తాన్ని మళ్లీ పొదుపు ఖాతాలోకి మార్చేసి బాధితుడికి ఫోన్‌ చేసి, ‘అంతా సక్రమంగా ఉంది కదా.. ఒకసారి చూసుకోండి’ అంటారు. ఖాతాదారు మళ్లీ తన ఖాతాలో డబ్బులు చూసుకుని సంతృప్తి చెందగానే అసలు మాయాజాలం మొదలు పెడతారు.


క్షణాల్లో నగదు స్వాహా..

‘సైబర్‌ నేరస్థుల బారి నుంచి రక్షించేందుకు కొన్ని జాగ్రత్త చర్యలు చేపట్టాం, ఇందులో భాగంగా కొత్త పాస్‌వర్డ్‌, ఓటీపీ పంపుతున్నాం’ అని నమ్మబలుకుతారు. ఓటీపీ, పాస్‌వర్డ్‌ వచ్చాక తమకు చెప్పమంటారు. అప్పటికే బ్యాంకు సిబ్బంది మాదిరిగా తన ఖాతా పరిశీలించి వివరాలు చెప్పడం వల్ల బాధితులు నమ్మి ఓటీపీ చెబుతారు. అంతే.. క్షణాల్లో నగదు స్వాహా చేసి, ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేసేస్తారు.


కోల్‌కతా నుంచి ఫోన్లు..
- కేవీఎం ప్రసాద్‌, ఏసీపీ, సైబర్‌క్రైమ్స్‌

సాధారణ సైబర్‌ నేరాలకు భిన్నంగా నిందితులు ఈ మోసాలు చేస్తున్నారు. కొద్దిరోజుల నుంచి వరుసగా ఫిర్యాదులు వస్తున్నాయి. బాధితులు చెప్పిన వివరాల ఆధారంగా ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించాం. కోల్‌కతా నుంచి నేరస్థులు ఇవన్నీ చేస్తున్నారన్న ఆధారాలు లభించాయి. బాధితుల నుంచి బదిలీ చేసుకున్న నగదు ఎక్కడికి వెళ్లిందో ఆరా తీస్తున్నాం. పాతబస్తీకి చెందిన ఓ యువకుడి ఖాతాలోంచి రూ.75 వేలు ఇలాగే బదిలీ చేసుకున్నారు. సైబర్‌ నేరస్థులు రోజుకు 100 మంది నుంచి 200 మందికి ఫోన్లు చేస్తున్నారని అంచనా. వీలైనంత వేగంగా నిందితులెవరో గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాం.

- ఈనాడు, హైదరాబాద్‌

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు