TS News: అమ్మో.. ఆర్టీసీ బస్సులు!

తాజా వార్తలు

Published : 25/07/2021 11:15 IST

TS News: అమ్మో.. ఆర్టీసీ బస్సులు!

నామమాత్రంగా నిర్వహణ
ఏళ్లుగా భర్తీకాని క్షేత్రస్థాయి పోస్టులు

వరంగల్‌ ఆర్టీసీ రీజియన్‌లోని తొర్రూరు డిపో బస్సు కాటేపల్లి వద్ద వేగంగా వెళ్తుండగా టైర్లు ఊడిపోయాయి. ఈ బస్సు అంతకుముందు పంక్చర్‌ కావటంతో టైర్లు బయటకు తీసి మళ్లీ బిగించారు. ఆ సమయంలో నట్లు బిగించటంలో లోపం వల్లే టైర్లు ఊడిపోయాయని అధికారులు చెబుతున్నారు. ఇలాంటి ఘటనలు గతంలోనూ పలు ప్రాంతాల్లో జరిగాయి.
వరంగల్‌ ఆర్టీసీ రీజియన్‌ పరిధిలోని స్టేషన్‌ఘన్‌పూర్‌ వద్ద శుక్రవారం వరంగల్‌-1 డిపో బస్సు షార్ట్‌ సర్క్యూట్‌తో కాలి బూడిదయింది. మూడేళ్ల కిందట కూడా ఇదే తరహాలో బస్సు దగ్ధమైంది. ఇలాంటి ఘటనలకు నిర్వహణ లోపమే కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఈనాడు, హైదరాబాద్‌: అసలే ఇబ్బడిముబ్బడిగా నష్టాలు. అప్పు కూడా పుట్టని పరిస్థితి. ఇవన్నీ చాలవన్నట్లు నడుస్తున్న బస్సు టైర్లు ఊడిపోవటం.. మంటల్లో చిక్కుకోవటం.. ఇదీ తెలంగాణ ఆర్టీసీ పరిస్థితి. గత ఏడాది రూ. 2వేల కోట్లకుపైగా నష్టం మూటగట్టుకుంది. రూ.వెయ్యి కోట్ల అప్పు కోసం నెలల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి. 2008లో ఏసీ బస్సులను సుమారు రూ.50 లక్షల చొప్పున వ్యయంతో కొనుగోలు చేశారు. వీటి మైలేజీ అంతంతమాత్రం. ఈ బస్సులకు ఇంజిన్‌ వెనుక వైపు ఉంటుంది. షార్ట్‌ సర్క్యూట్‌ అయ్యే అవకాశాలు ఎక్కువ. కాలం చెల్లిన బస్సుల్లో మార్పులు చేసి గ్రామీణ ప్రాంతాల్లోనూ, అంతర్‌ జిల్లా సర్వీసులుగానో నడుపుతున్నారు. అలా నడుపుతున్న బస్సే స్టేషన్‌ఘన్‌పూర్‌ వద్ద దగ్ధమైంది.

గ్యారేజీల్లో ఖాళీలు

డిపో నుంచి బయటకు వచ్చే ముందు బస్సును ఆసాంతం పరిశీలిస్తారు. టైర్ల నుంచి ఇంజిన్, లైట్ల వరకు తనిఖీ చేసి అన్నీ సక్రమంగా ఉన్నాయంటేనే బస్టాండుకు పంపుతారు. బస్సుల నిర్వహణలో శ్రామిక్, ఆర్టిజన్లు, క్లీనర్ల పాత్ర కీలకం. గడిచిన ఏడెనిమిది ఏళ్లుగా ఆయా పోస్టులను భర్తీ చేస్తున్న దాఖలాలు లేవు. సుమారు 3-4 వేల వరకు పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సమాచారం.

పూర్తిస్థాయి ఎండీ లేక..

ఆర్టీసీకి సుమారు రెండున్నరేళ్లుగా పూర్తిస్థాయి మేనేజింగ్‌ డైరెక్టర్‌(ఎండీ) లేరు. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్‌శర్మ ఇన్‌ఛార్జి ఎండీగా వ్యవహరిస్తున్నారు. గతంలో ఎప్పుడూ ఇంత సుదీర్ఘకాలం పాటు ఇన్‌ఛార్జి పాలనలో లేదు. పూర్తిస్థాయి ఎండీ లేకపోవడం వల్ల పర్యవేక్షణ కొరవడుతోందని గతంలో ఆ పోస్టులో పనిచేసిన విశ్రాంత ఐపీఎస్‌ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని