close

తాజా వార్తలు

నేతన్నలను బలిగొన్న రుణం

సుబ్బారెడ్డి

పులిగుండ్లపల్లి(తలుపుల) : పులిగుండ్లపల్లి పంచాయతీ యనమలదొడ్డిపల్లికి చెందిన పెద్ద సుబ్బారెడ్డి(36) అనుమానాస్పద స్థితిలో మామిడి చెట్టుకు ఉరి వేసుకొని మృతిచెందినట్లు ఎస్సై రఫీ తెలిపారు. పెద్ద సుబ్బారెడ్డి ధర్మవరంలో మగ్గం నేస్తూ జీవించేవాడు. ఇతనికి గ్రామంలో 2.58 ఎకరాల్లో మామిడి చెట్లు ఉన్నాయి. వాటిని చూడడానికి రెండు రోజుల కిందట వచ్చాడు. ఏమైందో ఏమో తెలియదు కాని సోమవారం మామిడి చెట్టుకు బిందుసేద్యపు పైపులతో ఉరివేసుకొన్నాడు. కుటుంబసభ్యులు మాత్రం అప్పుల బాధతో బలవన్మరణం పొందాడని చెబుతున్నారు. ఏడాది కిందట ఇతని తమ్ముడు చిన్న సుబ్బారెడ్డి ఇదే మామిడి తోటలో ఉరివేసుకొని మృతి చెందాడు. అతను చేసిన రూ.1.40 లక్షల అప్పులకు సంబంధించి రుణదాతలు, ఇతనికి నోటీసులు పంపారని, వాటితోపాటు మరిన్ని అప్పులు ఉన్నాయని వాటిని తలుచుకుని మనస్తాపంతో బలవన్మరణం పొందాడని చెబుతున్నారు. ఎస్సై మాత్రం ఎవరూ ఫిర్యాదు చేయలేదన్నారు. కుటుంబసభ్యులు ఇచ్చే ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేస్తామని చెప్పారు. బాధితుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కుటుంబసభ్యులు కోరుతున్నారు.

 

హరినాథ్‌ (పాతచిత్రం)

కొడిగెనహళ్లి (పరిగి), న్యూస్‌టుడే: చేసిన అప్పులే అతడి పాలిట మరణ శాసనాలు అయ్యాయి. అప్పుల బాధ తాళలేక చేనేత కార్మికుడు ఆదివారం రాత్రి చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన పరిగి మండలం కొడిగెనహళ్లిలో చోటుచేసుకుంది. పరిగి ఎస్‌ఐ శ్రీనివాసులు అందించిన వివరాల మేరకు.. మండలంలోని కొడిగెనహళ్లి పంచాయతీలోని బిందూనగర్‌కు చెందిన దేవాంగం హరినాథ్‌ (29) వ్యాపారం కోసం, తన చెల్లెలి పెళ్లి కోసం బయటి వ్యక్తుల నుంచి రూ.3.50 లక్షలకు పైగా అప్పులు చేశాడు. చేసిన అప్పులు ఎలా తీర్చాలో పాలుపోక జీవితంపై విరక్తి చెందిన తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని పేర్కొంటూ చరవాణిలో స్వీయ వీడియోను చిత్రీకరించాడు. తనకు ఎదురవుతున్న సమస్యలు, అప్పులు ఎలా తీర్చాలో దిక్కుతోచడం లేదనే ఆవేదనతో తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ తీసిన వీడియోను తన మిత్రులకు వాట్సాప్‌ ద్వారా పంపాడు. అనంతరం ఆదివారం రాత్రి చెరువు ఒడ్డుకు వెళ్లిన హరినాథ్‌ గట్టుపై చరవాణి, పాదరక్షలు వదిలి పెట్టి నీటిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి ఆచూకీ కోసం చెరువులో గాలించారు. సోమవారం ఉదయం నీటిలో శవమై తేలాడు. హరినాథ్‌ మృతిపై తండ్రి ఈశ్వరప్ప ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.