close

ప్రధానాంశాలు

ఇక పంత్‌ ‘విశ్వరూపం’!

ఐపీఎల్‌ రెండో అర్ధభాగంలో పరుగుల సునామీ తప్పదంటున్న రికీ పాంటింగ్‌

దిల్లీ: ప్రపంచకప్‌లో టీమిండియాకు రిషభ్ పంత్‌ X-ఫ్యాక్టర్‌ అయ్యేవాడని ఆసీస్‌ దిగ్గజం రికీ పాంటింగ్‌ అన్నాడు. అతడిని జట్టులోకి తీసుకోకపోవడం ఆశ్చర్యం కలిగించిందని పేర్కొన్నాడు. పంత్‌ తుది 11 మందిలోనూ ఉంటాడని అనుకున్నానని ఆయన వెల్లడించాడు. ఇప్పుడిక ఐపీఎల్‌లో పరుగుల పారిస్తాడని అన్నాడు.

‘నాలుగు, ఐదు స్థానాల్లో బ్యాటింగ్‌ చేయగల రిషభ్‌పంత్‌ జట్టుకు X-ఫ్యాక్టర్‌ అయ్యేవాడు. భారత్‌, ఇతర జట్లకు తేడాగా ఉండేవాడు. భారత క్రికెట్‌లో బ్యాటింగ్‌ డెప్త్‌ చాలా ఉంటుంది. ఈ సారి పంత్‌ను ఎంచుకోలేదు. అతడు కెరీర్‌ ముగిసే లోపు కనీసం 3 ప్రపంచకప్‌లు ఆడకపోతే అది నాకు విస్మయమే. భారత జట్టుకు వద్దనుకున్నవాడే ఇప్పుడు దిల్లీ క్యాపిటల్స్‌కు కీలకం అవుతాడు. ఐపీఎల్‌ మిగతా సీజన్‌పై పంత్‌ దృష్టి సారిస్తాడు’ అని పాంటింగ్‌ అన్నాడు.

‘పంత్‌ను ఎందుకు ఎంపిక చేయలేదో నాకు తెలియదు. అతడిని కాదని ఇతరుల్ని ఎందుకు ఎంపిక చేశారో తెలియదు. నిజం చెప్పాలంటే ఇది నాకు సంబంధించిన వ్యవహారం కాదు. పంత్‌ అసహనం చెందాడని అనుకోను. అతడు తెలివైనవాడు. పరిస్థితులను చక్కగా ఎదుర్కొంటాడు. అతడిని ఎంపిక చేయపోవడానికి సెలక్టర్లకు ఏవో కారణాలు ఉంటాయి. వాటిపై నేను మాట్లాడను. అవకాశం రాకపోవడంతో మీరిప్పుడు ఐపీఎల్‌లో విభిన్నమైన పంత్‌ను చూడబోతున్నారు. అతడి ఆత్మవిశ్వాసం, అంకితభావం ఎంతో గొప్పవి. ఇప్పుడిక పరుగుల వరదే’ అని పాంటింగ్‌ ధీమా వ్యక్తం చేశాడు.



మరిన్ని

దేవతార్చన

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net