close

ప్రధానాంశాలు

హాఫ్‌కే ఫుల్‌ ఎక్కేసింది !

ఆద్యంతం హోరాహోరీగా సాగుతున్న ఐపీఎల్‌

 ఈ ఐపీఎల్‌ ఆరంభం నుంచే ప్రతి మ్యాచ్‌ ఫైనల్‌ అనే రీతిలో జట్లు తలపడుతున్నాయి. మ్యాచ్‌ ముగిసే వరకు మైదానం రణరంగాన్ని తలపిస్తోంది. నిప్పులు చెరిగే బంతులని విసురుతున్న బౌలర్లుకు ఏమాత్రం తగ్గకుండా బ్యాట్స్‌మెన్‌ బదులిస్తున్నారు. చివరి వరకు నరాలు తెగిపోయేలా ఉత్కంఠభరితంగా సాగుతున్న మ్యాచుల్లో గెలుపు ఇరుజట్ల మధ్య దోబూచులాడిన సందర్భాలు కోకొల్లలు. సగం మ్యాచులు ముగిసేలోపే ఈ సీజన్‌ అభిమానులకు, ఆయా జట్లకు ఎన్నో అనుభూతులు అందించింది. అవేంటో ఒకసారి చూద్దాం.  

హ్యాట్రిక్‌ వీరుడు
ఇప్పటివరకు ఆడిన తొమ్మిది మ్యాచుల్లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ ఐదింటిలో విజయం సాధించి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. ఈ సీజన్‌లో దిల్లీతో జరిగిన మ్యాచ్‌ పంజాబ్‌ అభిమానులకి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఓటమి తథ్యమని భావించిన మ్యాచ్‌ని సామ్‌ కరన్‌ దిల్లీ చేతుల్లోంచి లాగేసి పంజాబ్‌కు అనూహ్య విజయాన్ని అందించాడు. కేవలం 14 బంతులు వేసిన కరన్‌ నాలుగు వికెట్లు తీసి దిల్లీ పరాజయానికి కారకుడయ్యాడు. దీనిలో హ్యాట్రిక్‌ కూడా ఉండటం విశేషం. దీంతో ఐపీఎల్‌లో హ్యాట్రిక్‌ సాధించిన అతి పిన్నవయస్కుడిగా సామ్‌ రికార్డు సృష్టించాడు. తన పదునైన ఇన్‌స్వింగర్లతో ప్రత్యర్థులకు సవాలుగా మారిన ఈ ఇంగ్లాండ్‌ యువ ఆల్‌రౌండర్‌కు ఇది తొలి ఐపీఎల్‌. 

అల్లాడించిన అల్జారి
కొత్త కుర్రాళ్లని పరిచయం చేయడంలో ముంబయి ఇండియన్స్‌ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుంది. ఈ సారి కూడా యువ సంచలనాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది. అయితే అతను భారత కుర్రాడు కాదు.. కరీబియన్‌ పేసర్‌ అల్జారి జోసెఫ్‌. అంతకుముందు పలు అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఆడిన జోసెఫ్‌కు.. తొలి టీ20 అవకాశం ముంబయి కల్పించింది. అరంగ్రేట మ్యాచ్‌లోనే రికార్డులన్ని పాకెట్‌లో వేసుకున్నాడు. తొలి బంతికే వికెట్‌ పడగొట్టిన బౌలర్‌గా, తొలి ఓవర్‌నే మెయిడిన్‌ చేసిన ఆటగాడిగా అల్జారి రికార్డు నెలకొల్పాడు. ఒక మ్యాచ్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా సోహైల్‌ తన్వీర్‌ పేరిట ఉన్న 11 ఏళ్ల రికార్డుని తొలి మ్యాచ్‌లోనే బద్దలు కొట్టాడు. సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అల్జారి 3.4 ఓవర్లలో 12 పరుగులిచ్చి ఆరు వికెట్లు తీశాడు.  

‘బెంగ’ళూరు
అరవీర భయంకర యోధులున్నా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు వరుస వైఫల్యాలతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. బ్యాటింగ్‌లో పుష్కలమైన వనరులున్న బెంగళూరు.. బౌలర్లు విఫలమవుతుండటంతో వరుస ఓటములను మూటగట్టుకుంటుంది. అత్యధిక వికెట్లు పడగొట్టిన జాబితాలో చాహల్‌ ముందుంటున్నా ఇతరుల నుంచి సహకారం అందకపోవడంతో ప్రత్యర్థులను కట్టడి చేయడంలో విఫలమవుతున్నారు. కేవలం కోహ్లి, డివిలియర్స్‌ మీదే జట్టు ఆధారపడుతుండటంతో ప్రత్యర్థులకు విజయాలు సులువవుతున్నాయి. వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో ఓడిపోయి ఆర్‌సీబీ అత్యంత చెత్త రికార్డుని నమోదు చేసింది. 2013లో వరుసగా ఆరు మ్యాచులు ఓడిపోయిన దిల్లీ రికార్డుని సమంచేసింది. 

నేను దిగనంతవరకే..
రసెల్‌ బ్యాటింగ్‌కు రానంతసేపు మ్యాచ్‌ ప్రత్యర్థుల వైపే ఉంటుంది. బరిలో దిగాడా... మ్యాచ్‌ కోల్‌కతవైపు వచ్చేస్తుంది. కోల్‌కతా విజయానికి సాధ్యం కానీ సమీకరణాలున్న సందర్భంలో పిడుగులా ప్రత్యర్థులపై పడి మ్యాచ్‌ రూపురేఖలనే మారుస్తున్నాడు రసెల్‌. సిక్సర్ల వర్షం కురిపిస్తూ కోలకతాకు గెలుపు వరాలని విరజల్లుతున్నాడు. హైదరాబాద్‌, బెంగళూరు, దిల్లీ జట్లంతా ఇతని దెబ్బకి కుదేలయ్యాయి. రాజస్థాన్‌పై బ్యాటింగ్‌కు దిగకపోవడంతో ‘రసెల్‌ సెగ’ ఇంకా ఆ జట్టుకి తగల్లేదు. సిక్సర్ల యోధుల్లో అగ్రస్థానంలో ఉన్న రసెల్.. 312 పరుగులతో అత్యధిక పరుగుల వీరుల్లో నాలుగో స్థానంలో ఉన్నాడు. 

పదేళ్ల నిరీక్షణ ఫలించేనా..
ఐపీఎల్‌-2019లో అదృష్టం దరికి చేరని జట్టు ఆర్‌సీబీ తర్వాత రాజస్థాన్‌ రాయల్స్‌ అనే చెప్పొచ్చు.  ఈ సీజన్‌లో వికెట్లకు బంతి తాకినా బెయిల్స్‌ ఎగరని సంఘటనలు మూడైతే.. అందులో రెండు రాజస్థాన్‌ రాయల్స్‌కు వ్యతిరేకంగా జరిగాయి. అన్ని మ్యాచుల్లోనూ వీరోచితంగా పోరాడుతున్నా కీలక సమయంలో తడబడతూ రాజస్థాన్‌ ఓటములను మూటగట్టుకుంటుంది. ఇప్పటివరకు ఏడు మ్యాచులాడిన రాజస్థాన్‌ రెండింట మాత్రమే విజయం సాధించింది. బలమైన ముంబయి జట్టుని.. వారి సొంత మైదానంలోనే మట్టికరిపించి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకున్న ఆర్‌ఆర్‌.. ప్లేఆఫ్స్‌ రేసులో నిలవాలంటే మరిన్ని విజయాలు అవసరం. తొలి ఐపీఎల్‌ టైటిల్‌ సాధించిన రాజస్థాన్‌ రెండో టైటిల్‌ కోసం పదేళ్ల నుంచి నిరీక్షిస్తోంది.

ప్రశాంతతకే ఆవేశం వస్తే..
ఇప్పటివరకు తొమ్మిది మ్యాచులాడిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఏడు మ్యాచుల్లో గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. డాడీస్‌ ఆర్మీగా పేరున్న ఈ జట్టులో అనుభవజ్ఞులకి కొదవ లేదు. ప్రత్యర్థులని కట్టడి చేయడంలో ధోని వ్యూహాలకు తిరుగులేదు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ‘మిస్టర్‌ కూల్‌’కు కోపం రావడం చాలా అరుదు. కానీ రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో.. డగౌట్‌లో ఉన్న ధోని మైదానంలోకి వచ్చి అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. ఈ మ్యాచ్‌ క్రికెట్‌ చరిత్రలోనే గుర్తుండిపోతుందనడంలో సందేహం లేదు. ధోని ఆవేశం, ఆఖరి బంతి వరకు పోరాడి శాంట్నర్‌ సిక్సర్‌తో చెన్నై విజయం సాధించడం.. అభిమానులకు ఎప్పటికీ గుర్తుంటుంది. బెన్‌స్టోక్స్‌ బౌలింగ్‌లో జడేజా కిందపడుతూ సిక్సర్‌ బాదడం ఈ మ్యాచ్‌కు మరో హైలైట్‌.  

దాదా మాయేనా.. 
డేర్‌ డెవిల్స్‌ నుంచి క్యాపిటల్స్‌గా మారిన ‘దిల్లీ’ ఈ సీజన్‌లో మంచి ఫలితాలని రాబడుతోంది. 11 సీజన్లలో ఒక్కసారి కూడా ఫైనల్‌కు చేరని దిల్లీ నిలకడగా రాణిస్తూ.. ఈ సారి టైటిల్‌ ఫేవరేట్‌గా నిలుస్తోంది. దిల్లీ క్యాపిటల్స్‌కు సలహాదారుగా గంగూలీ వ్యవహరించడం జట్టుకు ఎంతో మేలు కలుగుతోందంటున్నారు విశ్లేషకులు. కలసికట్టుగా శ్రమిస్తూ విజయాలను అందుకుంటున్నారు. కానీ దిల్లీ కొన్ని మ్యాచుల్లో అత్యంత పేలవమైన ప్రదర్శన చేస్తోంది. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐదుగురు బ్యాట్స్‌మెన్‌ డకౌట్‌గా వెనుదిరిగి... దిల్లీ చెత్త రికార్డుని నమోదు చేసుకుంది. విజయావకాశాలు పుష్కలంగా ఉన్న ఈ మ్యాచ్‌లో ఎనిమిది పరుగుల వ్యవధిలోనే ఏడు వికెట్లను కోల్పోయి ఓటమిపాలైంది. 

సన్‌రైజర్స్‌కు ఏమైంది ?
హ్యాట్రిక్‌ విజయాలను సాధించి అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌.. తర్వాత ఓటముల్లో హ్యాట్రిక్‌ కొట్టింది. ఓపెనర్లు డేవిడ్‌ వార్నర్‌, బెయిర్‌స్టో భీకరమైన ఫామ్‌లో ఉన్నా మిగిలిన బ్యాట్స్‌మెన్‌ నుంచి సహకారం అందకపోవడంతో ఓటములను మూటగట్టుకుంటుంది. పరుగుల దాహంతో ఉన్నట్లుగా ఓపెనర్లు సీజన్ ఆరంభం నుంచే అదరగొడుతున్నారు. కానీ వారి శ్రమను మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ బూడిదలో పోసిన పన్నీరుగా చేస్తున్నారు. దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 101/2తో పటిష్ఠంగా ఉన్న హైదరాబాద్‌.. తర్వాత 15 పరుగులకే ఎనిమిది వికెట్లను కోల్పోయింది. కేవలం 22 బంతుల్లోనే ఎనిమిది వికెట్లను కోల్పోయి గెలిచే మ్యాచ్‌ను చేజేతులా జారవిడుచుకుంది.

- ఇంటర్నెట్‌ డెస్క్‌మరిన్ని

దేవతార్చన

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net