తుది పోరుకు సిద్ధమైన బిహార్‌!
close

తాజా వార్తలు

Published : 06/11/2020 18:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తుది పోరుకు సిద్ధమైన బిహార్‌!

అన్ని పార్టీలకు కీలకంగా మూడోదశ స్థానాలు

పట్నా: మూడోదశ ఎన్నికలకు బిహార్‌ సిద్ధమైంది. తుది దశలో భాగంగా శనివారం నాడు రాష్ట్రంలోని 78 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు జరుగనున్నాయి.  2.34కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ దశలో మొత్తం 1204 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా, అసెంబ్లీ స్పీకర్‌తో పాటు మరో 12మంది మంత్రులు కూడా మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

బిహార్‌లో ఇప్పటికే రెండు దశల్లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగిన విషయం తెలిసిందే. 19జిల్లాల పరిధిలోఉన్న 78స్థానాలకు శనివారం ఎన్నికలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా గంగానదికి ఉత్తర భాగంలోనే ఉన్న కోసీ-సీమాంచల్‌ ప్రాంతంలోనివే. అంతేకాకుండా ఇక్కడ కాంగ్రెస్‌కు కూడా పట్టు ఉంది. కేంద్ర మాజీ మంత్రి శరద్‌ యాదవ్‌ కుమార్తె సుభాషిణి యాదవ్‌ బిహారిగంజ్‌ అసెంబ్లీ స్థానం నుంచి పోటీలో ఉన్నారు. ఈమె ప్రస్తుతం కాంగ్రెస్‌ తరపున పోటీచేస్తున్నారు. దీంతో ఇక్కడ ఎన్‌డీఏ, కాంగ్రెస్‌ మధ్య గట్టి పోటీ ఉండే అవకాశం ఉంది. అంతేకాకుండా ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ కూడా చాలా స్థానాల్లో తమ పార్టీనుంచి అభ్యర్థులను బరిలో దించారు. భారీగానే ప్రచారాన్ని నిర్వహించారు.

మోదీ ప్రచారం, నితీశ్‌ భావోద్వేగ ప్రకటన..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ల ప్రచార వ్యూహాలతో ఇక్కడ ఓటర్ల గాలి మళ్లే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ‘ఇవే నా చివరి ఎన్నికలు’ అంటూ నితీశ్ కుమార్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర భావోద్వేగానికి గురిచేసినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో కుటుంబ పాలన లేకుండా ఉండాలంటే నితిశ్‌కుమార్‌నే మరోసారి గెలిపించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా తన ప్రచారంలో ఓటర్లను కోరారు. దీంతో ఇక్కడ ఓటర్ల ఎన్‌డీఏ వైపే మొగ్గుచూపే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

పోటీలో పప్పూయాదవ్‌..
సీమాంచల్‌ ప్రాంతంలో మాజీ పార్లమెంట్‌ సభ్యుడు, జన్‌ అధికార్‌ పార్టీ (జేఏపీ) నేత పప్పూ యాదవ్‌ తన ప్రభావాన్ని చూపించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలోని జేఏపీ, ఆజాద్‌ సమాజ్‌ పార్టీ, బహుజన్‌ ముక్తి పార్టీ, సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (ఎస్‌డీపీఐ)లు కలిసి కూటమిగా ఏర్పడ్డాయి. దీంతో ఈ ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు సాధించి తమ ప్రభావాన్ని నిరూపించుకునేందుకు గట్టి ప్రయత్నం చేస్తోంది. ఈ కూటమి తరపున పప్పూయాదవ్‌ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్నారు. మాధేపురా అసెంబ్లీ నియోజకవర్గంనుంచి ఆయన పోటీ చేస్తున్నారు.

పోటీ ఇవ్వనున్న ఎల్‌జేపీ..
మూదో దశ పోలింగ్‌ జరుగుతున్న ప్రాంతాల్లో అధికార పక్షానికి ఎల్‌జేపీ కూడా గట్టి పోటీ ఇవ్వనుంది. ఇక్కడ ప్రచారం నిర్వహించిన చిరాగ్‌ పాశ్వాన్‌, ముఖ్యమంత్రికి వేసే ప్రతి ఓటు బిహార్‌ భవిష్యత్‌ను నష్టపరిచేదే అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లారు. దీంతో ఎన్‌డీఏ, ముఖ్యంగా జేడీయూకు ఎల్‌జేపీ పోటీ ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది.

మరో పార్లమెంట్‌ స్థానానికి..
తుదిదశలో 78స్థానాలతోపాటు వాల్మీకి నగర్‌ లోక్‌సభ స్థానానికి కూడా శనివారమే ఉపఎన్నిక జరుగనుంది. జేడీయూ పార్లమెంట్‌ సభ్యుడు బైద్యనాథ్‌ మహతో మృతిచెందడంతో ఇక్క ఉపఎన్నిక అనివార్యమయ్యింది. ఆయన కుమారుడు సునిల్‌ కుమార్‌ను జేడీయూ బరిలోకి దించింది. అయితే, ఇక్కడ జర్నలిస్ట్‌గా చేసిన ప్రవేశ్‌ కుమార్‌ మిశ్రా కాంగ్రెస్‌ తరపున గట్టి పోటీ ఇవ్వనున్నారు.

ఇప్పటికే తుది దశ ప్రచార పర్వం ముగియగా.. పోలింగ్‌ సజావుగా జరిగేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నవంబర్‌ పదో తేదీన ఓట్ల లెక్కింపు చేస్తారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని