close

తాజా వార్తలు

Published : 30/07/2020 16:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 5 PM

1. భారత్‌, చైనా, రష్యాలకు శ్రద్ధలేదు..:! ట్రంప్‌

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విదేశాలపై తన అక్కసును మరోసారి బయటపెట్టారు. భారత్‌, చైనా, రష్యా దేశాలు వారిదేశ పర్యావరణంపై శ్రద్ధ చూపడం లేదని విమర్శించారు. అమెరికా మాత్రం తమ దేశంలో కాలుష్యంపై పూర్తి జాగ్రత్తలు తీసుకుంటోందని అభిప్రాయపడ్డారు. పారిస్‌ పర్యావరణ ఒప్పందం ఏకపక్షంగా ఉందన్న ట్రంప్‌, దానినుంచి వైదొలగడాన్ని సమర్థించుకున్నారు. అంతేకాదు తాను అధ్యక్షుడిగా ఉన్నంత కాలం అమెరికాను అగ్ర స్థానంలో ఉంచుతానని అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. ఐపీఎల్‌లో ట్విస్ట్‌.. ఫైనల్‌ వాయిదా?

కరోనా వైరస్‌ పరిస్థితుల కారణంగా నిరవధికంగా నిలిచిపోయిన ఐపీఎల్‌ పదమూడో సీజన్‌ సెప్టెంబర్‌ 19 నుంచి నవంబర్‌ 8 వరకు యూఏఈలో నిర్వహిస్తున్నట్లు గవర్నింగ్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ బ్రిజేశ్‌ పటేల్‌ గతవారం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా, ఇప్పుడు ఫైనల్‌ మ్యాచ్‌పై కొత్త ట్విస్టు తెరపైకి వచ్చింది. షెడ్యూల్‌ ప్రకారం నవంబర్‌ 8న జరగాల్సిన తుది పోరును రెండు రోజులు జాప్యం చేసి 10వ తేదీన నిర్వహించాలని చూస్తున్నట్లు సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. కౌన్సిల్‌ ఉప ఎన్నిక షెడ్యూల్‌ విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో కౌన్సిల్‌ ఉప ఎన్నిక షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం విడుదల చేసింది. మోపిదేవి వెంకటరమణ రాజీనామాతో ఏర్పడిన ఖాళీని భర్తీ చేసేందుకు ఎన్నిక జరగనుంది. ఆగస్టు 6న నోటిఫికేషన్‌ విడుదల, 13న నామినేషన్ దాఖలు, ఆగస్టు 24న పోలింగ్‌, అదే రోజు ఓట్ల లెక్కింపు జరుగుతుందని ఎన్నికల సంఘం వెల్లడించింది. ఎమ్మెల్సీ, మంత్రిగా ఉన్న మోపిదేవి వెంకటరమణను వైకాపా అధిష్ఠానం రాజ్యసభకు పంపించడంతో ఆ స్థానం ఖాళీ అయిన విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. మాంసం దుకాణాలను తనిఖీ చేశారా?: హైకోర్టు

బక్రీద్‌ సందర్భంగా ఒంటెల అక్రమ రవాణా, వధ నిరోధించాలంటూ డాక్టర్‌ శశికళ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్‌పై తెలంగాణ ప్రభుత్వం వివరణ ఇచ్చింది. హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో జంతు వధ కేంద్రాలను తనిఖీ చేసినట్లు పేర్కొంది. జంతువుల అక్రమ వధపై ఇప్పటి వరకు రెండు కేసులు నమోదయ్యాయని వెల్లడించింది. దీనిపై కోర్టు స్పందిస్తూ జంతు వధ నిబంధనల ప్రకారమే జరగాలని స్పష్టం చేసింది. మాంసం దుకాణాలను జీహెచ్‌ఎంసీ అధికారులు ఎప్పుడైనా తనిఖీ చేశారా  అని ప్రశ్నించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. ఏపీ సర్కారుకు కృష్ణాబోర్డు లేఖ!

రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో ముందుకెళ్లవద్దని కృష్ణానదీ యాజమాన్య బోర్డు మరోమారు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతి లేకుండా ఏపీ ప్రభుత్వం కొత్త ప్రాజెక్టును చేపడుతోందని గతంలోనే తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. సీఎం నియోజకవర్గంలో ఇంత దారుణమా: ఉత్తమ్

ముఖ్యమంత్రి కేసీఆర్‌ నియోజకవర్గంలోని వర్గల్‌ మండలం వేలూరు గ్రామానికి చెందిన దళితుడు బ్లాగరి నర్సింహులు ఆత్మహత్య బాధాకరమని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. నర్సింహులు మృతికి కారణమైన వారిపై హత్య, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. దళితులపై దాడులు పెరుగుతున్నాయన్నారు. సీఎం కేసీఆర్‌ నియోజకవర్గంలోనే ఇంత దారుణమా? అని ప్రశ్నించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. సుశాంత్‌ సింగ్‌ది హత్యే: సుబ్రహ్మణ్య స్వామి

యువనటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ది హత్య అని తాను గట్టిగా నమ్ముతున్నట్టు భాజపా సీనియర్‌ నేత సుబ్రమణ్య స్వామి ప్రకటించారు. అలా భావించేందుకు ఆధారాలను కూడా ఆయన నేడు సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. సుశాంత్‌ సింగ్‌ బాంద్రాలో ఉన్న తన నివాసంలో జూన్‌ 14న మృతి చెందిన సంగతి తెలిసిందే. అనంతరం వెలువడిన పోస్ట్‌మార్టం‌ నివేదికలో కూడా నటుడు ఆత్మహత్య చేసుకున్నట్టు తెలియవచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. అయోధ్యలో కరోనా కలకలం

రామ మందిరం నిర్మాణానికి భూమిపూజ ముహూర్తం సమీపిస్తున్న వేళ అయోధ్య నగరంలో కరోనా వైరస్‌ కలకలం రేపుతోంది. రామ మందిరంలో  ప్రధాన పూజారి సహాయకుడిగా ఉన్న పూజారి ప్రదీప్‌దాస్‌ కొవిడ్‌ బారిన పడ్డారు. దీంతో ఆయన్ను హోం క్వారంటైన్‌లో ఉంచారు. అలాగే, ఆలయం వద్ద విధులు నిర్వహిస్తున్న 16 మంది పోలీసు సిబ్బందికి సైతం పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు ట్రస్టు వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. అస్సాం రైఫిల్స్‌ పై ఉగ్రదాడి

మయన్మార్‌ సరిహద్దులో అస్సాం రైఫిల్స్‌ బలగాలపై ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డారు. మణిపూర్‌లోని చండేల్‌ జిల్లాలో జరిగిన ఈ కాల్పుల్లో ముగ్గురు సైనికులు అమరులయ్యారు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. తొలుత ఐఈడీ పేల్చిన పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీకి చెందిన ఉగ్రవాదులు ఆ తర్వాత కాల్పులు జరిపినట్టు సమాచారం. ఇంఫాల్‌ నుంచి దాదాపు 100 కి.మీల దూరంలో ఉన్న ఈ ఘటనా స్థలానికి అదనపు బలగాలను తరలించారు.

10. అత్యుత్తమ సారథి.. పాంటింగా, ధోనీయా?

ప్రపంచ క్రికెట్‌లో ఏ సారథికి సాధ్యంకాని ఘనతలను ధోనీ అందిపుచ్చుకున్నాడు. మరోవైపు ఆస్ట్రేలియా సారథి రికీపాంటింగ్‌ సైతం ఆ జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. ఈ ఇద్దరు దిగ్గజాల్లో అత్యుత్తమ సారథి ఎవరని ఓ అభిమాని తాజాగా పాక్‌ మాజీ సారథి షాహిద్‌ అఫ్రిదీని అడిగాడు. బుధవారం ట్విటర్‌లో అభిమానులతో ముచ్చటించిన సందర్భంగా అతడికి ఈ ప్రశ్న ఎదురైంది. దీనికి స్పందించిన మాజీ క్రికెటర్‌.. పాంటింగ్‌ కన్నా ధోనీయే అత్యుత్తమ సారథి అని మెచ్చుకున్నాడు.  పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.