
తాజా వార్తలు
దూరమయ్యే ఉద్దేశం లేదు: తాప్సీ
దక్షిణాది చిత్రపరిశ్రమపై నటి కామెంట్స్
ముంబయి: బాలీవుడ్లో వరుస సినిమాల్లో నటిస్తూనే.. అప్పుడప్పుడు విభిన్న కథా చిత్రాలతో దక్షిణాది ప్రేక్షకులను సైతం మెప్పిస్తున్నారు నటి తాప్పీ. ‘పింక్’, ‘బద్లా’, ‘థప్పడ్’ చిత్రాలతో బీటౌన్లో గుర్తింపు తెచ్చుకున్న ఆమె తాజాగా దక్షిణాది చిత్రపరిశ్రమ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దక్షిణాది ప్రేక్షకులు తనని ఎంతగానో అభిమానించారని ఆమె అన్నారు. అక్కడివాళ్లు చాలా మంచివారని తెలిపారు.
‘ఒక ఇండస్ట్రీ కోసం మరో పరిశ్రమ విషయంలో రాజీ పడాల్సి ఉంటుందని చాలామంది చెప్పారు. దానిని నేను నమ్మను. విభిన్న కథా చిత్రాలతో అటు దక్షిణాదిలోనే కాకుండా ఇటు బాలీవుడ్లో సైతం నటిస్తున్నాను. ఒక నటిగా పరిణతి చెందడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతోందని భావిస్తున్నాను. దక్షిణాది చిత్ర పరిశ్రమకు పూర్తిగా దూరం కావాలనే ఉద్దేశం నాకు లేదు. అక్కడి వారితో కలిసి నటించడం ఇష్టమే. హిందీ సినిమాల్లో నటించడం ప్రారంభించినప్పటికీ ఎన్నో సంవత్సరాలుగా అక్కడి ప్రేక్షకులు నాపై అభిమానం చూపిస్తూనే ఉన్నారు. విభిన్న పరిశ్రమల్లో నటించే అవకాశం కలగడం.. ప్రేక్షకుల సైతం ఆదరించడం చూస్తుంటే నేను ఒక అదృష్టవంతురాలిని అనే భావన కలుగుతోంది’ అని తాప్సీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. థప్పడ్ చిత్రంతో ఈ ఏడాది ఆరంభంలోనే విజయాన్ని పొందిన తాప్సీ ప్రస్తుతం ‘రష్మీ రాకెట్’ సినిమా కోసం కసరత్తులు చేస్తున్నారు.