close
Array ( ) 1

తాజా వార్తలు

చైనా‘కరోనా’.. జీవాయుధమేనా?

వెల్లువెత్తుతున్న అనుమానాలు

ఆధారాలు లేవంటున్న నిజనిర్ధారణ సంస్థలు

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘కరోనావైరస్‌’‌.. చైనాలో మొదలై ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కొత్త రకం మహమ్మారి. వందల మంది ప్రాణాలను బలితీసుకున్న పిశాచీ. ఉగ్రరూపం దాల్చుతున్న ఈ వైరస్‌ను అరికట్టేందుకు చైనా సహా పలు దేశాలు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇవన్నీ పక్కనబెడితే ఇంతకీ ఈ ‘కరోనా వైరస్‌’ ఎలా పుట్టుకొచ్చింది అనేది రోజురోజుకీ ప్రశ్నార్థకంగా మారుతోంది. ఇటీవల వైరల్‌ అయిన ఓ మీడియా కథనంతో ఈ వైరస్‌ సహజంగానే పుట్టుకొచ్చిందా? లేదా చైనా స్వయంకృతంతో బయటకొచ్చిందా? కరోనా.. ఓ జీవాయుధమా..? ఇలా అనేక అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. మరి ఇందులో నిజం ఎంతుంది..!

G న్యూస్‌ సంచలన కథనం..

ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం చైనాలోని వుహాన్‌ కేంద్రంగా కరోనా వైరస్‌ వ్యాప్తిచెందింది. వుహాన్‌లోని ఓ సముద్రపు జీవుల విక్రయశాల నుంచి ఈ వైరస్‌ పుట్టినట్లు తెలిసింది. ఆ తర్వాత గబ్బిలాల నుంచి ఈ వైరస్‌ వ్యాపించినట్లు వార్తలు వచ్చాయి. అయితే వుహాన్‌లోని పీ4 ల్యాబ్‌ నుంచి ప్రమాదవశాత్తూ ఈ వైరస్‌ లీక్‌ అయ్యిందని, ఈ తప్పిదాన్ని చైనీస్‌ కమ్యూనిస్ట్‌ పార్టీ త్వరలోనే అంగీకరిస్తుందని G న్యూస్‌ ఈ నెల 25న సంచలన కథనం రాసింది. దీంతో ఈ వైరస్‌పై అనేక అనుమానాలు మొదలయ్యాయి. అటు అంతర్జాతీయ జీవాయుధ నిపుణులు కూడా దీన్ని ప్రశ్నిస్తున్నారు. 

పీ4 ల్యాబ్ ఏం చేస్తుంది..?

కరోనా పుట్టిందని చెబుతున్న సముద్రపు జీవుల మార్కెట్‌కు కేవలం 20 మైళ్ల దూరంలోనే ఈ పీ4 వైరాలజీ ల్యాబ్‌ ఉంది. కొత్త కొత్త వ్యాధులను అరికట్టేందుకు ఇక్కడ పరిశోధనలు చేస్తుంటారు. గతంలో ప్రపంచాన్ని వణికించిన సార్స్‌, ఇతర వైరస్‌ల నమూనాలను పరిశోధనల నిమిత్తం ఇక్కడ భద్రపరిచారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ రిఫరెన్స్ లాబొరేటరీగా ఇది పనిచేయాల్సి ఉంటుంది. అయితే, ఈ ల్యాబ్‌లోనే కొత్తరకం కరోనా వైరస్‌ను జీవాయుధంగా సృష్టించారని, అది ప్రమాదవశాత్తూ లీకై బయటకు వ్యాపించిందని G న్యూస్‌ తన విశ్లేషణాత్మక కథనంలో పేర్కొంది. ఈ విషయాన్ని చైనా కమ్యూనిస్ట్‌ పార్టీ త్వరలోనే అంగీకరిస్తుందని తెలిపింది. 

అనుమానాస్పదంగా ప్రభుత్వం తీరు..

‘కరోనా’ పుట్టకొచ్చిన తొలినాళ్లలో చైనా వ్యవహరించిన తీరు చాలా అనుమానాస్పదంగా ఉందని G న్యూస్‌ తన కథనంలో పేర్కొంది. ఈ వైరస్‌ తొలి కేసు నమోదైన సమయంలో చైనా ఉపాధ్యక్షుడు వాంగ్‌ కిషాన్‌ వుహాన్‌లో రహస్య పర్యటన చేపట్టారట. అంతేగాక, ఫిబ్రవరి నాటికి ఈ వైరస్‌ వ్యాప్తి ఆగిపోతుందని వాంగ్‌ తన స్నేహితుడితో చెప్పినట్లు ఈ పత్రిక తెలిపింది. మరోవైపు వైరస్‌ను అరికట్టేందుకు చైనా ప్రభుత్వం పెద్దగా ఎలాంటి చర్యలు చేపట్టలేదని, కేవలం మిలిటరీ దళాలను మాత్రమే పంపిందని పేర్కొంది. అంతేగాక, ప్రపంచ ఆరోగ్య సంస్థ సహాయాన్ని కూడా జిన్‌పింగ్‌ సర్కార్‌ తిరస్కరించినట్లు తన కథనంలో ఆరోపించింది. ఇవన్నీ వైరస్‌పై అనుమానాలను మరింత బలపర్చేలా ఉన్నాయి. అయితే వీటిపై అధికారికంగా ఎలాంటి ఆధారాలు లేవు. 

ఫ్యాక్ట్‌ చెకర్స్‌ ఏం చెబుతున్నాయి..

సామాజిక మాధ్యమాల వేదికగా G న్యూస్‌ కథనం వైరల్‌ అవడంతో ‘పొలిటీఫ్యాక్ట్‌’ అనే నిజనిర్ధారణ సంస్థ ఫేస్‌బుక్‌ సాయంతో కథనంపై ఎంక్వైరీ చేసింది. ఈ కథనంలో పేర్కొన్నట్లుగా కమ్యూనిస్ట్‌ పార్టీ తన తప్పును అంగీకరిస్తుందని ధ్రువీకరించేందుకు ఎలాంటి ఆధారాలు లేవని పొలిటీఫ్యాక్ట్‌ వెల్లడించింది. అంతేగాక,  కథనాన్ని బలపర్చేలా ఇతర మీడియాల్లో ఎలాంటి వార్తలు రాలేదని స్పష్టం చేసింది. 

కథనాన్ని ప్రచారంలోకి తెచ్చిన G న్యూస్‌ అనేది గుయో మీడియా అనుబంధ సంస్థ. చైనా బిలియనీర్‌, రాజకీయవేత్త గుయో వెంగుయ్‌కు చెందిన ఈ సంస్థ గతంలోనూ చైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు విమర్శలు చేసింది. దీంతో ప్రభుత్వం తనను టార్గెట్‌ చేస్తుందని భావించిన వెంగుయ్‌ 2014లోనే చైనా వదిలి వెళ్లారు. ఆ తర్వాత ఫ్లోరిడాలోని డొనాల్డ్‌ ట్రంప్‌ రిసార్ట్‌లో సభ్యుడిగా కొనసాగుతున్నారు. 

ఇవీ చదవండి..

పది రోజుల్లో కరోనా మరింత తీవ్రరూపం

ఈ జాగ్రత్తలు పాటించండి


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.