close

తాజా వార్తలు

Updated : 21/07/2020 10:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆవిడలో మొహమాటం మిగిలి ఉంది

సుమ కనకాల.. యాంకరింగ్‌ కుటుంబంలో ఆమె శివగామిలాంటి వ్యక్తి. ప్రదీప్‌ మాచిరాజు.. పంచులతో, తన ఎనర్జీతో ఆకట్టుకుంటున్న యువ యాంకర్‌. వీరిద్దరు కలిసి ఆలీతో సరదాగాలో సందడి చేశారు. లాక్‌డౌన్‌ కారణంగా ఈ కార్యక్రమం మూడు నెలలపాటు నిలిచిపోగా.. ఇటీవల తిరిగి ప్రారంభమైంది. ఆలీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమానికి ఈ యాంకరింగ్‌ ద్వయం అతిథులుగా వచ్చి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది.

ఈ మూడు నెలల్లో కొత్త వంటలు ఏం నేర్చుకున్నారు?

సుమ: ఈ మూడు నెలల్లో నన్ను నేను డిస్కవర్‌ చేసుకున్నాను. వంటలు ఎప్పుడూ చేసేదే కానీ, పిల్లలు పుట్టిన తర్వాత ఇంతలా వారితో సమయం గడిపింది లేదు. మొదటి నెలలో పిల్లల్ని ఏం తింటావని అడిగి వండేదాన్ని ఆ తర్వాత అర్థమైంది.. ఇంట్లో ఉండే ఆడవారి ఫ్రస్టేషన్‌ ఏంటో. వంట చేయడం అమ్మలకు టెన్షన్‌తో కూడుకున్న పని. 

ప్రదీప్‌: మొదట్లో ఏం అర్థం కాలేదు. కరోనా కష్టాలతో జీవితం అర్థమైపోయింది. మూడు నెలల్లో అమ్మనాన్నలతో సమయం గడపడం, ఇంట్లో అసలు ఏం జరుగుతోంది? ఎన్ని సరుకులు కొంటే ఎన్ని రోజులు వస్తున్నాయి? నీళ్లు ఎంత వాడుతున్నాం? కరెంట్‌ ఎంత? అన్నీ అర్థమయ్యాయి. వాళ్లతో సమయం గడపడం చాలా సంతోషంగా ఉంది.

నువ్వు యాంకరింగ్‌లో ఎంతో ఎత్తుకు వెళ్లిపోయావు.. నీ అంత ఎత్తుకు రావాలంటే ప్రదీప్‌ ఏం చేయాలి?

సుమ: ప్రదీప్‌ కూడా తనదైన స్టైల్‌తో.. పంచులతో ఎవరిని అనుకరించకుండా తన సొంత బాడీ లాంగ్వేజ్‌, డైలాగ్స్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు. లెవల్స్‌ పెట్టడం నాకిష్టం ఉండదు కాబట్టి తను కూడా ప్రేక్షకుల మనసులో అంతే స్థానాన్ని సంపాదించుకున్నాడు.

నువ్వు చాలా మంది హీరోయిన్స్‌ని కలిశావు కదా.. వాళ్లలో అద్భుతంగా యాంకరింగ్‌ చేసిన వారెవరు?

సుమ: యాంకరింగ్‌ చేయాలంటే మొదట తెలుగు వచ్చి ఉండాలి. తెలుగు వచ్చిన హీరోయిన్స్‌ పేర్లు చెప్తే నేను చెప్తా..

అనుష్క?

అనుష్క యాంకరింగ్‌ చేస్తే భలే ఉంటుంది. ఎందుకంటే తనకంటూ సొంత చరిష్మా ఉంది. అందరినీ ఆదుకోవడం, మానవత్వం కలిగి ఉండటం వంటి వాటి వల్ల తను గొప్ప వ్యాఖ్యాత అవుతుంది.

రకుల్‌ప్రీత్‌?

రకుల్‌ప్రీత్‌.. న్యూట్రిషీయన్‌, హెల్త్‌, ఫిట్‌నెట్‌ వంటి విషయాల్లో యాంకరింగ్‌ చేస్తే అద్భుతంగా ఉంటుంది.

రష్మిక?

రష్మిక మందనా బాగుంటుంది. (ప్రదీప్‌ కలగజేసుకొని వాల్యూమ్‌ పెట్టక్కర్లేదు. ఆవిడే వినపడుతుందా అని అడుగుతుంటోంది అని చెప్పారు.)

మంచు లక్ష్మి?

మంచు లక్ష్మి యాంకర్‌గా తనకు తాను నిరూపించుకుంది. తను చేసిన టాక్‌ షోలు గానీ, ఇతర మానవత్వం చాటే కార్యక్రమాలతో యాంకర్‌గా తాను నిరూపించుకుంది. 

నువ్వు చాలా మంది హీరోలను కలిసి ఉంటావు? నీ ఉద్దేశంలో ఏ హీరో అద్భుతంగా యాంకరింగ్‌ చేశారు?

ప్రదీప్: జూనియర్ ఎన్టీఆర్‌ గారు. నేను ఆయన్ను దగ్గర నుంచి గమనించడం జరిగింది. సినిమాలో డైరెక్టర్‌ రాసిన క్యారెక్టర్‌లో ఉంటారు. కానీ, నిజంగా ఎంత జోవియల్‌గా ఉంటారో మీకూ తెలుసు. అందరికీ తెలుసు. ఒక షో ద్వారా మనందరం చూశాం. ఆయన సెన్స్‌ ఆఫ్‌ హ్యూమర్‌ చాలా బాగుంటుంది. ఆయన మళ్లీ యాంకరింగ్‌ చేస్తే చూడాలని ఉంది. నాగార్జున స్టైల్ చాలా ఇష్టం. ఆయన రెండు షోలు చేశారు. చేయని వారు ఎవరైనా కొత్తగా ట్రై చేయాలంటే మహేశ్ ‌బాబు లేదా ప్రభాస్‌ చేస్తే చూడాలని ఉంది. వారిద్దరి సెన్స్‌ ఆఫ్‌ హ్యూమర్‌ అదిరిపోద్ది.

ప్రదీప్‌ నువ్వు యాంకరింగ్‌ కాకుండా ఇంకా ఏం చేస్తుంటావు‌?

ప్రదీప్‌: యాంకరింగ్‌, టీవీ వల్లే నాకు సినిమా అవకాశం వచ్చింది. ప్రేక్షకులకు దగ్గరవ్వడం వల్ల దర్శకుడికి, నిర్మాతకు ఆ ఆలోచన వచ్చింది. ప్రేక్షకులు ఆ సినిమా చూస్తే నాకు మరిన్ని అవకాశాలు వస్తాయి. కానీ, నేను హీరో అనుకోను. ఫ్రంట్‌లైన్‌ వారియర్సే హీరోలు. మేమంతా కేవలం ఎంటర్‌టైనర్స్‌. హీరో అన్న పదం వారికే బాగుంది.

సుమ.. పాట కూడా పాడినట్లు ఉన్నావు కదా?

సుమ: హా... అది అలా జరిగిపోయింది. ఓ వర్షం కురిసిన రాత్రి (నవ్వులు)

ఆ పాట పాడిన తర్వాతే కదా లాక్‌డౌన్‌ అయింది?

సుమ: లేదు, లక్కీగా అలాంటి అపవాదు నాకు రాలేదు. (ప్రదీప్‌ కలగజేసుకొని పాడతారని అపోహ రావడం వల్ల లాక్‌డౌన్‌ అయింది అని అన్నారు.) నిజానికి ప్రదీప్ సినిమాలో పాట పాడమని మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనూప్‌ నన్ను అడిగారు. కట్‌ చేస్తే లాక్‌డౌన్‌ అయింది. (ప్రదీప్‌ మధ్యలో అందుకొని ‘సెన్సార్‌ పూర్తయిన సినిమా కూడా ఆగిపోయింది. అంటే ఆలోచించండి’ అన్నారు..  నవ్వులు)

పాట పాడాలి అనే కోరిక ఎందుకు వచ్చింది?

సుమ: అబ్బే నాకు రాలేదు. మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌ గారికి అనిపించింది. ఒక రోజు ఫోన్‌ చేసి పాట పాడతారా? అని అడిగారు. ఒకే జోక్‌ చేస్తున్నారు కదా అన్నాను.

మీ అబ్బాయి రోషన్‌ టీవీలో ఒక వ్యక్తి రాగానే కత్తి తీసుకొని పొడిచేద్దామని వెళ్లాడు. ఎవరా వ్యక్తి?

సుమ: మేం ఈటీవీలో ఓ టెలీఫిల్మ్‌ చేశాం. అప్పట్లో సీరియళ్లు, సినిమాల్లో నటిస్తున్నాను. ఆ సమయంలో వీడికి చాలా ఓవర్‌ పొసిసివ్‌ ఉండేది. ఓ సారి నేను బ్యూటీ పార్లర్‌కి వెళ్తే ఇంటి నుంచి పరుగెత్తుకొచ్చి.. నాకు ఎవరైతే హెయిర్‌ మసాజ్‌ చేస్తున్నారో వారి చేయి పట్టుకొని లాగి.. ‘‘ఏయ్‌ ఆయిల్‌ రాస్తే మా అమ్మకు నేను రాయాలి. నువ్వెవరు రాయడానికి?’’ అని నన్ను ఇంటికి లాక్కెళ్లాడు. అలా వాడి పొసిసివ్‌నెస్‌ నడుస్తున్న టైంలో నేను, ప్రభాకర్‌ ఓ టెలీఫిల్మ్‌లో నటిస్తున్నాం. ఆయన మా వీధి చివర్లో ఉండేవారు. ఆ టెలీఫిల్మ్‌లో మమ్మల్ని చూసి ‘‘అమ్మా ఇప్పుడే వస్తా.. వేసేసి వస్తా’’ అన్నాడు. అలా వాడు చాలా సందర్భాల్లో చాలా సార్లు చేశాడు. నాకు మాత్రమే అమ్మ అనే భావనతో ఉండేవాడు. ఇప్పుడు పెద్దయ్యాడు.

నీ కళ్ల ముందు ప్రదీప్‌, సుడిగాలి సుధీర్‌ పెళ్లి చేసుకోకుండా తిరుగుతున్నారు కదా? నువ్వు ఏదో ఒకటి చేయొచ్చు కదా? అక్కగానో.. అత్తగానో..

సుమ: ఎందుకు సర్‌.. వేరేవాళ్ల జీవితాలు పాడు చేయడం. వీళ్లను అలా ఉండనివ్వండి.

ప్రదీప్‌: థాంక్స్‌ అమ్మ... ఇన్నాళ్లకు మమ్మల్ని అర్థం చేసుకున్నారు. మా ఆనందాన్ని కోరుకుంటున్నారు. కొన్నాళ్లు ఇలా ఆనందంగా ఉండనివ్వండి.

సుమ: ఆనందాన్ని ఎవరు కోరుకోరు? నేను అవతల వారి ఆనందాన్ని కూడా కోరుకుంటున్నాను.

మీ ఇంట్లో చెప్పరా? ఏంట్రా ఇలా ఎంత కాలం అని? (పెళ్లిని ఉద్దేశించి)

ప్రదీప్‌: చెప్తారు సర్‌. చెప్పి చెప్పి టేప్‌ అరిగిపోయింది. కొత్త టేప్‌ వచ్చే వరకని అడగడం ఆపేశారు. ఈ రోజు అని, ఇలా అని నేనెప్పుడు ప్లాన్‌ చేసుకోలేదు. చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకొని వెళ్తున్నాను. సరైన టైం వచ్చినప్పుడు తప్పకుండా.. చేసుకుంటా. నేనేది ఆపట్లేదు. కానీ, టైం తీసుకుంటున్నాను అంతే.  

లాక్‌డౌన్‌కు ముందు లైఫ్‌ ఎలా ఉందో. లాక్‌డౌన్‌ తర్వాత అలాగే ఉందా?

ప్రదీప్‌: లేదు సర్‌, చాలా మారింది. లాక్‌డౌన్‌కు ముందు చాలా విషయాలు తెలియదు. లాక్‌డౌన్‌లో జీవితంలో ఎన్నో మార్పులు తెచ్చే సంఘటనలు జరిగాయి. ఇంకో మనిషి గురించి ఆలోచించడం మొదలుపెట్టాం. పక్కన ఏం జరుగుతుందో తెలుస్తోంది. ఇంట్లో ఏం జరుగుతోంది? అమ్మ ఏం చేస్తోంది? అమ్మనాన్నల బాధ్యతలు, వారితో అన్ని విషయాలు పంచుకోవడం, కలిసి భోజనం చేయడం ఎలా ఉంటుందో తెలిశాయి. బయట ఫ్రెండ్స్‌ ఎలా ఉన్నారు? వేర్వేరు పరిశ్రమల్లో ఉన్నవారు ఎలా ఉన్నారో వారితో మాట్లాడటం. షూటింగ్‌ లేకపోతే మనవాళ్ల కష్టం తెలుస్తోంది. మనిషిగా ఒక మెట్టు ఎక్కి.. బుర్రను కాస్త పెంచి ఆలోచించడం మొదలుపెట్టాను ఈ లాక్‌డౌన్‌లో.

సుమకు ఉన్న క్వాలిటీస్‌లో ఏదైన క్వాలిటీ డిలిట్‌ చేయమంటే ఏ క్వాలిటీ డిలిట్‌ చేస్తావ్‌?

ప్రదీప్‌: ఆవిడలో మొహమాటం మిగిలి ఉంది. మొహమాటాన్ని డిలిట్‌ చేస్తే సరిపోతుంది. ఆమె స్వీట్‌ పర్సన్‌. ఎంత ఎదిగినా.. ఎంత ఉన్నా.. ఆమె స్థానం ఆమెకు తెలుసు. యాంకరింగ్‌ అనేది ఓ వృత్తి అని ఇది వరకు ఎప్పుడు లేదు. నేను యాంకర్‌ అవుతాను అంటే.. టీవీలో యాంకర్‌ అవడం ఏంటయ్యా అనే వ్యక్తుల దగ్గర నుంచి ఏంటి! మీరు టీవీలో యాంకరా అనే స్థాయికి రావడానికి కారణం సుమ గారు. 

ప్రదీప్‌.. నువ్వు జీవితంలో చేసిన మొదటి దొంగతనం ఏది?

ప్రదీప్‌: లేదు. దొంగతనాలంత సీన్‌ లేదు. 

ఫస్ట్‌ లవ్‌ లెటర్?

ప్రదీప్‌: లెటర్స్‌ రాయలేదు. చిన్నప్పుడు లాస్ట్‌లో వెళ్లెటప్పుడు స్క్రాప్‌ బుక్స్‌లో అమ్మాయిలు ఏం రాస్తారో అని వేచి చూసేవాళ్లం. ఒక అమ్మాయి థాంక్యూ బ్రదర్‌ అని రాసింది. ఇక అంతే.. దెబ్బకు బుక్‌ మూసి అటకమీద పడేశా.

ఫస్ట్‌ కిస్‌?

ప్రదీప్‌: అలాంటిదేం లేదు

మొన్నటి సినిమా(30 రోజుల్లో ప్రేమించడం ఎలా?)లో హీరోయిన్‌ ఆ?

ప్రదీప్‌: హా.. అయినా సినిమాల్లో ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా..!

ఆలీ: ఇప్పుడు అసలు లేదు కదా! ఇప్పుడు నో లవ్‌ సీన్స్‌..

ప్రదీప్‌: ఇప్పుడు ఫ్లైయింగ్‌ కిస్‌ కూడా అనుమానమే. గాల్లోనూ ఉంటుంది కదా!(కరోనా గురించి)

సుమ: ఇప్పుడు తీయమనండి సర్‌. అర్జున్‌రెడ్డిలోని సీన్స్‌.. (నవ్వులు)

సుమ.. నువ్వు లెటర్‌ ఇవ్వడం గానీ.. నీకు ఎవరైనా లెటర్‌ ఇవ్వడం గానీ జరిగిందా?

సుమ: హా.. ఒకడు ఇచ్చాడు. సైన్స్‌ స్టూడెంట్‌ అతను. అందుకే లెటర్‌లో నీ ప్రేమ నన్ను గురుత్వాకర్షణ శక్తిలాగా లాగుతోంది. మొత్తం అంతా సైంటిఫిక్‌ పదాలతో రాశాడు. తర్వాత అతన్ని నేను అన్నయ్య అని పిలిచేశా. మా అమ్మాయిల దగ్గర ఉండే పెద్ద అస్త్రం అదే కదా.. ఎవరైనా వెంటపడుతున్నప్పుడు మాకు నచ్చలేదంటే అన్నయ్య అని పిలుస్తాం.. లేదంటే కన్నయ్య అని పిలుస్తాం. 

మీరెవరినైనా ఇష్టపడటం జరిగిందా?

సుమ: ఇష్టపడటం.. పెళ్లి చేసుకోవడం.. ఇద్దరిని కనడం జరిగింది కదా.. (రాజీవ్‌ కనకాలను ఉద్దేశించి)

అది టీవీ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత.. రాజీవ్‌కు ముందు?

సుమ: నేను పుడుతూ పుడుతూ.. పెరుగుతూ పెరుగుతూ టీవీ ఇండస్ట్రీలోకి వచ్చేశా. అందుకే నా యవ్వనం.. నా వృద్ధాప్యం ఇక్కడే. నేను ఇంటర్మీడయట్‌లో ఉన్నప్పుడు ఈ ఫీల్డ్‌లోకి వచ్చాను. అప్పటి నుంచి ఇక్కడే ఉండి చదువు పూర్తి చేశాను. మధ్య ఇలాంటి లవ్‌ లెటర్లు వంటివి జరిగాయి కానీ.. ఎక్కువ సమయం టీవీలోనే గడిచింది. 

ప్రతి మనిషిలో ఈర్ష్య ఉంటుంది? నీకు ఏ యాంకర్‌ని చూస్తే ఈర్ష్య కలుగుతుంది?

సుమ: ఈర్ష్య లేనటువంటి మనిషి అంటే అది వేరే స్థాయిలో ఉండాలి. అది చాలా కష్టం. ప్రతి మనిషిలో అప్పుడప్పుడు ఈర్ష్య కలుగుతుంది. నాకు అనుసూయను చూసినప్పుడు అనిపించింది. ఈర్ష్య అని చెప్పను గానీ.. తనంత ఎత్తు లేనే, తన చర్మం అంత మృదువుగా నాది లేదే అని అనిపించింది. అయినా అది అమ్మాయిలకు స్వతహాగా వచ్చే చిన్నపాటి కుళ్లు. కుళ్లు రాదని చెప్పే అమ్మాయిలంతా అబద్దాలు చెబుతున్నట్టే.

ప్రదీప్‌ను మొదటిసారి చూసినప్పుడు అతడిలో ప్రతిభ ఉంది.. ఎదుగుతాడు అని అనిపించిందా?

సుమ: అవును, అనిపించింది. ఎక్కువగా మహిళ యాంకర్లే చేసే షోల్లో అతను యాంకరింగ్‌ చేస్తూ వారిని ఎంటర్‌టైన్‌ చేస్తున్నాడు. తను వేసే జోక్స్‌, పంచులతో వాళ్లంత నవ్వుతున్నారు. కచ్చితంగా అతనికి మంచి భవిష్యత్తు‌ ఉందనిపించింది. ఆ తర్వాత ఇద్దరం కలిసి చేశాం. నాకు ధీటుగా పంచులు వేయడం, జోకులు వేయడం చూసి తను సూపర్‌ అనిపించింది. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. 

రాజకీయాల్లోకి కూడా అడుగుపెడుతున్నట్లు విన్నాను. ఎంత వరకు నిజం?

సుమ: ఎప్పటికీ జరగదు. 

మా గురించి సరే.. ఆలీ మీరు ఎప్పుడైన దొంగతనం చేశారా?

ఆలీ: చిన్నప్పుడు అమ్మ పోపుల డబ్బా నుంచి పది పైసలు అలా దొంగతనం చేసి సినిమాలు చూసేవాణ్ని. ఇంటర్వెల్‌లో ఏదైన తినడం కోసం నాన్న జేబులో డబ్బులు కాజేసేవాణ్ని. ఒకసారి అలా చేయబోతే నాన్నకి దొరికేశా. బాగా కొట్టారు. అడిగితే ఇస్తాం.. కానీ ఇలా చేయొద్దని చెప్పారు. సరే అని దొంగతనం చేయడం మానేసి నాన్నని డబ్బులు అడిగితే రెండు రూపాయాలు ఇచ్చారు. 

మరి ఆ అలవాటు మీ తర్వాతి తరానికి వచ్చిందా?

ఆలీ: లాక్‌డౌన్‌లో పనివాళ్లని రావొద్దన్నారు కదా.. మా పెద్దమ్మాయి వచ్చి నేను పనిచేస్తా.. నాకు రోజుకు రూ. 300 ఇవ్వు అంది. నేను సరే అన్నా. తనకు డబ్బులు ఇస్తుంటే.. మా చిన్నమ్మాయి, అబ్బాయి అక్కకి ఎందుకు డబ్బులిస్తున్నారని అడిగారు. పనిచేస్తుందని అనగానే.. మేం కూడా చేస్తామన్నారు. వాళ్లకి చెరో రూ. 100 చొప్పున ఇచ్చాను. ఈ లాక్‌డౌన్‌లో మా చిన్నమ్మాయి. రూ. 1,900 సంపాదించుకుంది. ఈ సందర్భంగా మహిళలను నేను అభినందిస్తున్నాను. ఈ లాక్‌డౌన్‌లో మీరు చేసిన కష్టానికి ఫలితం కచ్చితంగా దొరుకుతుంది. 

ప్రదీప్‌కు ముద్దు పేరు పెట్టమంటే ఏం పెడతావు‌?

సుమ: ముదురు

సుమకు ఓ మంచి పేరు పెట్టాలంటే ఏం పెడతావు?

ప్రదీప్‌: శ్రీ శ్రీ శ్రీ మహా ముదురు. గౌరవనీయులు.. పూజ్యులు.. శ్రీ ముదుర్లు

నీ దృష్టిలో పది చేయమంటే పది వేలు చేసే(యాంకరింగ్‌) వ్యక్తి ఎవరినిపిస్తుంది?

సుమ: యాంకర్‌ రవి

ప్రదీప్‌: సుధీర్‌

ఆలీ: లాక్‌డౌన్‌ అయిపోయింది. అయినా కూడా మనం రూల్స్‌ పాటించాలి. జాగ్రత్తలు తీసుకోవాలి. 

సుమ: షూటింగ్స్‌కి వెళ్లొచ్చాక ఫేస్‌కి స్టీమ్‌ చేసుకోవడం.. వేడు నీళ్లు తాగడం మార్చి నుంచి చేస్తున్నాను. దుమ్ముధూళీ ఫేస్‌పై ఉంటే స్టీమ్‌ వల్ల తొలగిపోయి.. రిలీఫ్ ఉంటుంది. అలాగే వేడినీరు తాగడం వల్ల గొంతులో ఉండే సూక్ష్మక్రిములు చచ్చిపోతాయి. 

ప్రదీప్‌: లాక్‌డౌన్‌ అని కాదు.. కాలుష్యం వల్ల కూడా. ఏ వృత్తి వారైనా ఇంటికి రాగానే కాస్త వేడినీరు తాగడం మంచిది. 

ఆలీ: నేను ఇప్పటికీ వేడి నీళ్లలో పసుపు, అల్లం, జీర వేసి మరిగించి పిల్లలతో తాగించి.. నేను తాగుతున్నాను. మీరు కూడా అదే చేయండి. 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.