
తాజా వార్తలు
సోనియాజీ పాత ప్రసంగాలు గుర్తుతెచ్చుకోండి!
దిల్లీ: ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్రం ప్రభుత్వం ఎప్పుడూ రైతుల ప్రయోజనాల కోసమే పనిచేస్తోందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి అనురాగ్ఠాకూర్ అన్నారు. వ్యవసాయ రంగంలో సంస్కరణలపై కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ గతంలో తాము ఇచ్చిన ప్రసంగాలను మరోసారి గుర్తు తెచ్చుకోవాలని ఆయన విమర్శలు చేశారు. ఇప్పుడు కావాలని చట్టాలకు వ్యతిరేకంగా రైతుల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు ఠాకూర్ మంగళవారం ఓ సమావేశంలో వెల్లడించారు. ‘వ్యవసాయరంగంలో సంస్కరణల విషయమై గతంలో తాము చేసిన ప్రసంగాల్ని మరోసారి గుర్తుకుతెచ్చుకోవాలని సోనియగాంధీని కోరుతున్నాం. గతంలో వారే ఈ వ్యవసాయ చట్టాలు తీసుకురావాలని అన్నారు. కానీ అమలు చేయలేకపోయారు. మోదీ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ఎంతో కృషి చేస్తోంది. పీఎం కిసాన్ యోజన, నీటిపారుదలకు సంబంధించి ఎన్నో సానుకూల నిర్ణయాలు తీసుకుంది’ అన్నారు.
రైతుల సంక్షేమం కోసం కేంద్రం విడుదల చేసిన పథకాల గురించి మాట్లాడుతూ.. కొవిడ్ మహామ్మారి విజృంభించిన సమయంలో 2కోట్ల కిసాన్ క్రెడిట్ కార్డులు విడుదల చేశామని ఠాకూర్ తెలిపారు. ‘డైరీ, మత్స్యకారులకు ఆర్థిక సహకారం అందించాం. పీఎం కిసాన్ యోజన కింద రైతులకు వేల కోట్లు లబ్ది చేకూర్చాం’ అని ఠాకూర్ వెల్లడించారు. ప్రజాస్వామ్యంలో చర్చల ద్వారానే ఏ సమస్యకైనా పరిష్కారం లభిస్తుంది. కాబట్టి చర్చల ద్వారానే చట్టాలపై ఆందోళన చేస్తున్న రైతుల డిమాండ్లకు పరిష్కారం లభిస్తుంది. చాలా మంది రైతులు కేంద్ర చట్టాలతో సంతృప్తిగానే ఉన్నారు. కొంత మంది రైతుల్లో తప్పుడు ప్రచారాన్ని వ్యాప్తి చేస్తున్నారు. చట్టాలతో సంతృప్తి చెందని వారి సందేహాలను నివృత్తి చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది’ అని వెల్లడించారు.
ఇదీ చదవండి
తెలుగు రాష్ట్రాలకు చేరుకున్న కొవిడ్ టీకా