
తాజా వార్తలు
సబలా సాహో
వారు గెలిచారు...
అంతులేని శ్రమతో...
తరగని చిత్తశుద్ధితో...
వారు నిలిచారు
తమ రంగంలో మేటిగా...
అందరికీ స్ఫూర్తిగా...
కలం పట్టినా, హలం పట్టినా, సేవ చేసినా ఉద్యోగం చేసినా, వాణిజ్యంలో రాణించినా, పరిశ్రమలు స్థాపించినా, వారికి వారేసాటి... ఇది ‘ఈనాడు- వసుంధర’ విజేతల ప్రస్థానం.
మిరుమిట్లు గొలిపే విద్యుత్ కాంతులు... ఆహ్లాదకరమైన సంగీత విభావరి... శాంత స్వరూపులైన అమ్మలు.. దుష్టశిక్షణలో శక్తి స్వరూపిణులుగా మారి.. దుర్మార్గులు, అసురులను అంతమొందించిన పురాణ ప్రదర్శనలు...సాధారణ వ్యక్తుల్లా జీవన ప్రయాణాన్ని ప్రారంభించి అసాధారణ విజయాలను సాధించి స్ఫూర్తిగా నిలుస్తున్న లబ్ధప్రతిష్టులు... ఉల్లాసం, ఉత్సాహం.. కేరింతల నడుమ ప్రపంచ మహిళా దినోత్సవం రామోజీ ఫిలింసిటీలో శనివారం అంగరంగ వైభంగా జరిగింది. ముఖ్య అతిథిగా జాతీయ పారిశ్రామిక భద్రత అకాడమీ సంచాలకులు, ఐపీఎస్ అధికారి అంజనా సిన్హా, అతిథిగా సైబరాబాద్ ‘షీ’బృందం డీసీపీ సి.అనసూయ హాజరయ్యారు. మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్, వసుంధర పురస్కారాల జ్యూరీ సభ్యులు తెలుగు రాష్ట్రాల్లో వివిధ రంగాల్లో సేవలందిస్తున్న, ప్రతిభను ప్రదర్శిస్తున్న మహిళలు.. యువతులు... చిన్నారులకు వసుంధర పురస్కారాలు అందించారు.సుమారు మూడు గంటల పాటు కొనసాగిన ఈ వేడుకల్లో సినీ, టీవీ రంగాలకు చెందిన నటీనటులు, కళాకారులు, రామోజీ గ్రూప్ సంస్థల్లో విధులు నిర్వహిస్తున్న మహిళలు పాల్గొన్నారు.
భిన్న నేపథ్యాలు, విభిన్నమైన కుటుంబ పరిస్థితులకు ఎదురొడ్డి ప్రతిభను ప్రదర్శించిన మహిళలే ప్రపంచానికి స్ఫూర్తి. ఆత్మవిశ్వాసంతో ఉన్నతంగా ఎదిగే ప్రతి యువతి, మహిళా సమాజానికి ఆదర్శమే. ఇటీవలి కాలంలో ప్రతిభ ప్రదర్శిస్తున్న యువతులు, మహిళలు వారి పరిసరాలు, పరిస్థితులను అవగాహన చేసుకుని ఎదుగుతున్నవారే. ఒక్కసారి పని ప్రారంభించాక విశ్రమించకుండా వారి గమ్యస్థానాలను చేరుకుంటున్నారు. మరింత మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
- అంజనా సిన్హా ఐపీఎస్, జాతీయ పారిశ్రామిక భద్రత అకాడమీ(నిసా) డైరెక్టర్
వినూత్నంగా ఆలోచిస్తున్నారు
ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా రామోజీ ఫిలింసిటీలో శనివారం వసుంధర పురస్కారాల వేడుకను జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభిస్తున్న మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్, చిత్రంలో ముఖ్య అతిథిగా హాజరైన జాతీయ పారిశ్రామిక భద్రత అకాడమీ సంచాలకులు అంజనా సిన్హా, సైబరాబాద్ ‘షీ’బృందం డీసీపీ సి.అనసూయ
మహిళలు, యవతులు, చిన్నారులు తాము ఎంచుకున్న రంగాల్లో విభిన్నంగా ఎదిగేందుకు వినూత్నంగా ఆలోచిస్తున్నారు. సాటి మహిళలు, యువతుల్లో స్ఫూర్తి నింపుతున్నారు. కలలో కూడా ఊహించని ఆవిష్కరణలు చేస్తున్నారు. వ్యక్తిగత పరిశుభ్రత విధానాలను కొత్తగా ఆవిష్కరించి బిల్‌గేట్స్ దృష్టిని ఆకర్షించిన వారు ఒకరైతే.. కేవలం రెండు నెలల సాధనలోనే కిలిమంజారో పర్వతాన్ని మరొకరు అధిరోహించారు. కళారంగంలో చాలా మంది ఉన్నా విభిన్నంగా ఆలోచించి ఉన్నతంగా ఎదిగేందుకు నిరంతరం శ్రమిస్తున్నవారు మరి కొందరు, రోగులకు సేవలందించడం వైద్యుల సాధారణ విధులైనా.. క్యాన్సర్‌తో బాధపడుతున్న వారి ఇళ్లకు వెళ్లి వారి బాధలను తొలగిస్తున్న వైద్యులు నిజంగా ఆదర్శనీయులు. మా నాన్నమ్మ అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు మేమంతా ఆమె వద్దే ఉన్నాం.‘‘మీరందరూ నా కళ్లెదురుగా ఉన్నా నా నొప్పిని మీరు తీసుకోలేరుగా’’ అన్నారామె. ఆ మాటలు ఇప్పటికీ గుర్తొస్తున్నాయి.
- శైలజా కిరణ్, ఎండీ, మార్గదర్శి చిట్‌ఫండ్స్
పడిన ప్రతిసారీ పట్టుదలతో...
ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా పడిన ప్రతిసారీ పట్టువదలక తెగువచూపిన మగువలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు .కుటుంబ బాధ్యతలను మనం నిర్వహిస్తున్నా ప్రతి మార్పూ మననుంచేనని ప్రకృతి నమ్మింది. ఎందుకంటే మార్పు మనతోనే సాధ్యం. మనం సాధించిన ఘనతలను గుర్తు చేసుకునేందుకు, మరింత గుర్తింపు పొందేందుకు ఈ మహిళా దినోత్సవం మనకు గొప్ప అవకాశం. అన్ని భాధ్యతలను నిర్వహిస్తునే మరింత ప్రతిభను ప్రదర్శించేందుకు ఈ వేడుక స్ఫూర్తినింపుతోంది. ప్రతి మహిళ విజయంలో ఆమెకు అండగా నిలబడిన కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు. విజేతలకు అభినందనలు మీరు చూపిన దారిలో నడవాలి, నడవగలం అనే ప్రతి అమ్మాయి తరఫున కృతజ్ఞతలు.
- సహరి, డైరెక్టర్, ప్రియా ఫుడ్స్
మహిళా సాధికారిత అన్నిరంగాల్లో
అన్నిరంగాల్లో మహిళలు అవకాశాలు అందిపుచ్చుకోవాలన్న లక్ష్యంతో వారిలో నిబిడీకృతమైన శక్తిని వెలికి తీసేందుకు, మహిళలు, యువతుల్లో ప్రతిభను ప్రోత్సహించేందుకు ఈనాడు పత్రికలో వసుంధర అనుబంధాన్ని రామోజీరావు ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ‘వసుంధర’ మహిళా వాణిగా కొనసాగుతోంది. వసుంధరను మహిళలకు మరింత చేరువ చేర్చేందుకు గతేడాది నుంచి ‘వసుంధర పురస్కారాల’ను ప్రారంభించాం. విభిన్న రంగాలకు చెందిన వారిని సత్కరిస్తున్నాం.
- బృహతి, ఈటీవీ భారత్ డైరెక్టర్
వ్యాపార రంగం
రాజస్థాన్ నుంచి వచ్చిన నన్ను హైదరాబాద్ సొంతబిడ్డలా ఆదరించింది. దీనికి నిదర్శనమే ఈ పురస్కారం. ఎవరో వచ్చి మనకు సహాయం చేస్తారని ఎదురుచూడకుండా, స్వీయశక్తిని పెంపొందించుకోవాలి. నేను రూపొందించిన బయోటాయిలెట్స్ అందులో భాగమే.
ప్రకృతిపై ప్రేమతో..
‘ప్రకృతి అంటే నాకిష్టం.. దానికి మేలు చేసే విధంగానే ఏదైనా వ్యాపారం చేయాలి’ అనే ఆలోచనతో బంకా బయోలూ సంస్థను ప్రారంభించారు నమిత. సూరత్‌లో వజ్రాల నగల డిజైనర్‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. భర్త సంజయ్ హైదరాబాద్‌కు మారడంతో.. 2008లో ఇక్కడికి వచ్చారు. ఆ తర్వాత సామాజిక ప్రయోజనం ఉన్న వ్యాపారాలను పరిశీలిస్తూ.. కార్యాలయాలకు పర్యావరణహిత సామగ్రిని సరఫరా చేయడం ప్రారంభించారు. ఇలాంటి సమయంలోనే రైల్వే ఉన్నతాధికారులను కలిసే అవకాశం వచ్చింది. సరైన టాయిలెట్లు అందుబాటులో లేకపోవడంతో మహిళలు పడే ఇబ్బందులను అర్థం చేసుకున్న ఆమె.. ఈ దిశగానే తన ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రజల జీవితంతో ప్రత్యక్ష సంబంధం ఉండాలని కోరుకున్న తను బయోటాయిలెట్ల తయారీ పరిశ్రమను నెలకొల్పారు. ఇళ్లతోపాటు, భారతీయ రైల్వేకు వీటిని సరఫరా చేస్తున్నారు. కార్పొరేట్ ఆఫీసులు, ప్రభుత్వ సంస్థలు ఇప్పుడు ఈ టాయిలెట్లను వాడేందుకు ముందుకు వస్తున్నాయి.
పర్యావరణ హితంగా...
ఈ అవార్డును అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. గర్వంగా భావిస్తున్నా. ఈ స్థాయికి చేరుకోవడానికి నా కుటుంబం, పిల్లలు చాలా త్యాగాలు చేశారు. మనకాళ్లపై మనం నిలబడటానికి కృషి చేయాలి.
ఓ పాత టైరు మట్టిలో కలవడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలుసా! కనీసం 40 నుంచి 50 సంవత్సరాలు.. ఆ వ్యవధిలో ఆ టైరు.. పర్యావరణానికి కలిగించే హాని అంతా ఇంతా కాదు. దాన్ని కొంతమేరకైనా తగ్గించడానికి విశాఖకు చెందిన నీతిపూడి స్వర్ణలత తన వంతు కృషి చేస్తున్నారు. న్యాయశాస్త్రం చదివిన స్వర్ణలత.. తనతో పాటు పదిమందికి ఉపాధి కల్పించాలని
వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. అయితే చేసే వ్యాపారం పర్యావరణహితంగా ఉండాలనుకున్నారు. అందుకు అనుగుణంగానే పాత టైర్లతో క్రంబ్ రబ్బర్‌ను తయారు చేసే పరిశ్రమను నెలకొల్పారు. ఈ రబ్బర్‌ను జాతీయ రహదారుల నిర్మాణానికి, విమానాశ్రయాల రన్‌వేల తయారీకి వాడతారు. అంతే కాదు.. రబ్బర్ ఫ్లోర్లు, క్రీడా మైదానాల్లో వాడే రబ్బర్ మ్యాట్లు కూడా తయారు చేయొచ్ఛు ఈమె తాను తయారు చేస్తున్న ఉత్పత్తులను టీవీఎస్ సుందరం, హింకాల్ లాంటి ప్రముఖ సంస్థలకు సరఫరా చేస్తున్నారు.
సామాజిక సేవ
మహిళలూ... స్పందించండి. మీకు ఇష్టం లేకపోతే మీ గొంతు విప్పి చెప్పండి. మీపై జరుగుతున్న హింసను మౌనంగా భరించవద్ధు మనకు సాయం చేసే వ్యవస్థలు చాలా ఉన్నాయి. మహిళలు పోరాడే శక్తిని పెంపొందించుకోవాలి. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. మిమ్మల్ని మీరు తెలుసుకోండి.
అమ్మలా.. అండగా..!
తల్లితండ్రులు లేని పసిపాపల నుంచి పిల్లలు వదిలేసిన తల్లుల వరకు ఎందరికో కస్తూర్బా మెమోరియల్ ట్రస్టు ఛైర్మన్ డాక్టర్ పద్మావతి కల్పతరువు. ఆమె అండతో చదువుకుని జీవితాలను నిలబెట్టుకున్నవాళ్లు, ఆమె ఆదరణతో తల్లితండ్రులని కలుసుకున్నవాళ్లు, కుట్లు, అల్లికలతో సంపాదిస్తూ గౌరవంగా బతుకుతున్న మహిళలు వందల్లో ఉన్నారు. గృహహింసకు బలయినవాళ్లు, మతిస్థిమితం లేనివాళ్లు కస్తూర్బా ట్రస్టులో ఆశ్రయం పొందుతూ చీకూచింతా లేకుండా జీవనం సాగిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో విద్యాబుద్దులు నేర్చుకుంటున్నారు. ఇది గాంధీ స్థాపించిన ట్రస్టు. అందుకే.. ఆ మహాత్ముడి ఆశయాలకు అనుగుణంగానే ఇప్పటికీ ట్రస్టును నడుపుతున్నామని పద్మావతి అంటున్నారు.
పొదుపుతో అద్భుతాలు...
దేశంలోని అన్ని ప్రాంతాల్లో మహిళలు స్వీయ అభివృద్ధి, శుభ్రత, సామాజికాభివృద్ధికి పాటుపడాలి. మహిళల హక్కులు, గౌరవం, భద్రత కోసం పోరాటం చేసిన, చేస్తోన్న అందరి తరఫున ఈ అవార్డు స్వీకరిస్తున్నా.
ఎక్కడ స్పెయిన్.. ఎక్కడ అనంతపురం. అయినా ఆ దూరం ఆమె సామాజిక సేవకు అడ్డురాలేదు. 1969తో భర్త విన్సెంట్ ఫెరర్‌తో కలిసి వెనుకబడిన రాయలసీమ జిల్లాల్లో ఒకటైన అనంతపురంలో అడుగుపెట్టిన అనా ఫెరర్.. అప్పటి నుంచి పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పనిచేస్తున్నారు. తన భర్త ఏర్పాటు చేసిన రూరల్ డెవలెప్మెంట్ ట్రస్ట్ ద్వారా రాయలసీమలో బాలికా సాధికారత కోసం ఆమె ఎంతగానో కృషి చేశారు. బాలికలకు ప్రత్యేక పాఠశాలలు నెలకొల్పారు. కర్నూలు, అనంతపురం జిల్లాల్లో కొన్ని గ్రామాలను దత్తత తీసుకుని మహిళా సంఘాల్లో పొదుపును ప్రోత్సహించారు. మహిళలకు ప్రత్యేక ఆసుపత్రులు నిర్మించి ఉచిత వైద్యసేవలు అందిస్తున్నారు.
పాలనా రంగం
ఈ పురస్కారం నాలో కొత్త స్ఫూర్తిని నింపింది. ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు ఈ అవార్డును అంకితం చేస్తున్నా. గిరిజనులు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో బాధ్యతలు నిర్వర్తించాను. అతివలకు ఆహార, ఆరోగ్య భద్రతలే లక్ష్యంగా కార్యక్రమాలు రూపొందిస్తున్నాం.
గిరిపుత్రుల ఆడపడుచు
గిరిజనుల సమస్యలకు పరిష్కారం చూపించడం వరకే ఆమె పరిమితం కాలేదు. గిరిపుత్రుల సంస్కృతిలో భాగమై, అక్కడి మహిళలకు ఆడపడుచుగా మారారు. అన్ని విధాలుగా గిరిజనుల ఉన్నతికి పాటుపడుతూ వారితో మమేకమవుతున్నారు. ఆమే తెలంగాణ రాష్ట్ర మహిళా శిశుసంక్షేమశాఖ కార్యదర్శి దివ్య దేవరాజన్. ఆమెది తమిళనాడు. చెన్నై బిట్స్ పిలానీలో ఇంజినీరింగ్, పీజీ పూర్తిచేశారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, రైల్వేస్‌లో పనిచేశారు.2009లో సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో ఆల్ ఇండియా 37వ ర్యాంకు సాధించి, ఐఏఎస్‌గా ఎంపికయ్యారు. జీహెచ్ఎంసీ అకౌంట్స్ ఆఫీసర్‌గా, భువనగిరి జిల్లా సబ్ కలెక్టర్‌గా పనిచేశారు. వికారాబాద్ కలెక్టర్‌గా పనిచేస్తున్నప్పుడు పెద్దేముల్ మండలంలోని చైతన్యనగర్ గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేశారు. ఆడపిల్లల చదువుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన తెగల మధ్య గొడవలను పరిష్కరించారు. వారి సమస్యలను తెలుసుకునేందుకు గోండు భాషను సైతం నేర్చుకున్నారు.
ఖైదీలను సంస్కరించారు..
నా సేవల గురించి ప్రపంచం మొత్తానికి తెలిసేలా చేసింది ఈనాడు పత్రిక. రాష్ట్రపతి అవార్డు నాకు ఎంత సంతృప్తి ఇచ్చిందో... వసుంధర పురస్కారమూ అంతే సంతృప్తిని ఇచ్చింది.
ఒక జైలు వార్డర్‌గా నాగమణి తన విధులకే పరిమితం కాలేదు. అంతకుమించే పనిచేశారు. ఖైదీల్లో పరివర్తన తీసుకొచ్చేలా జైళ్లల్లో సంస్కరణలు ప్రవేశపెట్టారు. కారాగారమంటే శిక్ష కాదు.. శిక్షణాలయమని నిరూపించారు. తాను పనిచేసిన ప్రతి చోట తనదైన ముద్ర వేసుకుంటూ వెళ్లారు. 1999లో జైళ్లశాఖలో వార్డరుగా ప్రవేశించిన నాగమణి.. 2013లో హెడ్‌వార్డర్‌గా పదోన్నతి పొందారు. తర్వాత కడప ప్రత్యేక మహిళా కేంద్ర కారాగారానికి చీఫ్ హెడ్‌వార్డర్‌గా బదిలీ అయ్యారు. ఎక్కడ పనిచేసినా.. ఖైదీల జీవితాల్లో మార్పునకు కృషి చేశారు. ఆమె చేసిన సేవలను కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించింది. రాష్ట్రపతి అవార్డుతో సత్కరించింది.
సంగీతం
చిన్నప్పటి నుంచి వేలు పట్టుకుని నడిపించి, ఈ స్థాయికి చేరుకోవడానికి తోడ్పాటు అందించిన మా అమ్మకు ఈ అవార్డు అంకితం. మహిళలు ఏదైనా సాధించగలరనే నమ్మకాన్ని బలపరిచేందుకు ఇలాంటి వేదికలు అవసరం.
ఆమె స్వరమే.. భాస్వరం
ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనమ్మా.. అనే పాట వినబడితే చాలు మధుప్రియ ఇట్టే గుర్తొస్తుందెవరికైనా. ఆడపిల్ల బాధల్ని, కష్టాలను చెప్పే ఆ పాటతో మధుప్రియ చిన్న వయసులోనే శ్రోతల గుండెలకు దగ్గరైంది. పిట్టకొంచెం కూత ఘనం.. అనిపించే మధుప్రియలోని గొప్పతనం తెలంగాణ పలుకుబడి. ‘దగ్గరగా దూరంగా’ చిత్రంలో ‘పెద్దపులి.. ’ పాటతో సినిమా పరిశ్రమకొచ్చింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా చిత్రంలో ఆమె పాడిన.. ‘వచ్చిండే.. మెల్లా మెల్లగా వచ్చిండే..’ పాటతో తెలుగు ప్రజలను ఫిదా చేసింది. ప్రతి ఇంట్లో పాడుకునే పాటగా నిల్చిందాపాట. ఆ పాటతో ఆమె కెరీర్ వేగంగా పుంజుకుంది. ఇటీవల సరిలేరు నీకెవ్వరూ చిత్రంలో ఆమె పాడిన ‘హిఈజ్ సో క్యూట్.. ‘ పాట ఎంత సూపర్ హిట్ అయిందో అందరికీ తెల్సిందే. చిన్నవయసులోనే టాలీవుడ్లో దూసుకుపోతున్న ఈ తెలంగాణ పిల్ల స్వరమే భాస్వరం.
సుస్వరాల పూదోట...
అమ్మాయిలు ఎప్పుడూ అవరోధాలకు భయపడొద్ధు ఆత్మస్థైర్యంతో, కుటుంబ సభ్యుల మద్దతుతో ఇష్టంగా ముందుకు పయనించండి
స్వచ్ఛమైన వెన్నెలంటి చిరునవ్వుతో కనిపిస్తూ తెలుగు సినీతోటలో సుస్వరాలు పూయించిన గానమాధుర్యం ఆమె సొంతం. తొమ్మిదో తరగతిలోనే ఈటీవీ ‘పాడుతాతీయగా’లో గాయనిగా మంచి పేరు తెచ్చుకున్నారు. సింగన్న సినిమాలోని అన్నవెంట నేనే ఉంటా.. పాటతో తెలుగుతెరకి గాయనిగా పరిచయమయ్యారు. ప్రాణం చిత్రంలోని నిండు నూరేళ్ల సావాసం.., జల్సా చిత్రంలోని గాల్లో తేలినట్లుందే.., ఢమరుకం సినిమాలోని లాలి పాట.. గోపికా పూర్ణిమకి మంచి పేరు తీసుకొచ్చాయి. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో 500 పైగా పాటలు, 300 పైగా ఆధ్యాత్మిక పాటల్ని ఆలపించారు. అభయ్, నాని, ప్రాణం.. లాంటి చిత్రాల్లో డబ్బింగ్ ఆర్టిస్టుగా రాణించారు.
వైద్యం
పేలియేటివ్ చికిత్స గురించి మాట్లాడటానికీ ఎవరూ ఇష్టపడరు. ఈ విషయాలు తెలియడానికి ఈ సందర్భం ఓ వేదిక కావడం మరింత సంతోషంగా ఉంది. రోగుల ఇంటికెళ్లి మా బృందం ఉచిత సేవలందిస్తుంది. వారి చివరి క్షణాలవరకు వైద్యపరంగా సేవలందిస్తామనే విషయాన్ని ఈ సందర్భంగా చెబుతున్నా.
వ్యధార్తులకు అండగా...
చికిత్సకు నయం కాని క్యాన్సర్లు ఉంటాయి. అలాంటి వ్యాధిబారిన పడిన రోగులు చివరి దశలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. భరించలేని బాధతో విలవిల్లాడతారు. చివరి రోజుల్లో వారికి ఉపశమనాన్నిచ్చేదే పేలియేటివ్ కేర్. కానీ మన దేశంలో ఈ చికిత్స అంతగా అందుబాటులో లేదు. అక్కడక్కడ ఉన్నా... పేదవారికి అందుబాటులో లేవు. అందుకే.. ఈ చికిత్సను నిరుపేద రోగులకు చేరువ చేయడానికి కృషి చేస్తున్నారు వైద్యురాలు గాయత్రి పాలట్. హైదరాబాద్‌లోని ప్రభుత్వ ఎమ్ఎన్జే క్యాన్సర్ ఆసుపత్రిలో పేలియేటివ్ సంరక్షణ కేంద్రం ఏర్పాటులో ఈమె కీలక పాత్ర పోషించారు. ఈ కేంద్రం ద్వారా చివరిదశలో ఉన్న క్యాన్సర్ రోగులకే కాదు.. వారి కుటుంబాలకూ మనోస్థైర్యాన్ని అందిస్తున్నారు. పేలియేటివ్ సేవలందిస్తున్న ‘పెయిన్ రిలీఫ్ అండ్ పేలియేటివ్ కేర్ సొసైటీ’లో కూడా గాయత్రి వ్యవస్థాపక సభ్యురాలు. నేషనల్ క్యాన్సర్ గ్రిడ్‌కు సలహాదారుగా కూడా వ్యవహరిస్తున్నారు. ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పేలియేటివ్ కేర్లోనూ జాతీయ అధ్యాపకులుగా సేవలందిస్తున్నారు. ఆసుపత్రికి రాలేని వారి ఇళ్లకు వెళ్లి చికిత్స అందించేలా సౌకర్యాలు, సిబ్బందిని ఏర్పాటు చేశారు.
డాక్టరమ్మ...
గత 38 సంవత్సరాలనుంచీ వైద్యురాలిగా ఉన్నా. ఈ స్థాయికి రావటానికి మనోబలమే కారణం. వసుంధర అవార్డు అందుకోవటం మర్చిపోలేని జ్ఞాపకం. కష్టపడి పనిచేస్తే మనల్ని గుర్తిస్తారనే విషయం అర్థమైంది.
కొందరు వైద్యులకు వైద్యం అంటే డబ్బు సంపాదనే. డాక్టర్ ఉషారాణి మాత్రం ఇందుకు భిన్నం. నెల్లూరులోని డాక్టరు రామచంద్రారెడ్డి ప్రజా వైద్యశాలలో 32 ఏళ్లుగా ఎందరో పేద రోగులకు లాభాపేక్ష లేకుండా ప్రసూతి వైద్య సేవలు అందించారు. శస్త్రచికిత్స అవసరం లేకుండా ఎన్నో వేల ప్రసవాలు చేశారు. స్కానింగ్ కేంద్రాల్లో లింగ నిర్ధారణ పరీక్షలు, తద్వారా జరిగే భ్రూణ హత్యలకు వ్యతిరేకంగా పోరాడారు. రాష్ట్రస్థాయిలో సెమినార్లు నిర్వహించి చైతన్యం తెచ్చారు. ఇప్పటికీ నెల్లూరు జిల్లాలో కడుపుకోత (టోటల్ అబ్డామినల్ హిస్టరెక్టమీ) శస్త్రచికిత్సలు జరగకుండా సాధారణ ప్రసవాలు చేయాలని పోరాడుతున్నారు.
టీవీ రంగం
అచ్చమైన తెలుగు పదాలతో ఉండే ఈనాడు పత్రిక చూస్తూ, చదువుతూ పెరిగా. ఈ పత్రికే నన్ను ఈ రోజు ఈ స్థాయిలో నిలబెట్టింది.. ఈ రంగంలో రాణించేలా చేసింది. అలాంటి గొప్ప సంస్థ నుంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు అవార్డు అందుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది.
తెలంగాణ గొంతుక..!
సాఫిత్రక్క ఈ మాటెక్కడో విన్నట్లుంది కదూ. ‘తీన్మార్’ కార్యక్రమంలో బిత్తిరిసత్తిని బిత్తిరోడా అని పిలిచే సావిత్రి అందరికీ గుర్తే ఉంటుంది. గలగలా తెలంగాణ యాసలో గసపోకుండా మాట్లాడే వసపిట్ట శివజ్యోతి. నిజామాబాద్‌లో పుట్టిపెరిగిన శివజ్యోతి బీఎస్సీ నర్సింగ్ చదివింది. చిన్న ఉద్యోగం చేస్తూ.. ఆ తర్వాత ఓ చిన్న ఎంటర్టైన్మెంట్ ఛానెల్లో చేరింది. తెలంగాణ యాస, స్పార్క్ ఆమెను 2014లో వి6 ఛానెల్దాకా తీసుకెళ్లింది. అక్కడ బిత్తిరి సత్తి కాంబినేషన్లో తీన్మార్ వార్తలు చదివే సావిత్రిగా తెలంగాణ మాండలికంతో తనవైపు ప్రేక్షకులను తిప్పుకుంది. అతి తక్కువ సమయంలో ఉత్తమ న్యూస్‌రీడర్‌గా ప్రభుత్వ పురస్కారాన్ని అందుకుంది. గతేడాది బిగ్‌బాస్ షోలో పాల్గొని తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది.
అందాల పల్లవి!
మహిళలు ఎప్పుడు ఆత్మగౌరవంతో ఉండాలి. ఎవరి కాళ్లపై వారు నిలబడేందుకు ప్రయత్నించాలి.
పుష్కరకాలంగా బుల్లితెర అందాల నటిగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు... శ్రీమతి పల్లవీ దిలీప్ కుమార్.. ఇలా అంటే ఎవరికీ తెలియదేమో.. అలేఖ్యగా...కృష్ణవేణిగా, అమృతగా, అర్చనగా... ఇలా తను నటించిన పాత్రలకు జీవం పోసి అందరితో శెభాష్ అనిపించుకుంటోంది ఈ అందాల బుల్లితెర నటి పల్లవి. ఆడదే ఆధారం, భార్యామణి, అత్తారింటికి దారేది, మాటే మంత్రం... సీరియళ్ల ద్వారా చక్కటి గుర్తింపు తెచ్చుకుని మరెన్నో ధారావాహికల్లో నటిస్తున్నారు. విజయవాడకు చెందిన ఈ ముద్దుగుమ్మ తన సహజ నటనతో ఆకట్టుకోవడమే కాకుండా నటించిన మొదటి సీరియల్‌తోనే నంది అవార్డు అందుకున్నారు. శ్రీరామశెట్టి నాగేశ్వరరావు, శ్రీమతి లలిత దంపతుల ఏకైక కూతురు ఈమె. తన సహజ నటనతో కోట్లాది ప్రేక్షకుల మనసు దోచుకుంది ఈ యువ నటీమణి.
వ్యవసాయ రంగం
ట్రాక్టర్ నడుపుతూ వ్యవసాయం చేస్తోంటే ‘నువ్వు ఏం చేస్తావు’ అని అన్నారు. ఆడపిల్లకి వ్యవసాయం చేయడం ఇబ్బందే. కానీ నేను అవేమీ పట్టించుకోలేదు. సాఫ్ట్వేర్ రంగంలాగే వ్యవసాయాన్ని యువత చూడాలన్నదే నా కల.
సేంద్రీయ ‘కళ’
కష్టాలు ఎదురైనపుడే ఎదురొడ్డి నిలవాలి. నల్గొండజిల్లా గరిడేపల్లి గ్రామానికి చెందిన కర్రా శశికళ కూడా అదే చేశారు. భర్త హఠాన్మరణంతో కుంగిపోలేదు. తాను ఒంటరినని కూడా భావించలేదు. ధైర్యం కూడదీసుకున్నారు. కొంత డబ్బు వడ్డీకి తెచ్చి ఐదు గేదెలు కొనుగోలు చేశారు. పాల వ్యాపారం చేశారు. ఒక వైపు డెయిరీ నిర్వహిస్తునే మరోవైపు సేంద్రియ వ్యవసాయం మొదలుపెట్టారు. వరి, బత్తాయి, వేరుసెనగ పంటల సాగుతో పాటు వర్మికంపోస్టు తయారీ చేపట్టారు. బయోగ్యాస్‌తో నడిచే జనరేటర్‌తో తన సేద్యానికి అవసరమైన విద్యుత్‌ను తానే సొంతంగా తయారు చేసుకున్నారు. పంటలనాశించే తెగుళ్లను నివారించేందుకు అవసరమైన కషాయాల తయారీని తన క్షేత్రంలోనే చేపట్టారు. తోటి రైతులకు కూడా ఈ మెలకువలను నేర్పారు. కొత్త పంటలను తెలుసుకుంటూ మారుతున్న సాగు పద్ధతుల పట్ల అవగాహన పెంచుకుంటూ.. తన ఉత్పత్తులను తానే సొంతంగా మార్కెటింగ్ చేసుకునేందుకు ఒక సంస్థను కూడా స్థాపించారు.
పంటలకు జీవామృతం...
రైతు కుటుంబం నుంచి వచ్ఛా నాన్న చూపిన దారిలోనే ప్రకృతి వ్యవసాయం చేస్తున్నా. మొదట్లో చాలా కష్టాలు పడ్ఢా దాదాపు ఎనిమిదేళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నా.
పంట సాగుకు రసాయనాలకన్నా సేంద్రియ ఎరువులే మిన్న అని ఆమె తలచారు. కీటక నాశనానికి పశువుల ఎరువే విరుగుడు అని నమ్మి చేతల్లో చేసి చూపించారు. ఆమే కడప జిల్లా రాజంపేటకు చెందిన ఎస్.హైమావతి. వ్యవసాయంలో కొత్త ఒరవడులు సృష్టించి అందరి మన్ననలు పొందుతున్నారు. 30 ఎకరాల వ్యవసాయ భూమిలో 10 ఎకరాల్లో నిమ్మ, 15 ఎకరాల్లో మామిడి, 5 ఎకరాల్లో బొప్పాయి, వేరుసెనగ, కూరగాయల పంటలు పండిస్తున్న హైమావతి గో ఆధారిత వ్యవసాయం చేస్తోంది. తొలి రెండేళ్లు ఇబ్బందులు ఎదురైనా జీవామృతాల వాడకంతో సత్ఫలితాలు రావడం గమనించారు. జీవామృతం, నీమాస్త్రం, అగనాస్త్రం, అజొల్లా తదితర సస్యరక్షణ విధానాల ద్వారా అంతర పంటల సాగు చేసి.. అభ్యుదయ రైతుగా పేరు తెచ్చుకున్నారు.
సినీ రంగం
ఈ అవార్డు అందుకున్నందుకు గర్వపడుతున్నా. నేను కొరియోగ్రఫీని కెరీర్‌గా ఎంచుకున్నప్పుడు నా చుట్టూ మగవాళ్లే ఉండేవారు. మహిళలు ఈ రంగంలోకి ఎప్పుడు వస్తారో అని ఎదురు చూసేదాన్ని. అటువంటిది ప్రస్తుతం అన్ని రంగాల్లో మనం ఉండే స్థాయికి ఎదిగాం. ప్రముఖ మహిళలెందరో ఈ అవార్డు అందుకుంటుంటే, అంతటి ఉన్నత వ్యక్తుల మధ్య నాకూ స్థానం దక్కడం చాలా సంతోషంగా ఉంది. నేనీ స్థాయికి చేరుకోవడానికి నాకు ప్రోత్సాహాన్ని అందించిన అమ్మ, నా కుటుంబ సభ్యులతోపాటు పలువురు సినీప్రముఖులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెబుతున్నా.
- అనీ
ఆమెగానీ స్టెప్పేస్తే..!
పశ్చిమబెంగాల్‌కి చెందిన అనీ చిన్నతనంలోనే హైదరాబాద్‌కి వచ్చింది ఆమెకు డ్యాన్స్ మాస్టర్ ఎవరూ లేరు. ఆర్థిక కష్టాల వల్ల తనే ఇంట్లో అద్దం ముందు గంటలపాటు డ్యాన్సు చేేసేది. పదో తరగతి చదివాక స్టేజ్షోల్లో డ్యాన్సు చేశారు. అలా డ్యాన్సర్‌గా మంచి పేరు రావటంతో చిరంజీవి హీరోగా నటించిన శంకర్‌దాదా జిందాబాద్ సినిమాలో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పనిచేసే అవకాశం చేజిక్కించుకున్నారు. తెలుగు, తమిళం, బాలీవుడ్ సినిమాలతో పాటు దాదాపు 200 సినిమాలకు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా చేసిన అనీకి ‘జ్యోతిలక్ష్మి‘ సినిమాతో కొరియోగ్రాఫర్ అవకాశం ఇచ్చారు పూరీ జగన్నాథ్. సర్దార్ గబ్బర్‌సింగ్, పైసావసూల్, కాటమరాయుడు, మహానటి.. లాంటి చిత్రాలతో పాపులరైంది. ప్రస్తుతం ఢీ జోడి కార్యక్రమంలో న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూ ఇంటింటికీ పరిచయమైంది అనీ.
ఘన వారసత్వం...
తెలుగువారు గర్వించే గొప్ప నటుల్లో ఒకరైన అక్కినేని నాగేశ్వరరావు మనవరాలు సుప్రియ యార్లగడ్ఢ తండ్రి యార్లగడ్డ సురేంద్ర నిర్మాత కావడంతో తొలి నుంచి సినిమాలపై మక్కువ పెంచుకున్నారు. పదహారో ఏటనే గాయం సినిమా నిర్మాణంలో పాలుపంచుకున్నారు. పవన్‌కల్యాణ్ నటించిన అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సినిమా ద్వారా కథానాయికగా వెండితెరకు పరిచయం అయ్యారు. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తున్న సినిమాలకు ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా కూడా వ్యవహరించారు. దాదాపు 20 ఏళ్ల విరామం తర్వాత గూఢచారి సినిమాలో కీలక పాత్ర పోషించి ప్రేక్షకుల ప్రశంసలు పొందారు. సినిమా నిర్మాణంలోనూ, నటనలోనూ వైవిధ్యం ప్రదర్శిస్తున్నారు సుప్రియ.
క్రీడారంగం
మహిళా క్రికెట్ చిరునామా!
భారత మహిళల క్రికెట్ అనగానే ఠక్కున గుర్తుకొచ్చే పేరు మిథాలీరాజ్. దేశంలో అమ్మాయిల క్రికెట్ ఉందని కూడా చాలా మందికి తెలియని సమయంలో మిథాలీ ఆటలో అడుగుపెట్టింది. అక్కడి నుంచి భారత మహిళా క్రికెట్ ప్రతి మలుపులోనూ తనదైన ముద్ర వేశారు. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో భారత జట్టు గొప్ప స్థాయిలో ఉందంటే.. అందుకు ప్రధాన కారణం.. మిథాలీయే. 16 ఏళ్ల వయసులో వన్డే అరంగేట్రం చేసిన ఈ హైదరాబాదీ తొలి మ్యాచ్‌లోనే అజేయ శతకం చేసింది. 19 ఏళ్ల వయసులో తన మూడో టెస్టులోనే ఇంగ్లాండ్‌పై 214 పరుగులు చేశారు. 2005, 2017 ప్రపంచకప్‌ల్లో కెప్టెన్‌గా జట్టును ఫైనల్‌కు చేర్చారు. గతేడాది టీ20ల నుంచి రిటైరయ్యారు. గతంలో మిథాలీ బ్యాటర్‌గా కొనసాగుతూనే జట్టుకు కోచ్‌గా కూడా పనిచేశారు. రెండు దశాబ్దాల పాటు అన్నీ తానై జట్టును నడిపించిన ఈ ప్రస్తుత వన్డే కెప్టెన్.. 2021 ప్రపంచకప్ తర్వాత వీడ్కోలు పలికే అవకాశముంది.
గురితప్పని బాణం
తమ పిల్లలు బాగా చదువుకోవాలని, చక్కటి ఉద్యోగాలు చేయాలని అందరు తల్లిదండ్రులు అనుకుంటారు. మా అమ్మానాన్న నన్ను క్రీడల్లోకి తీసుకువచ్చారు. వాళ్ల వల్లే నేనీ స్థాయిలో ఉన్నా.
ఆమె విల్లు నుంచి దూసుకొచ్చిన బాణం లక్ష్యాన్ని ముద్దాడుతోంది.. ఆమె ఎక్కుపెడితే గురి కుదురుతోంది. ఆనాడు అర్జునుడికి పక్షి కన్ను మాత్రమే కనిపించినట్లు.. ఈ అతివకు లక్ష్యం మాత్రమే కళ్ల ముందు మెదులుతుంది. అందుకే ఆర్చరీలో అడుగుపెట్టి.. పతకాలు కొల్లగొడుతోంది. ఆమే.. 23 ఏళ్ల విజయవాడ ఆర్చర్.. వెన్నం జ్యోతి సురేఖ.నాలుగేళ్ల వయసులో కృష్ణా నదిలో 5 కిలోమీటర్లను 3 గంటల 20 నిమిషాల్లో ఈది లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. పదేళ్ల వయసులో ఆర్చరీలో అడుగుపెట్టిన సురేఖ.. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పతకాలు కొల్లగొట్టింది. 2011లో అంతర్జాతీయ టోర్నీల్లో అరంగేట్రం చేసి తన అద్భుత నైపుణ్యాలతో ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ప్రపంచకప్ అంచె పోటీలు, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లు, ఆసియా క్రీడలు, ఆసియా ఛాంపియన్‌షిప్‌లు... ఇలా ఏ టోర్నీలో పాల్గొన్నా పతకంతో తిరిగి రావడం అలవాటుగా మార్చుకుంది.
బాల దిగ్గజం
ఈ అవార్డు దక్కడానికి ముఖ్య కారణం మా నాన్న. కిలిమంజారోను అధిరోహించడానికి ముందు నేను వేరు, ఇప్పుడు వేరు. నాలో దాగి ఉన్న బలం గురించి తెలుసుకునేందుకు ఆయన నాతో ఈ ప్రయత్నం చేయించారు. ఎన్నో అవరోధాలను ఎదుర్కొంటూ అనుకున్నది సాధించగలిగాను. ఈ ప్రయత్నంతోనే భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను సునాయాసంగా ఎదుర్కోగలననే నమ్మకం నాలో బలపడింది. ఈ అవార్డు నాలాంటి వారిలో స్ఫూర్తిని నింపుతుంది.
కాళ్లకింద కిలిమంజారో...
నిరంతరాయంగా వర్షం కురుస్తున్నా, చలి గజగజ వణికిస్తూ భయపెడుతున్నా బెదరలేదు ఈశాన్వి. గుండెలనిండా ఆత్మవిశ్వాసంతో ఆఫ్రికాలో ఎత్తైన శిఖరాల్లో ఒకటైన కిలిమంజారోను అధిరోహించింది. పదకొండేళ్ల వయస్సులోనే ఈ ఘనతని సాధించి.. అందరి ప్రశంసలు అందుకుంది. కరీంనగర్‌కి చెందిన ఈశాన్వి చిన్ననాటి నుంచి చురుగ్గానే ఉండేది. కానీ ఏదైనా చేసేముందు తనవల్ల అవుతుందో కాదో అన్న ఓ చిన్న భయం ఆమెలో ఉండేది. కానీ తండ్రి శ్రీకాంత్ ఆమెలో ఆత్మవిశ్వాసం నింపారు. కూతురి భయాన్ని పోగొట్టేందుకు తనతో పాటు ట్రెక్కింగ్‌కు తీసుకెళ్లేవారు. అలా భయాన్ని పొగొట్టుకున్న ఈశాన్వి గత అక్టోబర్‌లో ఏకంగా కిలిమంజారో పర్వాతాన్నే అధిరోహించింది.
నాట్య పరిమళం...
కూచిపూడి నృత్యాన్ని అభ్యసించడానికి నా వెనుక ఉన్న నా తల్లిదండ్రులు, నృత్యం నేర్పిన గురువులు, నాకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్న గురువులకు ధన్యవాదాలు.
‘వేదంలా ఘోషించే గోదావరి..అమర ధామంలా శోభిల్లే రాజమహేంద్రి..శతాబ్దాల చరితగల సుందర నగరం..’ అంతటి ఘన చరితగల రాజమహేంద్రికి చెందిన చిన్నారే... మద్దిపట్ల పరిమళ హరిప్రియ. పదమూడేళ్ల వయసులోనే కూచిపూడి, భరతనాట్యాల్లో అద్భుతంగా రాణిస్తోంది. తొమ్మిదో తరగతి చదువుతోన్న హరిప్రియ ఇప్పటివరకు అయిదు వందలకు పైగా ప్రదర్శనలు ఇచ్చింది. రెండేళ్ల కిందట హరిప్రియ ఇస్రోలో ఇచ్చిన ప్రదర్శన ఎందరో ప్రముఖుల ప్రశంసలను అందుకుంది. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా పశ్చిమబెంగాల్లో ఆమె ఇచ్చిన ప్రదర్శన రసహృదయులను ఆనందసాగరంలో ముంచేసింది. 2015లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో ‘నాట్య మయూరి’ అవార్డు, 2016లో ‘నర్తన్ బాల’ అవార్డు, రాష్ట్ర స్థాయి పోటీలో ‘నాట్య పరిమళ’ అవార్డులు గెలుచుకుంది. శోభానాయుడు, మంజుభార్గవిలా నృత్యంలో మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటున్న హరిప్రియకు వీణలో కూడా ప్రవేశం ఉంది.
‘వసుంధర’ పురస్కారాల విజేతలను ఎంపిక చేసిన న్యాయ నిర్ణేతలు వీరే
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- ఆ ఓటమి కన్నా ఈ డ్రా మరింత ఘోరం
- హైదరాబాద్ కేపీహెచ్బీలో దారుణం
- బాయ్‌ఫ్రెండ్ ఫొటో పంచుకున్న కాజల్
- చీరకట్టుతో కమలా హారిస్ ప్రమాణ స్వీకారం?
- కన్న కూతురిపై ఏడేళ్లుగా అత్యాచారం
- సిరాజ్.. ఇక కుర్రాడు కాదు
- తాగడానికి తగని సమయముంటదా..!
- ఆఖరి రోజు ఓపిక పడితే..!
- ఆఖరి రోజు ఆసీస్‌కు భయం.. ఎందుకంటే!
- స్మిత్ చూస్తుండగానే రోహిత్ షాడో బ్యాటింగ్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
