జగన్‌ను విష్ణువుతో పోల్చిన రమణ దీక్షితులు
close

తాజా వార్తలు

Updated : 06/04/2021 15:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జగన్‌ను విష్ణువుతో పోల్చిన రమణ దీక్షితులు

తిరుమల: ఏపీ సీఎం జగన్‌ను మంగళవారం తితిదే ప్రధానార్చకులు రమణదీక్షితులు కలిశారు. వంశపారంపర్య హక్కులు కల్పించిన సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా రమణ దీక్షితులు మీడియాతో మాట్లాడుతూ... ‘‘ సీఎం జగన్‌ విష్ణుమూర్తిలా ధర్మాన్ని రక్షిస్తున్నారు. అర్చకుల కుటుంబాలకు భూములు ఇవ్వాలని కోరాం. పింక్‌ డైమండ్‌ మాయం అంశం కోర్టులో ఉంది. తిరుమలలో అన్యమత ప్రచారం జరగట్లేదు. తితిదే విషయాలను రాజకీయం చేయడం తగదు’’ అని పేర్కొన్నారు. 

పదవీ విరమణ చేసిన అర్చకులను తిరిగి అదే స్థానంలో విధుల్లోకి తీసుకోవాలని తితిదే అధికారులు కీలక నిర్ణయం తీసుకోవడంతో.. ఎ.వి.రమణదీక్షితులు ప్రధాన అర్చకులుగా తిరిగి బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. 65 ఏళ్లు నిండిన అర్చకులకు పదవీ విరమణ ఇస్తూ 2018 మే 16న అప్పటి ధర్మకర్తల మండలి తీర్మానించింది. దీనికి అనుగుణంగా అప్పటి తితిదే ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు, నరసింహ దీక్షితులు, శ్రీనివాస దీక్షితులు, నారాయణమూర్తి దీక్షితులుతోపాటు మరో 11 మంది పదవీ విరమణ చేయాల్సి వచ్చింది. ధర్మకర్తల మండలి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయ అర్చకులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వీరిలో విధులు నిర్వహించగలిగే శారీరక సామర్థ్యం ఉన్న వారిని విధుల్లోకి తీసుకోవాలంటూ 2018 డిసెంబరులో హైకోర్టు తీర్పు వెలువరించింది. అప్పటి నుంచి ఈ వ్యవహారం పెండింగ్‌లో ఉంది. ఈ క్రమంలో రమణదీక్షితులు అప్పటి ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డిని హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో ఉన్న ఆయన ఇంటికి వెళ్లి కలిశారు. వైకాపా అధికారంలోకి వస్తే ప్రధాన అర్చకుడిగా రమణదీక్షితులును తిరిగి నియమిస్తామని జగన్‌ నాడు హామీ ఇచ్చారు. 2019లో జగన్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జీవో ఎంఎస్‌ నంబరు 439 ద్వారా అర్చకులకు పదవీ విరమణ లేకుండా ఉత్తర్వులు జారీ చేశారు.  దీంతో రమణదీక్షితులుతోపాటు 14 మంది అర్చకులు తిరిగి విధుల్లో చేరారు.  


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని