close
ఎన్నాళ్లీ వివక్ష? 

రాష్ట్రాలపై కేంద్రం అడుగడుగునా చిన్నచూపు 
అధికారాలు, హక్కుల పంపిణీలో అగౌరవం 
కేంద్రంపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు 
కాంగ్రెస్‌, భాజపాలే దానికి కారణం 
ఆర్థిక సంఘం పనితీరు మారాలి 
నివేదిక రూపకల్పనలో రాష్ట్రావసరాలు ప్రతిబింబించాలి 
ప్రజాకోణంలో తెలంగాణ బడ్జెట్‌ 
సమీక్షలో సీఎం కేసీఆర్‌ 
ఈనాడు - హైదరాబాద్‌

ధికారాలు, హక్కుల పంపిణీలో కేంద్ర ప్రభుత్వం వివక్షతో రాష్ట్రాలను అగౌరవపరుస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ధ్వజమెత్తారు. రాష్ట్రాలకు అప్పగించాల్సిన అధికారాలను తమ గుప్పిట్లో పెట్టుకుందని, ప్రజావసరాలను గుర్తించలేని విధంగా కేంద్ర విధానాలున్నాయని విమర్శించారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ప్రజల అవసరాలు తీర్చలేకపోయాయన్నారు. కేంద్రంలోని  ప్రభుత్వ విధానాల పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తితో నిరసన వ్యక్తం చేస్తున్నారని.. కాంగ్రెస్‌, భాజపా అనే రెండు రాజకీయ వ్యవస్థలే దీనికి మూలకారణమని సీఎం మండిపడ్డారు. దేశ ఆర్థిక వ్యవస్థను గుణాత్మక దిశగా నడిపించేందుకు ఆర్థిక సంఘం తన పాత్రను వినూత్నంగా తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ బడ్జెట్‌ ప్రజల కోణంలో, రాష్ట్ర ఆర్థికాభివృద్ధిని మరింత బలోపేతం చేసేలా ఉండాలని ఆకాంక్షించారు. సీఎంగా తనను ఎన్నుకున్న ప్రజలకు ఎంత సేవ చేయగలనో ఆలోచన చేయాలన్నారు. త్వరలో రాష్ట్రంలో 15వ ఆర్థిక సంఘం పర్యటన, ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ రూపకల్పన నేపథ్యంలో శనివారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మ, ఆర్థిక సలహాదారు జీఆర్‌ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్‌ తివారీ, ఆర్థిక, పంచాయతీరాజ్‌ శాఖల ముఖ్యకార్యదర్శులు రామకృష్ణారావు, వికాస్‌రాజ్‌, సీఎం కార్యాలయ ఉన్నతాధికారులు నర్సింగ్‌రావు, స్మితా సబర్వాల్‌, సందీప్‌ సుల్తానియా, మాణిక్‌రాజ్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడారు. ‘‘దేశానికి విశాలమైన ఆర్థిక విధానం ఉంది. కానీ, అధికారాలన్నీ కేంద్రం గుప్పిట్లోనే ఉన్నాయి. పురోగతి సాధిస్తున్న రాష్ట్రాల విధానాల్లో జోక్యం చేసుకోవద్దని నేను నీతిఆయోగ్‌ సమావేశాల్లో స్పష్టం చేశాను. రాష్ట్ర ప్రగతిని దేశ ప్రగతిగా పరిగణించాలి. పురోగతి సాధిస్తున్న రాష్ట్రాలను నిరుత్సాహపరచొద్దు. చిన్న చిన్న నిధుల విడుదలకు కూడా అనేక నిబంధనలు విధిస్తున్నారు. 
ఆర్థిక సంఘం తీరు మారాలి 
ఆర్థిక సంఘం రాష్ట్రాల్లో పర్యటించి, అక్కడి ప్రభుత్వాలతో చర్చించి వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలి. కానీ, పర్యటనకు ముందే విధివిధానాలను రూపొందిస్తున్నారు. ఇది సరికాదు. ఒక్కో రాష్ట్రానికి ఒక్కో సాంస్కృతిక, ఆర్థిక జీవన విధానం ఉంటుంది. రాష్ట్రాల అవసరాలరీత్యా సంక్రమణల (డివల్యూషన్‌) అంశం రాష్ట్రాల హక్కుగా పరిగణించి, విధానాల రూపకల్పనకే ఆర్థిక సంఘం పరిమితమైతే మంచిది. తెలంగాణ ప్రజావసరాలను దృష్టిలో పెట్టుకుని ఆర్థిక శాఖ నివేదిక రూపొందించాలి. 
అయిదేళ్ల అవగాహనతో బడ్జెట్‌ 
ఆదరాబాదరాగా కాకుండా స్పష్టమైన అవగాహనకు వచ్చాకే బడ్జెట్‌ రూపకల్పన జరగాలి. మన బలాలు, బలహీనతలను అంచనా వేసుకోవాలి. అన్ని రంగాల్లో రాష్ట్ర ప్రజల అవసరాలను పరిశీలించిన తర్వాతే తుదిబడ్జెట్‌కు రూపకల్పన చేయాలి. కేవలం ఈ ఏడాదికే కాకుండా, వచ్చే అయిదేళ్లకు తగ్గట్లు బడ్జెట్‌ విధివిధానాలుండాలి. అయిదేళ్లలో రాష్ట్రానికి ఎంత డబ్బు వస్తుంది? ఎంత ఖర్చవుతుందనే  అంచనా ఉండాలి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సహా రానున్న ఐదేళ్ల కాలానికి నీటిపారుదల శాఖకు రూ.రెండు లక్షల కోట్లు ఖర్చవుతుంది. కేంద్రం నుంచి అన్ని సాగునీటి ప్రాజెక్టులకూ అనుమతులు సాధించినందున బడ్జెట్‌ వాటికి పెద్దపీట వేయాలి. గొర్రెల పంపిణీ ప్రజాదరణ పొందింది. చేపల పెంపకం, చేనేత రంగానికి ఉజ్వల భవిష్యత్తు ఉంది. అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్ర చేనేత ఉత్పత్తులకు ఆదరణ లభిస్తోంది. వారి కళను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలి. విద్యుత్‌ సగటు వినియోగంలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. బడ్జెట్‌ ప్రతిపాదనల్లో ఈ అంశాలన్నీ పరిగణించాలి. 
మంత్రులకు శిక్షణ 
మంత్రివర్గ విస్తరణ తర్వాత మంత్రులు, అన్ని శాఖల కార్యదర్శులకు వారి విధులు, అధికారాలు, పాత్రలు, కేంద్ర, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థల్లో వారి పరిధులు, నిబంధనలపై అడ్మినిస్ట్రేషన్‌ స్టాఫ్‌ కాలేజీ (ఆస్కి) ద్వారా శిక్షణ ఇప్పిస్తాం. 
హైదరాబాద్‌పై బృహత్తర ప్రణాళిక 
హైదరాబాద్‌ విశ్వనగరం. ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. దేశంలోని 5 ప్రధాన నగరాల్లో ఒకటి. ఇందులో వంద పార్కులుఉండాలి. భవిష్యత్తు తరాల కోసం బృహత్తర ప్రణాళికను రూపొందించాలి. హైదరాబాద్‌ను వచ్చే అయిదేళ్లలో ప్రపంచ స్థాయికి ఎలా తీర్చిదిద్దనున్నామో బడ్జెట్‌లో ప్రతిబింబించాలి’’ అని సీఎం సూచించారు.

పర్యాటక కేంద్రంగా కాళేశ్వరం

కాళేశ్వరం ప్రాజెక్టును ఆకర్షణీయ పర్యాటక కేంద్రంగా, ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దాలి. అక్కడి త్రివేణి సంగమం అద్భుతమైన పర్యాటక కేంద్రంగా మారబోతోంది. ఈ దిశగా బడ్జెట్‌లో దృష్టి కేంద్రీకరించాలి. విశ్వవిద్యాలయాల పరిశోధనలు, వ్యవసాయాన్ని నవీకరించడం, ఆహారశుద్ధి రంగానికి అవకాశాలు కల్పించడంపై విధివిధానాలు రూపొందించాలి. మన విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వలసపోకుండా, దేశవిదేశాల విద్యార్థులను కూడా ఆకర్షించేలా రాష్ట్రంలో విద్యావ్యవస్థ అభివృద్ధికి ప్రణాళికలు తయారుచేయాలి. ప్రైవేటు విశ్వవిద్యాలయాల ప్రయోజనాలను పరిశీలించాలి. ఆరోగ్య తెలంగాణ దిశగా మానవీయ కోణంలో బడ్జెట్‌ విధానాలు ఉండాలి. రాష్ట్రవ్యాప్తంగా శుద్ధి చేసిన పరిశుభ్రమైన తాగునీరు లభిస్తుండడం రాష్ట్రాభివృద్ధికి సూచిక. పారిశ్రామిక, మౌలిక సదుపాయాల అవసరాలు దృష్టిలో పెట్టుకుని బడ్జెట్‌ అంచనాలు రూపొందించాలి.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.