close
కాళేశ్వర పర్వానికి సమాయత్తం 

సీఎం కేసీఆర్‌ సుదీర్ఘ సమీక్ష 
ప్రాజెక్టు వద్ద చకచకా ఏర్పాట్లు

ఈనాడు, హైదరాబాద్‌, మహదేవ్‌పూర్‌, కాళేశ్వరం, న్యూస్‌టుడే: కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఈ నెల 21వ తేదీని ముహూర్తంగా నిర్ణయించడంతో దీన్నొక మహోత్సవంగా చేసేందుకు యంత్రాంగం ఆయత్తమైంది. ప్రారంభోత్సవ ఏర్పాట్లపై శనివారం హైదరాబాద్‌ ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. దీంతోపాటు వివిధ అంశాలపై మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు సమావేశాలు సాగాయి. కాళేశ్వరం ప్రారంభోత్సవానికి నిర్ణయం జరిగినా ఇప్పటి వరకు పూర్తి స్థాయి షెడ్యూలు ఖరారు కాలేదు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌, మహారాష్ట్ర గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌రావులు ఇప్పటి వరకు ఖరారైన అతిథులు. ప్రారంభోత్సవం అనంతరం విందు ఏర్పాట్ల గురించి కూడా మాట్లాడినట్లు సమాచారం. మరోపక్క ప్రారంభోత్సవ ప్రాంతమైన భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలంలో పోలీసులు మూడంచెల భద్రత ఏర్పాట్లు చేపట్టారు. తెలంగాణ-మహారాష్ట్ర-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు గోదావరి పరీవాహక ప్రాంతంలో మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న నేపథ్యంలో మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంపుహౌస్‌, గ్రావెటీ కెనాల్‌ వద్ద అదనపు బలగాలను మోహరించారు. మేడిగడ్డ బ్యారేజీ ప్రారంభించే సమయంలో నదికి ప్రత్యేక పూజలు, హోమ క్రతువు నిర్వహించే స్థలాలను చదును చేసే పనులు పూర్తిచేశారు. 
నాలుగు హెలిప్యాడ్‌ల కోసం స్థల పరిశీలన 
ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వచ్చే ముఖ్య అతిథుల కోసం ఆరు హెలిప్యాడ్‌లు అవసరమని ఉన్నతాధికారులు గతంలో అంచనా వేశారు. కన్నెపల్లి పంపుహౌస్‌ ఆవరణలో రెండింటిని నిర్మించే పనులు ప్రారంభమవగా..మరో నాలుగింటి కోసం స్థలాలను పరిశీలిస్తున్నారు. 
మూడు బ్లాక్‌లలో నీటి నిల్వ 
మేడిగడ్డ బ్యారేజీలో 85 గేట్లను ఎనిమిది బ్లాక్‌లుగా విభజించారు. ప్రారంభం రోజు నీటి విడుదలకు వీలుగా 1,2,3 బ్లాక్‌ల పరిధిలోని గేట్లను ఇంజినీరింగ్‌ అధికారులు మూసివేశారు. ప్రవాహం దిగువకు వెళ్లకపోవడంతో బ్యారేజీలో నీటి నిల్వ పెరుగుతోంది. కన్నెపల్లి పంపుహౌస్‌లోని పంపులకు ఏమైనా లీకేజీలు ఉన్నాయా? అనేది పరిశీలించేందుకుగానూ శనివారం గోదావరి ప్రవాహాన్ని ఫోర్‌బే ద్వారా పంపుహౌస్‌ లోపలి భాగంలోకి వదిలారు. రెండుసార్లు పరీక్షల అనంతరం మూడోమారు పంపులను వెట్‌రన్‌కు సిద్ధం చేస్తారు. 
ముస్తాబవుతున్న క్షేత్రం 
అతిథుల కోసం కాళేశ్వర క్షేత్రం ముస్తాబవుతోంది. రాజగోపురం, ప్రధాన దేవాలయం, శివకల్యాణ మండపాలను అలంకరించే పనులు ఆరంభమయ్యాయి. అతిథులకు సమర్పించే పట్టు వస్త్రాలు, కండువాలు, బెల్లం లడ్డూ ప్రసాదాలను సిద్ధం చేస్తున్నారు. 
మంత్రిమండలి సమావేశంపై... 
ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీక్షలో వచ్చే మంత్రిమండలి సమావేశంలోని ఎజెండా అంశాలపై కూడా చర్చ జరిగింది. కేబినెట్‌ సమావేశంలో కొత్త పురపాలక చట్టం, రెవెన్యూ సంస్కరణలు, కొత్త పంచాయతీరాజ్‌ చట్టం, రోడ్డు భద్రతా చట్టం, రైతుబంధు సాయం పెంపు, రూ.లక్ష వరకు రుణమాఫీ, ఆసరా పింఛన్ల పెంపు వంటివాటిపై నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయి. వీటన్నింటి గురించి సీఎం చర్చించారని తెలిసింది. అయితే ఎజెండా అంశాలు సిద్ధం కాలేదు. మంత్రిమండలి సమావేశం గురించి శనివారం సీఎస్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో ఎజెండా ఇంకా ఖరారు కాలేదని, త్వరలో పంపిస్తామని పేర్కొన్నారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.