close
తెలుగు వారి చరిత్రలో కొత్త అధ్యాయం లిఖిస్తాం

గోదావరి జలాలు తరలించి సీమను రతనాల సీమగా మారుస్తాం
పరస్పర సమన్వయంతో రెండు రాష్ట్రాల అభివృద్ధి
జగన్‌కు పెద్దన్నలా సహకరిస్తా
ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యాఖ్యలు
కాంచీపురంలో అత్తివరదర్‌ స్వామికి ప్రత్యేక పూజలు
నగరిలో రోజా ఇంట ఆతిథ్యం

ఈనాడు, హైదరాబాద్‌, ఈనాడు డిజిటల్‌, చెన్నై - కాంచీపురం, నగరి, న్యూస్‌టుడే: తెలుగువారి చరిత్రలో మునుపెన్నడూ లేనివిధంగా కొత్త అధ్యాయాన్ని లిఖించబోతున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. రెండు రాష్ట్రాల అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి, తాను సమన్వయంతో కలిసి పనిచేస్తామని చెప్పారు. రాయలసీమను రతనాలసీమగా మార్చేందుకు దేవుడిచ్చిన సర్వశక్తులూ ఉపయోగిస్తామని.. జగన్‌కు పెద్దన్నలా సహకారం అందిస్తానని వెల్లడించారు. రాయలసీమ ఆర్థికంగా ఎదగడానికి, అభివృద్ధి చెందడానికి గోదావరి జలాలు రావాల్సిన అవసరముందని.. తప్పకుండా అది సాధ్యమవుతుందని కేసీఆర్‌ చెప్పారు. సోమవారం తమిళనాడులోని కాంచీపురంలో అత్తి వరదర్‌ స్వామిని దర్శించుకున్న అనంతరం తిరుగుప్రయాణంలో ఆయన చిత్తూరు జిల్లా నగరిలో వైకాపా ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్‌ రోజా ఇంట్లో ఆతిథ్యం స్వీకరించారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌కు మంచి పట్టుదల ఉన్న యువనాయకుడు జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన సారథ్యంలో ఏపీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది. రెండు రాష్ట్రాల అభివృద్ధికి పరస్పర సహకారంతో మేం కృషి చేస్తున్నాం. ఇది కొందరికి అర్థం కాకపోవచ్చు. మరికొందరికి జీర్ణం కాకపోవచ్చు. దానికి మేం చేయగలిగిందేమీ లేదు. ప్రజల మద్దతు ఉన్నంతకాలం తప్పకుండా రెండు రాష్ట్రాల ప్రజల కోరికలు నెరవేరుస్తాం. ఏపీకి వందశాతం నా ఆశీస్సులు, సంపూర్ణ సహకారం ఉంటాయి. నీళ్ల విషయంలో ఇప్పటికే నేను, జగన్‌ చర్చలు జరిపాం. ఇప్పుడు ప్రాజెక్టులు కళకళలాడుతున్నాయి. ఆ నీరు ప్రజలకు ఉపయోగపడాలనే నిర్ణయానికి వచ్చాం. గోదావరి జలాలు వృథాగా సముద్రంలోకి పోతున్నాయి. వాటిని కృష్ణానదిలో కలపాలనే విషయమై మాట్లాడుకున్నాం. రాయలసీమ ప్రజల ఇబ్బందులు నాకు తెలుసు. వారి కష్టాలు తెలిసిన నాయకుడు జగన్‌. సీమలో వర్షాలు లేక ప్రజలు చాలా ఇక్కట్లు పడుతున్నారు. గోదావరి జలాలను వాడుకుంటే బంగారు పంటలు పండుతాయి. ప్రజల కష్టాలు తీరుతాయి. గోదావరి జలాలు వృథాగా సముద్రంలో కలవకుండా వెయ్యి టీఎంసీలను రాయలసీమకు మళ్లించాలన్నదే మా ఆశయం’’ అని సీఎం వెల్లడించారు. ఒక రోజు పర్యటనలో భాగంగా సోమవారం ఉదయం కేసీఆర్‌ తమ సతీమణి శోభ, కుమార్తె, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితతో కలిసి ప్రత్యేక విమానంలో రేణిగుంట వెళ్లారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కాంచీపురం వెళ్లారు. సీఎం వెంట ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, తెరాస ప్రధాన కార్యదర్శి శ్రావణ్‌కుమార్‌రెడ్డి తదితరులున్నారు.

అత్తివరదర్‌ సేవలో కేసీఆర్‌ దంపతులు
కాంచీపురం అత్తివరదర్‌ స్వామి సేవలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ దంపతులు, వారి కుమార్తె కవిత పాల్గొన్నారు. వారితోపాటు ఆంధ్రప్రదేశ్‌ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నగరి ఎమ్మెల్యే రోజా, తమిళనాడు మంత్రి కె.సెంగొట్టయ్యన్‌ కూడా స్వామివారిని దర్శించుకున్నారు. సోమవారం మధ్యాహ్నం కాంచీపురానికి చేరుకున్న కేసీఆర్‌కు జిల్లా కలెక్టర్‌ పి.పొన్నయ్య స్వాగతం పలికారు. ఆలయంలో సీఎం కేసీఆర్‌ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు వారికి వేదాశీర్వచనం అందించారు. కాంచీపురం వరదరాజస్వామి ఆలయంలో 40 సంవత్సరాలకు ఒకసారి 48 రోజులపాటు నిర్వహించే అత్తివరదర్‌ ఉత్సవాలు ఈ ఏడాది జులై ఒకటో తేదీ నుంచి వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 17వ తేదీతో ముగియనున్నాయి.

తిరుమల యాత్ర రద్దు
సీఎం కేసీఆర్‌ సోమవారం సాయంత్రం తిరుమలకు వస్తారని తితిదే అధికారులకు ఒకరోజు ముందు అధికారిక సమాచారం అందింది. ఈ మేరకు తిరుమలలో ఏర్పాట్లు చేశారు. అయితే, ఆఖరి క్షణంలో తిరుమలకు రాకుండానే నగరి నుంచి నేరుగా రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న కేసీఆర్‌.. ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌ పయనమయ్యారు. ఏపీ మంత్రులు, నేతలు ఆయనకు వీడ్కోలు పలికారు. కాంచీపురం పర్యటన ఆలస్యం కావడంతో తిరుమల పర్యటనను సీఎం కేసీఆర్‌ రద్దు చేసుకున్నట్లు తెలిసింది.

అన్నదాతా సుఖీభవ.. రోజాకు కేసీఆర్‌ దీవెన

కాంచీపురం నుంచి తిరుగు ప్రయాణంలో సీఎం కేసీఆర్‌ నగరిలోని ఎమ్మెల్యే రోజా ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా సెల్వమణి, రోజా దంపతులు.. కేసీఆర్‌ దంపతులను శాలువాతో సత్కరించి సాదరంగా ఆహ్వానించారు. రోజా స్వయంగా కేసీఆర్‌ కుటుంబసభ్యులకు వడ్డించారు. సుమారు రెండు గంటలపాటు కేసీఆర్‌ అక్కడ ఉన్నారు. ఏపీ ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆదిమూలం తదితరులతో కలిసి రాయలసీమ అభివృద్ధితోపాటు పలుఅంశాలపై చర్చించారు. తన కుమార్తె నగరి ఎమ్మెల్యే రోజా మంచి ఆతిథ్యమిచ్చారని.. అన్నదాతా సుఖీభవ! అంటూ కేసీఆర్‌ ఆమెను దీవించారు. ఏపీ మంత్రులు ఆత్మీయత చూపారన్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మా ఇంటికి రావడం, నన్ను కుమార్తెగా భావించడం నా అదృష్టం

- రోజా

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.