close
మరో 20 మృతదేహాల వెలికితీత

28కి చేరిన బోటు ప్రమాద మృతుల సంఖ్య
ఇంకా ఆచూకీ తెలియని 19 మంది

లావుగా ఉబ్బిపోయి.. బొబ్బలు తేలి.. అక్కడక్కడ చర్మం కూడా ఊడిపోయిన స్థితిలో మృతదేహాలు. గుర్తుపట్టడానికి కూడా వీల్లేకుండా ఉంటున్నాయి. 48 గంటలకే పరిస్థితి ఇలా ఉంటే, ఒక్కో గంట గడిచేకొద్దీ ఏమవుతుందోనన్న ఆందోళన దేవీపట్నం సమీపంలో జరిగిన పడవ ప్రమాదంలో గల్లంతైనవారి బంధువుల్లో కనిపిస్తోంది. 73 మందితో పాపికొండల యాత్రకు వెళ్తున్న పడవ బోల్తాపడి అందులోని 26 మంది సురక్షితంగా బయటపడగా, ఇప్పటివరకు 28 మృతదేహాలు తేలాయి. 27 మందిని గుర్తించారు. మరొక్కరి వివరాలు తెలియాలి. మిగిలిన 19 మంది ఏమైపోయారో ఇప్పటికీ తెలియలేదు.

ఈనాడు డిజిటల్‌, రాజమహేంద్రవరం: పాపికొండలకు వెళ్లే పడవ ప్రమాదంలో గల్లంతైనవారి గుర్తింపులో మంగళవారం పురోగతి కనిపించింది. తొలిరోజు ప్రవాహంలో 8 మృతదేహాలు కొట్టుకురాగా.. మూడోరోజు 20 లభ్యమయ్యాయి. గుర్తించిన మృతదేహాలకు పంచనామా నిర్వహించి, బంధువులకు అప్పగించారు. ప్రవాహం వేగంగా ఉండడంతో మృతదేహాలు చెల్లాచెదురయ్యాయి. దేవీపట్నం సమీపంలో 13, మిగిలినవి ధవళేశ్వరం బ్యారేజి, యానాం ఫెర్రీ వంతెనల వద్ద గుర్తించారు. మూడు మృతదేహాలు పశ్చిమగోదావరి జిల్లా పోలవరం, కొవ్వూరు మండలాల పరిధిలో లభ్యమయ్యాయి. వాటన్నింటినీ వెలికితీసి రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దుస్తులు, జేబుల్లో ఉన్న కార్డుల ఆధారంగా గుర్తించారు. మృతదేహాల తరలింపు ఏర్పాట్లను రెండు రాష్ట్రాల మంత్రులు పరిశీలించారు. ఏపీ మంత్రులు పిల్లి సుభాష్‌చంద్రబోస్‌, కన్నబాబుతో కలిసి తెలంగాణ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, పువ్వాడ అజయ్‌కుమార్‌ రాజమహేంద్రవరం ఆసుపత్రికి వచ్చారు.

* ప్రమాదం జరిగినరోజు దొరికిన 8 మృతదేహాల్లో ఒకదాని వివరాలు తొలుత తెలియలేదు. ఈ మృతదేహం వరంగల్‌లోని హాజీపూర్‌కు చెందిన బొడ్డు లక్ష్మణ్‌ (26)దిగా గుర్తించారు.

రూ.25 లక్షలు ఇవ్వాలి
చంద్రబాబు డిమాండ్‌

గోదావరి నదిలో పర్యాటకుల బోటు ప్రమాదంలో గల్లంతైన వారిలో చాలామంది ఆచూకీ ఇప్పటికీ తెలియకపోవడం ప్రభుత్వ అసమర్థ, చేతకానితనానికి నిదర్శనమని మంగళవారం రాత్రి గుంటూరులో జరిగిన విలేకరుల సమావేశంలో తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

‘మృతదేహాలేమైనా తేలుతున్నాయా? ఈ రోజు ఏమైనా బయటపడ్డాయా? తెల్ల చొక్కా వేసుకున్న యువకుడెవరైనా కనిపించారా?’.. అంటూ పాపికొండల్లో పడవ ప్రమాదంలో చిక్కుకుని ఇప్పటికీ ఆచూకీ తెలియని వారి బంధువులు కలిసిన ప్రతి ఒక్కరినీ అడగటం కంటతడి పెట్టిస్తోంది. తమవారి ఆచూకీ కోసం వారు పడుతున్న ఆరాటం ఆవేదన కలిగిస్తోంది. ఏ మృతదేహం వచ్చినా అది తమవారిదేమోనని వారు భయపడటం కన్నీరు పెట్టిస్తోంది. ఏ మూలో తమవాళ్లు బతికే ఉండకపోతారా? అనే ఆశ మిణుకు మిణుకుమంటున్నా ప్రమాదం జరిగి 48 గంటలు దాటడంతో వారిలో ఆశలు అడుగుంటుతున్నాయి.

నా కొడుకు ఎక్కడున్నాడయ్యా?

ప్రమాదంలో గల్లంతైన ఆలీబ్‌ కోసం ఆయన తండ్రి అలీముద్దీన్‌ రంపచోడవరం ప్రాంతీయ ఆసుపత్రిలో వాకబు చేసిన తీరు కంటతడి పెట్టించింది. ‘నా కొడుకు ఎక్కడ ఉన్నాడయ్యా?’ అని వచ్చీరాని తెలుగులో ఆయన అడగటం మనసుల్ని కలచివేసింది. హైదరాబాద్‌ టోలీచౌకికి చెందిన ఆలీబ్‌ వ్యాయామ శిక్షకుడిగా పని చేస్తున్నారు.

నాన్నేడంటే ఏం చెప్పనురా...

‘మమ్మల్ని వదిలి వెళ్లిపోయావు... నీ కొడుకు ఇప్పుడిప్పుడే అమ్మ.. నాన్న.. అంటున్నాడు. ఊహ తెలిసిన తరువాత నాన్నేడని అడిగితే ఏం చెప్పను రా...’ అంటూ ఖమ్మం జిల్లా నేలకొండపల్లికి చెందిన రేపాకుల సూరయ్య బోరున విలపించారు. సూరయ్య ఇద్దరు కుమారుల్లో పెద్దవాడు విష్ణుకుమార్‌ (32) హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తున్నారు. రెండేళ్ల క్రితం వివాహం కాగా.. 5 నెలల బాబు ఉన్నాడు. విష్ణుకుమార్‌ పాపికొండల యాత్రకు ఒంటరిగా వెళ్లారు. ఆ విషయం ఇంట్లో వారికి తెలియదు. మిత్రుల ద్వారా సమాచారం తెలుసుకున్న సూరయ్య సోమవారం రాత్రి రాజమహేంద్రవరంలోని ప్రభుత్వాసుపత్రికి చేరుకున్నారు. బంధువుల సహాయంతో అక్కడికి వెళ్లి, కొడుకు మృతదేహాన్ని గుర్తించి కుప్పకూలిపోయారు. ఆయనను ఓదార్చడం ఎవరితరమూ కాలేదు.

బోటు తీసేందుకు సంప్రదాయ పద్ధతులు

మునిగిపోయిన బోటులో ఇంకా మృతదేహాలు ఉండవచ్చని భావిస్తున్నారు. బోటును వెలికితీసేందుకు సాంకేతిక పద్ధతుల్లో వీలుకాదని అంతా చేతులెత్తేశారు. ఈ పరిస్థితిలో గతంలో నాగార్జునసాగర్‌, బలిమెల ఘటనల్లో పడవను వెలికితీసేందుకు సహాయపడిన తూర్పుగోదావరి జిల్లా జగన్నాథపురం వాసి ధర్మాడి సత్యాన్ని ఈ ఆపరేషన్‌కు పిలుస్తున్నారు. జలవనరులశాఖ చీఫ్‌ ఇంజినీరు శ్రీధర్‌, ఎస్‌ఈ కృష్ణారావు, పోర్టు డైరక్టర్‌ ధర్మశాస్త తదితరులు సహాయచర్యల్లో ఉన్నవారితోను, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి నిశాంత్‌కుమార్‌తోను చర్చించారు. రంపచోడవరంలో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డితో సమావేశమయ్యారు. చివరకు ధర్మాడి సత్యం సాయం తీసుకోవాలని నిర్ణయించారు.


 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.