close
ఇదో దారి దోపిడీ!

వేగ నియంత్రణ పరికరం ధర పక్క రాష్ట్రాల్లో రూ.4 వేలు
తెలంగాణలో రూ.7,500 పైనే
పొరుగున 37 సంస్థలకు అనుమతి
ఇక్కడ 3 సంస్థలకే విక్రయ బాధ్యత
4 లక్షల వాణిజ్య వాహనదారులపై 140 కోట్ల మేర భారం!

ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి: వేగ నియంత్రణ (స్పీడ్‌ గవర్నర్‌) పరికరాల విక్రయ అనుమతి వ్యవహారం రాష్ట్రంలో విమర్శలకు తావిస్తోంది. అధికారులు 3 సంస్థలకు మాత్రమే అనుమతి ఇవ్వడంతో అవి ఇష్టారాజ్యంగా ధరలు పెంచాయి. పక్కన కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లో ఇదే పరికరం రూ.4 వేలకు దొరుకుతుంటే తెలంగాణలో రూ.7,500కు పైనే ఉంది. రాష్ట్రంలో 4 లక్షల వాణిజ్య వాహనాలున్నాయి. ఈ లెక్కన ఆయా వాహనదారులపై రూ.140 కోట్ల మేర అదనపు భారం పడే అవకాశం ఉంది. రహదారి ప్రమాదాలను నియంత్రించే చర్యల్లో భాగంగా.. లారీలు, బస్సులు తదితర వాణిజ్య వాహనాల వేగాన్ని గంటకు 80 కిలోమీటర్లకు పరిమితం చేయాలని కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఇందుకోసం ప్రతి వాహనానికి వేగ నియంత్రణ పరికరాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ పరికరాలను బిగించకపోతే ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ ఇవ్వకూడదని అధికారులు నిర్ణయించారు.

దేశంలో ఈ పరికరాలను విక్రయించాలంటే ఆటోమోటివ్‌ రీసెర్చి అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఏఆర్‌ఐ) అనుమతి ఉండాలి. ఇలా అనుమతి పొందిన సంస్థలు దేశవ్యాప్తంగా 37 వరకు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. అనేక రాష్ట్రాల్లో ఈ పరికరాలు విక్రయించేందుకు అర్హత ఉన్న అన్ని సంస్థలకు అవకాశం ఇచ్చారు. దీనివల్ల ఆయా రాష్ట్రాల్లో ఈ పరికరం రూ.4 వేలకే లభ్యమవుతోంది. తెలంగాణలో మాత్రం ఓ కమిటీని ఏర్పాటు చేసి, కొన్ని నిబంధనలు విధించారు. రవాణా శాఖకు రూ.కోటి బ్యాంకు గ్యారంటీ చెల్లించే సంస్థలకు అనుమతి ఇస్తామని ఆదేశాలు జారీ చేశారు. దీంతో తొలుత 3 కంపెనీలు రూ.50 లక్షల చొప్పున బ్యాంకు గ్యారంటీ చెల్లించాయి. తరువాత మరో నాలుగు కంపెనీలు రూ.కోటి చొప్పున బ్యాంక్‌ గ్యారంటీ చూపించాయి. రూ.50 లక్షలు చెల్లించిన 3 కంపెనీలకే రాష్ట్రంలో వేగ నియంత్రణ పరికరాల విక్రయాలకు అనుమతి ఇచ్చారు. మిగిలిన 4 కంపెనీలకు అనుమతి ఇవ్వలేదు. దీంతో వీటి అమ్మకాల్లో ఆ మూడు కంపెనీలదే ఇష్టారాజ్యంగా మారింది. అధిక ధరలపై రాష్ట్ర లారీ యజమానుల సంఘం ఆందోళనకు సిద్ధమైంది. ఏఆర్‌ఐ దగ్గర అనుమతి పొందిన అన్ని సంస్థలకు విక్రయానికి అనుమతి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో లారీలకు ఈ పరికరాల ఏర్పాటుకు నెల రోజులపాటు మినహాయింపు ఇచ్చారు. తరువాతైనా తమపై భారం పడుతుంది కాబట్టి, తక్షణం దీనిపై నిర్ణయం తీసుకోవాలని సంఘం అధ్యక్షుడు భాస్కరరెడ్డి డిమాండ్‌ చేశారు.

ఈ వ్యవహారంపై డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌ పాపారావును ‘ఈనాడు’ వివరణ కోరగా 37 సంస్థలకు అనుమతి ఇస్తే పరికరాల నాణ్యత ఉండదన్న ఉద్దేశంతో మొదటి దశలో మూడు కంపెనీలకే అనుమతి ఇచ్చామని చెప్పారు. బ్యాంకు గ్యారంటీ ఇచ్చిన మరికొన్ని సంస్థలకు అనుమతి ఇచ్చే యోచన ఉందన్నారు. రాష్ట్రంలో రేట్లు మరీ అధికంగా ఏమీ లేవని అన్నారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.