close

తాజా వార్తలు

చర్చలపై ఉత్కంఠ

వెంటనే జరపాల్సిందేనన్న హైకోర్టు
స్పష్టత ఇవ్వని ప్రభుత్వం
తీర్పు ప్రతి వచ్చేదాకా వేచిచూసే ధోరణి!
నేడు ఆర్టీసీ కార్మిక సంఘాల రాష్ట్ర బంద్‌
పార్టీల మద్దతు, ఉద్యోగ సంఘాల సంఘీభావం
పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం

‘‘ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించాలి. తండ్రి పాత్ర పోషించి పిల్లల డిమాండ్లను పరిష్కరించడానికి ప్రయత్నించాలి. సమస్యలను అలాగే ఉంచడం సరికాదు. ఆర్టీసీకి ఎండీ నియామకం చేపట్టి ఉద్యోగుల్లో కనీస విశ్వాసాన్ని ప్రోది చేసి ఉండాల్సింది. వారి డిమాండ్లు సగానికి పైగా న్యాయమైనవి. ఆర్థికంగా ఎలాంటి భారం కానివి. రెండు వారాలుగా జరుగుతున్న కార్మికుల సమ్మెను నియంత్రించలేకపోయారు. ఇక అన్ని ఉద్యోగ సంఘాలు ఏకమైతే పరిస్థితి ఏమిటి? పౌరసమాజం గొంతు విప్పడం ప్రారంభిస్తే ఎవరూ అడ్డుకోలేరు. ప్రజాగ్రహం, ఇబ్బందులను ఆధారంగా చేసుకునే సానుకూల దృక్పథంతో చొరవ తీసుకోవాలని మేం సూచించినా ఫలితం లేకపోయింది’

- ప్రభుత్వాన్ని ఉద్దేశించి హైకోర్టు

ర్టీసీ కార్మిక సంఘాలతో చర్చలపై ఉత్కంఠ ఏర్పడింది. సమ్మె చేస్తున్న కార్మిక సంఘాలను వెంటనే చర్చలకు పిలవాలని హైకోర్టు శుక్రవారం సూచించింది. ఈ తీర్పు ప్రతి అందేవరకు వేచి చూడాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇంకోవైపు శనివారం రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేయడానికి కార్మిక సంఘాలు సమాయత్తమయ్యాయి. ఆర్టీసీకి రెగ్యులర్‌ ఎండీని నియమించని ప్రభుత్వ వైఖరి పట్ల హైకోర్టు అసంతృప్తి వ్యక్తంచేసింది. కార్మికులకు జీతాలు పెంచితే ఆర్టీసీ మరింత కుదేలవుతుందని కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో ఆర్టీసీ యాజమాన్యం స్పష్టీకరించింది. ఇదిలాఉండగా.. శుక్రవారం రాత్రి ముఖ్యమంత్రి నేతృత్వంలో ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. శనివారం నాటి బంద్‌ సందర్భంగా బస్సుల నిర్వహణ, చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్ల గురించి ఎక్కువగా చర్చించారు. బంద్‌ ప్రభావం కనిపించనివ్వొద్దని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు తెలిసింది. సంఘాలతో చర్చలపై మాత్రం ఎలాంటి ప్రకటనా చేయలేదు. తీర్పు కాపీ అందాకే చర్చలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఆర్టీసీ ఐకాస బంద్‌ పిలుపునకు వివిధ రాజకీయ పక్షాలు, ట్రేడ్‌ యూనియన్లు సంపూర్ణ మద్దతు తెలిపాయి. ఎన్జీవోలు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, ఆటో యూనియన్ల వారు, ప్రైవేటు డ్రైవర్లు సంఘీభావం ప్రకటించారు. బంద్‌కు సన్నాహకంగా ఆర్టీసీ ఐకాస శుక్రవారం పెద్దఎత్తున ద్విచక్ర వాహన ర్యాలీలు నిర్వహించింది. సీపీఐ, సీపీఎం, భాజపా, కాంగ్రెస్‌, తెలుగుదేశం శ్రేణులు ఈ ర్యాలీల్లో పాల్గొన్నాయి. ఒకవేళ ప్రభుత్వం చర్చలకు పిలిచినా.. సమ్మె, బంద్‌ యథావిధిగా జరుగుతాయని ఆర్టీసీ ఐకాస కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి ప్రకటించారు. ఆర్టీసీ సమ్మె విషయంలో జోక్యం చేసుకోవాలని జాతీయ మానవహక్కుల సంఘానికి సీపీఐ విజ్ఞప్తి చేసింది.


చర్చలకు పిలవండి: హైకోర్టు
తదుపరి విచారణ 28కి వాయిదా

ఈనాడు, హైదరాబాద్‌: ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ఆర్టీసీ జేఏసీ, మజ్దూర్‌ యూనియన్లను వెంటనే చర్చలకు పిలవాలని ఆర్టీసీ ఇన్‌ఛార్జి మేనేజింగ్‌ డైరెక్టర్‌కు హైకోర్టు సూచించింది. సమస్యలపై చర్చించి ఈనెల 28న ఓ సానుకూల పరిష్కార మార్గంతో రావాలని సూచించింది. ఆర్టీసీ సమస్యల పరిష్కారానికి రెగ్యులర్‌ ఎండీని నియమించడానికి చర్యలు చేపట్టని ప్రభుత్వ తీరుపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఉద్యోగుల సంక్షేమం ప్రభుత్వ బాధ్యత అని, దీనికి సంబంధించిన డిమాండ్‌నూ పట్టించుకోకపోవడం తగదని పేర్కొంది. ఆర్టీసీ సమ్మెను చట్టవిరుద్ధమని ప్రకటించాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంతో పాటు ఇతర పిటిషన్‌లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.చౌహాన్‌, జస్టిస్‌ ఎ.అభిషేక్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది.

సమ్మె వ్యవహారంలో ప్రభుత్వం ఏమీ చేయలేని పరిస్థితిలో ఉందని అదనపు అడ్వొకేట్‌ జనరల్‌(ఏఏజీ) జె.రామచంద్రరావు చెప్పగా ఎండీని ఎందుకు నియమించలేకపోయారని ధర్మాసనం ప్రశ్నించింది. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో కొత్త ఎండీని నియమిస్తే ఇబ్బందులు తలెత్తుతాయని ఏఏజీ చెప్పారు. కొత్త ఎండీని నియమించినా.. సమస్యల పరిష్కారంలో సహకరించాలని ఇన్‌ఛార్జి ఎండీకి సూచించవచ్చని, డిమాండ్ల పరిష్కారంలో ప్రభుత్వ సదుద్దేశాన్ని ప్రకటించాల్సి ఉందని ధర్మాసనం పేర్కొంది. ఎండీని నియమించాలని విజ్ఞప్తి చేసినా ఎందుకు పట్టించుకోలేదని, ఎండీ జీతం మీ జేబుల్లోంచి ఇవ్వడంలేదు కదా అని వ్యాఖ్యానించింది. ఎండీ నియామకం ద్వారా వారి అసంతృప్తికి కొంతైనా ఉపశమనం లభించినట్లు ఉండేదని, అవేవీ చేయకుండా ఖాళీగా వస్తే ఎలా అని ప్రశ్నించింది. ప్రభుత్వం, యూనియన్‌లు పంతాలకు పోతున్నాయి.. అధికారంలో ఉన్న ప్రభుత్వం అందరికీ ఆమోదయోగ్యంగా తండ్రిలా  వ్యవహరించాలి. పిల్లలు కోరే డిమాండ్లను పరిష్కరించే దిశగా ప్రభుత్వం ఉదారత చూపాలి. పూర్తి స్థాయి ఎండీని నియమించి ఉంటే.. ఈ సమస్యను ఆయనే పరిష్కరించేవారు. మీరు చెబుతున్న ఇన్‌ఛార్జి ఎండీ సమర్థంగా వ్యవహరించి ఉంటే ఈ పరిస్థితి తలెత్తేది కాదు.. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, ఏజెన్సీ ప్రాంతాల్లో ఆస్పత్రులకు వెళ్లలేకపోతున్నారు, పాఠశాలల సెలవులను పొడిగించడం ద్వారా సమస్యను పరిష్కరించలేమని మీరు అంగీకరించినట్లు ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
ఏఏజీ జోక్యం చేసుకుంటూ 87 శాతం బస్సులను నడుపుతున్నామని, ఈనెల 21 నుంచి విద్యాసంస్థలు కూడా ప్రారంభమవుతున్నాయని చెప్పారు. ఒకవేళ 110 శాతం మంది కొత్త ఉద్యోగులను నియమించారనుకుంటే పాత ఉద్యోగుల పరిస్థితి ఏమిటని హైకోర్టు ప్రశ్నించగా ఏఏజీ జోక్యం చేసుకుంటూ లేబర్‌ కోర్టు చూసుకుంటుందని చెప్పారు. సమస్యలను కార్పెట్‌ కింద దాచిపెట్టడం సరికాదని, ఒకప్పుడు అది ఏదో దశలో వికటించవచ్చంది. లేబర్‌ కోర్టు వారికి అనుకూలంగా తీర్పు వెలువరిస్తే పరిస్థితి ఏమిటని ప్రశ్నించింది. అప్పుడైనా డిమాండ్లను పరిష్కరించాల్సిందే కదా అంది. ప్రభుత్వంతో పాటు దానితో సంబంధమున్న ఆర్టీసీ సంస్థ రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాల్సిందేనంది. ఆర్థిక పరిస్థితి బాగోలేదని ఏఏజీ చెప్పగా.. సొమ్ము వృథా చేస్తున్నట్లు తమ ముందు చాలా పిటిషన్‌లు ఉన్నాయని పేర్కొంది. ఏఏజీ సమాధానమిస్తూ తాను ఆర్టీసీ తరఫున చెబుతున్నానని పేర్కొన్నారు.

ఉద్యోగుల సంక్షేమం పట్టదా?
యూనియన్‌ల డిమాండ్లను పరిశీలించిన ధర్మాసనం ఇందులో పేర్కొన్న 42లో సగానికి పైగా పరిష్కరించదగ్గవేనని, అంతేకాకుండా వీటికి ఆర్థిక అంశాలతో సంబంధంలేదని పేర్కొంది. కరీంనగర్‌, హైదరాబాద్‌ జోన్‌లకు ఈడీలను నియమించాలని, ఉద్యోగ భద్రతకు సంబంధించి ఏర్పాటు చేసిన కమిటీ సమావేశం నిర్వహించి మార్గదర్శకాలను రూపొందించాలన్నవి ఎందుకు చేయలేదని ప్రశ్నించింది. తార్నాక ఆస్పత్రిలో మందుల కొరత తీర్చాలని.. కార్మికులకు అయిన వైద్య ఖర్చులను తిరిగి చెల్లించాలని, అనారోగ్యంతో ఉన్నవారు తమ పీఎఫ్‌ సొమ్మును తీసుకునే వెసులుబాటు ఇవ్వాలని.. పదవీ విరమణ చేసినవారికి ఆరోగ్యశ్రీ కల్పించాలని, ఆసరా పింఛన్లు ఇవ్వాలని, పిల్లలకు ఐటీఐల్లో, కార్మికులు నైపుణ్యం పెంచుకోవడానికి శిక్షణ ఇవ్వాలని, సర్వీసు స్థితిగతులను పెంచాలని అడగడంలో తప్పేముందని వ్యాఖ్యానించింది. జంషెడ్‌పూర్‌లోని టాటా సంస్థ ఉద్యోగులకు ఇస్తున్న సౌకర్యాలు, ఇంతటి ప్రభుత్వానికి అది సాధ్యం కాదా అంది.

విలీనాన్ని ముడి పెట్టలేదు
ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం అన్నది వారి ప్రధాన డిమాండ్‌ అని.. అది సాధ్యం కాదని ఏఏజీ చెప్పారు. దీనిపై యూనియన్‌ల తరఫు సీనియర్‌ న్యాయవాది డి.ప్రకాశ్‌రెడ్డి స్పందిస్తూ విలీనం చేయాలన్న తమ డిమాండ్‌ను ఉపసంహరించుకోబోమని, అయితే ఇతర డిమాండ్ల పరిష్కారానికి దీంతో ముడిపెట్టలేదని చెప్పారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో చర్చల గురించి ఏజీ, ఏఏజీకి ఫోన్‌లు చేసినా స్పందన లేదన్నారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది పి.వి.కృష్ణయ్య స్పందిస్తూ సమ్మెను చట్టవిరుద్ధంగా ప్రకటించాలని, సమ్మెను విరమించేలా ఆదేశించాలని కోరగా ధర్మాసనం నిరాకరిస్తూ అమలుకాని అలాంటి ఆదేశాలను ఇవ్వజాలమంది. యూనియన్‌, జేఏసీ ప్రతినిధులను చర్చలకు పిలిచి ఓ సానుకూల పరిష్కారంతో రావాలని ఆర్టీసీ ఇన్‌ఛార్జి ఎండీకి హైకోర్టు సూచిస్తూ.. విచారణను ఈనెల 28వ తేదీకి వాయిదా వేసింది.

ప్రజాగ్రహం మొదలైతే అడ్డుకోలేరు
ఈనెల 19న బంద్‌కు సంఘాలు పిలుపునిచ్చినట్లుందని, వీటితోపాటు క్యాబ్‌లు, ఇతర ఎన్జీవో సంఘాలు కూడా బంద్‌కు చేస్తామంటున్నట్లు కథనాలు చూశామని ధర్మాసనం పేర్కొనగా యూనియన్‌లు రాజకీయాలు చేస్తున్నాయని, వాటిని ప్రభుత్వం చూసుకుంటుందని చెప్పారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ గత రెండు వారాలుగా ఆర్టీసీ చేస్తున్న సమ్మెనే నియంత్రించలేకపోయారు.. అన్ని సంఘాలూ ఏకమైతే పరిస్థితి ఏమిటని ప్రశ్నించింది. దీనిపై పౌరసమాజం స్పందించి ప్రజాగ్రహంగా మారితే అడ్డుకోలేరంది. నిరసన జ్వాలలు మొదలయ్యాయని, అవి మరింత రాజుకోకుండా చూడాలంది. ఈ కోర్టు కూడా ప్రజలఇబ్బందులను దృష్టిలో ఉంచుకునే సానుకూలంగా స్పందించాలని చెప్పినప్పటికీ ఫలితం లేకపోయిందని వ్యాఖ్యానించింది.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.