close

ప్రధానాంశాలు

కొత్త పాలన.. కావాలి లాలన!

సమస్యలతో సతమతమవుతున్న మున్సిపాలిటీలు
పంచాయతీల నుంచి ఉన్నతి  పొందిన వాటిలో మరిన్ని ఇబ్బందులు
కొత్త పాలక వర్గాల చేతిలోనే పట్టణాల భవిష్యత్తు
ఈనాడు - హైదరాబాద్‌

కంకర తేలిన రోడ్లు.. మురికి కాలువలు.. పందుల సంచారం.. దోమల బెడద.. ప్రణాళిక లేమి.. పంచాయతీల నుంచి పురపాలికలుగా మారిన పట్టణాల్లోని పరిస్థితిదీ. మున్సిపాలిటీగా మారితే మౌలిక సదుపాయాలు లభిస్తాయని, వేగంగా అభివృద్ధి జరుగుతుందని భావించినా.. అవి సమస్యలతో సతమతమవుతూనే ఉన్నాయి. ఇటీవల ఎన్నికలతో కొత్తగా పాలక మండళ్లు ఏర్పాటయ్యాయి. 120 మున్సిపాలిటీలు, 10 నగర పాలికల్లో కొత్త పాలనకు అవకాశం వచ్చింది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా పంచాయతీల నుంచి పురపాలికలుగా మారిన చోట్ల వినూత్న విధానాలు అమలుచేయాల్సిన అవసరముంది. రంగారెడ్డి, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి జిల్లాల్లోని కొన్ని మున్సిపాలిటీలను ‘ఈనాడు’ పరిశీలించగా.. పలు సమస్యలు కనిపించాయి.

రాష్ట్రంలో 15 వేల జనాభా కలిగిన గ్రామాలు పురపాలికలయ్యాయి. వ్యవసాయమే ప్రధాన ఉపాధిగా ఉన్న కొన్ని గ్రామాలు వాటిలో విలీనమయ్యాయి. అయితే, ప్రత్యేక అధికారులు, ఇన్‌ఛార్జి కమిషనర్లకు ఇతర బాధ్యతల భారంతో పాలనను పట్టించుకోలేదు. తాగునీటి సరఫరా, కొంత మేర పారిశుద్ధ్య పనులు మినహా మిగతా ఏమీ జరగలేదు. పట్టణాల చుట్టూ అక్రమ లేఅవుట్లు పుట్టగొడుగుల్లా వెలిశాయి. పేరుకు మున్సిపాలిటీలైనా ఆన్‌లైన్లో పురసేవలు అందని పరిస్థితి నెలకొంది.

ఆమనగల్లు.. పైసల్లేవు.. పనుల్లేవు
రాజధాని సమీపాన ఉన్న ఆమనగల్లు పంచాయతీ ఏడాదిన్నర క్రితం మున్సిపాలిటీగా మారినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క అభివృద్ధి పనీ జరగలేదు. దాదాపు 27 వేల జనాభా ఉన్న ఈ పట్టణంలో ఇళ్ల ముందు పందుల సంచారం... మురుగునీటి కాలువలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వచ్చే రూ.60 లక్షల ఆదాయం వేతనాలు, వీధిదీపాల నిర్వహణకే సరిపోతోంది.

కల్వకుర్తి.. విలీన కష్టాలు
కల్వకుర్తి మున్సిపాలిటీలో ఏడాదిన్నర క్రితం తిమ్మరాస్‌పల్లి గ్రామం విలీనమైంది. ఐదు కి.మీ. దూరంలోని ఈ ఊరికి వ్యవసాయమే ఆధారం. విలీనమైన తర్వాత ఈ గ్రామంలో వీధిదీపాలు తప్ప ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదు. మంచినీటి ట్యాంకు నిర్మాణం సగంలోనే నిలిచియింది. పారిశుద్ధ్యం పడకేసింది. పట్టణంలో ఘన వ్యర్థాల నిర్వహణ, మురుగునీటి వ్యవస్థ అధ్వానంగా మారింది.

నాగర్‌ కర్నూల్‌.. జిల్లా కేంద్రమైనా అంతే
నాగర్‌కర్నూల్‌ మూడేళ్ల క్రితం జిల్లా కేంద్రమైంది. మున్సిపాలిటీగా ఆవిర్భవించింది. అయినా ఈ పట్టణ అభివృద్ధిలో పెద్దగా మార్పులేమీ జరగలేదు. రోడ్ల విస్తరణ, మౌలిక సదుపాయాలు అంతంతే. మున్సిపాలిటీకి వచ్చే ఆదాయం నిర్వహణకే సరిపోతోంది. ప్రభుత్వమిచ్చే గ్రాంట్లతోనే అభివృద్ధి పనులు చేయాల్సి వస్తోంది. ప్రస్తుతం భూగర్భ డ్రైనేజీ పనులు జరుగుతున్నాయి. తవ్విన రోడ్లను అలాగే వదిలేయడంతో ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదు. ఈ పట్టణ ఆదాయం ఏడాదికి రూ.2 కోట్లు ఉంటే... ఇప్పటి వరకు చెల్లించాల్సిన విద్యుత్తు బకాయిలు రూ.ఏడు కోట్లు ఉండటం గమనార్హం.

కొత్తకోట.. బోర్డు మాత్రమే మారింది
కొత్తకోట పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా మారింది. ప్రస్తుతం పంచాయతీ సిబ్బందే విధులు నిర్వహిస్తున్నారు. మున్సిపాలిటీ బోర్డు మాత్రమే కొత్తగా వచ్చింది. దాదాపు 19 వేల జనాభా కలిగిన పట్టణంలో రోడ్లు, డ్రైనేజీ ప్రధాన సమస్యలు. మూడురోజులకోసారి తాగునీటి సరఫరా జరుగుతోంది. మిషన్‌ భగీరథ పనులు పూర్తికాలేదు. విస్తరణలో వెలిసిన కాలనీల్లో మౌలిక సదుపాయాల్లేవు. ఏడాదికి వచ్చే రూ.కోటి ఆదాయం నిర్వహణ ఖర్చులకే సరిపోతోంది.


ప్రస్తుత పరిస్థితి ఇలా..

* 25% ఐదేళ్లలో అమృత్‌  పట్టణాల్లోని పార్కుల్లో మౌలిక సదుపాయాల పనుల పురోగతి
* 62% తొలగించాల్సిన ఆక్రమణలు
* 72% పరిరక్షించాల్సిన ఖాళీ స్థలాలు
* 40% నిర్మాణ అనుమతుల దరఖాస్తుల పెండింగ్‌
* 25% పరిష్కారంకాని లేఅవుట్ల క్రమబద్ధీకరణ అర్జీలు
* 42% శ్మశాన వాటికల కొరత


పెబ్బేరు.. పైసలున్నా.. పనుల్లేవు

జాతీయ రహదారి పక్కనే ఉన్న పెబ్బేరు మున్సిపాలిటీలో 20 వేల జనాభా ఉంది. పశువుల సంత ఆదాయమే ఏడాదికి రూ.3 కోట్లు వస్తోంది. ఇక పన్నుల రూపంలో మరో రూ.50 లక్షలు వస్తున్నాయి. నిర్వహణ ఖర్చులు తీసివేయగా రూ.2 కోట్ల వరకు ఆదాయం మిగిలే అవకాశముంది. తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, వీధిదీపాల నిర్వహణకే నిధులు ఖర్చుచేస్తున్నారు. మిషన్‌ భగీరథ నీళ్లు అందుబాటులో ఉన్నప్పటికీ... పంచాయతీ ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్ల నీటినే వాడుతున్నారు. అభివృద్ధి పనులు చేపడితేనే మౌలిక సదుపాయాలు అందుతాయి.


మున్సిపాలిటీల్లో ప్రధాన సమస్యలివీ..

* రోడ్డుకు ఇరువైపులా ఫుట్‌పాత్‌ల కొరత.. ఉన్నవాటి ఆక్రమణ
* పారిశుద్ధ్య నిర్వహణలో లోపాలు, రోడ్డుపైనే మట్టి, చెత్త
* వరద నీటి ప్రవాహ ప్రమాణాల మేరకు రోడ్ల నిర్మాణం లేకపోవడం
* అనుమతి లేని తవ్వకాలు, భవన నిర్మాణాలు, లే అవుట్లు
* ఏళ్లు గడుస్తున్నా పక్కా భూగర్భ డ్రైనేజీ లేకపోవడం
* బహిరంగ మల, మూత్ర విసర్జన నిషేధం అమలు, ప్రజామరుగుదొడ్ల నిర్మాణం
* ఆస్తి పన్నుల బకాయిలు
* ఘనవ్యర్థాల సమీకరణ, నిర్వహణకు మౌలిక సదుపాయాల కొరత


ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.