close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కరోనా పంజా

ఒక్కరోజే 1213 కేసులు
అత్యధికంగా పరీక్షలు
మరో 8 మంది మృతి
రాష్ట్రంలో పాజిటివ్‌ల శాతం 18.91
వైద్య సిబ్బందికి బీమా వర్తింపు

ఈనాడు,హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా నానాటికీ ఉద్ధృతమవుతోంది. గురువారం ఒక్కరోజే 1213 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ రాష్ట్రంలో ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. ఈనెలలో వరుసగా రెండో రోజు కూడా 1000కి పైగా కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. తాజా ఫలితాల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ(హైదరాబాద్‌) పరిధిలో 998 కేసులున్నాయి. హైదరాబాద్‌ పరిసర జిల్లాలైన మేడ్చల్‌(54), రంగారెడ్డి(48)ల్లోనూ వైరస్‌ వణుకు పుట్టిస్తోంది. ఖమ్మంలోనూ పెద్ద సంఖ్యలో 18 కేసులు నమోదయ్యాయి. మొత్తంగా రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 18,570కి పెరిగింది. గురువారం నాటి ఫలితాల్లో రాష్ట్రంలోని 26 జిల్లాల్లో వైరస్‌ జాడలు కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. స్వీయ జాగ్రత్తలు తీసుకోకపోతే.. మున్ముందు పాజిటివ్‌ కేసుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలున్నాయని వైద్యనిపుణులు చెబుతున్నారు. మహమ్మారి కోరల్లో చిక్కి తాజాగా మరో 8 మంది మృతిచెందారు.. గడిచిన 24 గంటల్లో 5,356 నమూనాలను పరీక్షించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ ఒక్కరోజులో పరీక్షించిన నమూనాల్లో ఇదే అత్యధికం. తాజా ఫలితాల వరకూ పరిశీలిస్తే.. 22.64 శాతం పాజిటివ్‌ కేసులు నమోదైనట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకూ మొత్తం పరీక్షించిన నమూనాల(98,153)తో మొత్తం పాజిటివ్‌ కేసుల(18,570)ను విశ్లేషిస్తే.. రాష్ట్రంలో పాజిటివ్‌ల శాతం 18.91. పరీక్షించినవారిలో 79,583 మందిలో వైరస్‌ లేదని నిర్ధారణ అయింది.
ఇంటర్‌బోర్డులో మరో అయిదుగురికి
ఇంటర్‌బోర్డులో కొత్తగా మరో అయిదుగురు ఉద్యోగులకు పాజిటివ్‌ నిర్ధారణ అయింది. వారిలో ఒకరు సంయుక్త కార్యదర్శి కూడా ఉన్నారు. అంతకు ముందు 12 మంది ఈ వైరస్‌ బారినపడ్డారు. మొత్తం బాధితుల సంఖ్య 17కి చేరింది. ఇంటర్‌బోర్డులో మొత్తం 135 మంది ఉద్యోగులున్నారు.
మరో 7 పరీక్ష కేంద్రాలకు అనుమతి
రాష్ట్రంలో కరోనా నిర్ధారణ కోసం మరో 7 ప్రయోగశాలలకు భారతీయ వైద్య పరిశోదన మండలి(ఐసీఎంఆర్‌) తాజాగా అనుమతులిచ్చింది. ప్రభుత్వ వైద్యంలో ఇంతకుముందు 10 ఉండగా మరో 4, ప్రైవేటు వైద్యంలో 18 ఉండగా మరో 3 కొత్త పరీక్ష కేంద్రాలకు అనుమతించడంతో రాష్ట్రంలో మొత్తం కరోనా నిర్ధారణ పరీక్ష కేంద్రాల సంఖ్య 35కు పెరిగింది. తాజాగా అనుమతించిన వాటిలో ప్రభుత్వ వైద్యంలో ఆర్‌టీ పీసీఆర్‌ విధానంలో సికింద్రాబాద్‌లోని రైల్వే ఆసుపత్రికి, సీబీ నాట్‌ పరికరం ద్వారా పరీక్షలు నిర్వహించేందుకు నిజామాబాద్‌, సూర్యాపేట, గద్వాల ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొవిడ్‌ పరీక్షలకు మార్గం సుగమమైంది. ఇక ప్రైవేటు వైద్యంలో ఆర్‌టీ-పీసీఆర్‌ విధానంలో కరీంనగర్‌లోని చెల్మడ ఆనందరావు వైద్యకళాశాల అనుబంధ ఆసుపత్రికి, మౌలాలీలోని కామినేని ఆసుపత్రికి చెందిన డయాగ్నొస్టిక్‌ ల్యాబొరేటరీ సర్వీసెస్‌కు, సీబీ నాట్‌ విధానంలో హైదరాబాద్‌ లక్డీకాపూల్‌లోని గ్లెనిగల్స్‌ గ్లోబల్‌ ఆసుపత్రికి అనుమతి లభించింది. జిల్లాలోని ఆసుపత్రులకూ నిర్ధారణ పరీక్షలకు ఐసీఎంఆర్‌ పచ్చజెండా ఊపడంతో ఇక ఆయా ఆసుపత్రుల్లో పరీక్షలకు వైద్యఆరోగ్యశాఖ సన్నద్ధమవుతోంది.
కేంద్రబీమా పథకం రాష్ట్రంలోనూ ..
కరోనా సేవల్లో పాల్గొంటున్న అన్ని స్థాయుల వైద్య సిబ్బందికి వర్తింపజేసేలా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బీమా పథకాన్ని రాష్ట్రంలోనూ అమలు చేసేందుకు వైద్యఆరోగ్యశాఖ సన్నద్ధమైంది. వైద్యులు, నర్సులు, పారామెడికల్‌, నాలుగో తరగతి సిబ్బంది..తదితర అన్ని విభాగాలకు చెందిన ప్రభుత్వ, ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగులందరికీ ఈ బీమా పథకాన్ని వర్తింపజేయనున్నారు. బోధనాసుపత్రుల్లో కరోనా వార్డుల్లో, ఐసీయూల్లో పనిచేస్తున్న ఆయా విభాగాలకు చెందిన సిబ్బంది సమగ్ర సమాచారాన్ని ఫోన్‌ నంబరుతో పాటు తక్షణమే పంపించాలని వైద్యవిద్య సంచాలకులు డాక్టర్‌ రమేశ్‌రెడ్డి అన్ని ఆసుపత్రుల సూపరింటెండెంట్లకూ ఆదేశాలు జారీచేశారు. కొవిడ్‌తో ఇటీవల నర్సు మృతిచెందిన నేపథ్యంలో.. ఈ విషయాన్ని అత్యవసరంగా పరిగణనలోకి తీసుకొని వెంటనే సమాచారాన్ని అందజేయాలని సూచించారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.