close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామం

కరోనా సమయంలోనూ అద్భుత అవకాశాలు
అన్ని విధాలా అండగా ప్రభుత్వం
యూఎస్‌ఐబీసీ పెట్టుబడుల సదస్సులో మంత్రి కేటీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టడానికి తెలంగాణ స్వర్గధామమని, ప్రస్తుత కరోనా సంక్షోభంలోనూ ఇక్కడ అద్భుత అవకాశాలున్నాయని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు పేర్కొన్నారు. ప్రభుత్వం పరిశ్రమలకు అండగా నిలుస్తూ పెట్టుబడులకు సంపూర్ణ భరోసా కల్పిస్తోందని తెలిపారు. గురువారం దృశ్యమాధ్యమంలో జరిగిన అమెరికా-భారత్‌ వాణిజ్య మండలి (యూఎస్‌ఐబీసీ) అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సులో ఆయన ప్రగతి భవన్‌ నుంచి పాల్గొని మాట్లాడారు. ప్రస్తుతం అమెరికా వంటి అగ్రరాజ్యాలు సైతం ఇక్కడి కంపెనీలు ఉత్పత్తి చేసే కరోనా మందులపై ఆధారపడుతున్నాయని, ఐటీ సంస్థలు అమెరికా తర్వాత అతిపెద్ద ప్రాంగణాలను హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేశాయని గుర్తు చేశారు. దేశంలో పెట్టుబడులకు ముందుకొచ్చే విదేశీ సంస్థలు భారత్‌ను ఒక యూనిట్‌గా కాకుండా తెలంగాణలాంటి ప్రగతిశీల రాష్ట్రాలను  యూనిట్‌గా తీసుకోవాలని ఆయన కోరారు. ‘‘తెలంగాణ దేశంలోని అనేక రాష్ట్రాలను అధిగమిస్తూ  పెట్టుబడులను ఆకర్షిస్తోంది. సరళతర వ్యాపార నిర్వహణలో రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. పారిశ్రామిక అనుమతులు, స్వీయ ధ్రువీకరణ విధానం (టీఎస్‌ఐపాస్‌) విజయవంతంగా కొనసాగుతోంది.  అనుమతులు పొందిన కొత్త పరిశ్రమల్లో  80 శాతానికి పైగా కార్యకలాపాలను ప్రారంభించాయి. ఔషధ, జీవశాస్త్రాలు, ఐటీ, జౌళి, వైమానిక, రక్షణ వంటి 14 ప్రాధాన్య రంగాలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి, పెట్టుబడులను పెద్దఎత్తున సమీకరిస్తోంది.’’ అని తెలిపారు.
 అమెరికా ప్రతినిధుల అభినందనలు
దృశ్యమాధ్యమ సదస్సులో పాల్గొన్న అమెరికా ప్రతినిధులు.. తెలంగాణ పారిశ్రామిక విధానం, టీఎస్‌ఐపాస్‌లను అభినందించారు. యూఎస్‌ఐబీసీ అధ్యక్షురాలు నిషా బిస్వాల్‌ మాట్లాడుతూ తెలంగాణకు పెట్టుబడులు తీసుకువచ్చేందుకు సంపూర్ణ సహకారం  అందిస్తామని తెలిపారు. పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌, అమెరికాకు చెందిన ఔషధ, సాంకేతిక, తయారీ, ఆహారశుద్ధి, విద్యుత్‌, చిల్లర వర్తక రంగాల నిపుణులు ఇందులో పాల్గొన్నారు.
ఫెన్సింగ్‌ క్రీడను ప్రోత్సహించాలి
ఫెన్సింగ్‌ క్రీడను రాష్ట్రంలో ప్రోత్సహించాలని ఆ క్రీడా సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గ తెరాస ఇన్‌ఛార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డి కోరారు. గురువారం ఆయన మంత్రి కేటీఆర్‌ను ప్రగతిభవన్‌లో కలిసి ఈమేరకు వినతిపత్రం అందజేశారు.
గ్రానైట్‌ పరిశ్రమను ఆదుకోవాలి
నష్టాల్లో ఉన్న గ్రానైట్‌ పరిశ్రమను ఆదుకోవాలని, సమస్యలను పరిష్కరించాలని తెరాస లోక్‌సభాపక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర్‌రావు, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ప్రభుత్వాన్ని కోరారు. గురువారం ప్రగతిభవన్‌లో రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ను కలిసి ఈమేరకు వినతి పత్రం సమర్పించారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.