close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
తెలుగు ఐఐటియన్ల గమనమెటు?

తెలుగు రాష్ట్రాల విద్యార్థుల్లో అత్యధికుల గమనం ఇంజినీరింగ్‌ వైపే. ఐఐటీల్లో సీట్లు పొందే ప్రతి ఆరేడుగురిలో ఒకరు తెలుగు విద్యార్థే.. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మొదటి వంద మంది ర్యాంకర్లలో నాలుగో వంతు ఏపీ, తెలంగాణల వారే.. దేశంలోనే ఉన్నత విద్యాసంస్థలుగా పేరొందిన ఐఐటీల్లో సీట్ల కోసం ఏళ్ల తరబడి శ్రమిస్తూ మంచి ర్యాంకులను అందుకుంటున్న మనవాళ్లు చదువు పూర్తయ్యాక ఏం చేస్తున్నారు? ఏ రంగంలో ఎక్కువగా స్థిరపడుతున్నారు? వారి భావి ప్రణాళికలు.. ఎంచుకున్న మార్గాలేంటి?.. తదితర అంశాలపై ‘ఈనాడు’ అందిస్తున్న ప్రత్యేక కథనం... 

ప్రగతి శిఖరాలు.. ఐఐటీ టాపర్లు..!

77 శాతం మంది కార్పొరేట్‌ కొలువుల్లోనే
10 శాతం ఐఐటియన్ల గమ్యస్థానం గూగుల్‌
మొదటి ర్యాంకర్లు మాత్రం పరిశోధన దిశగా
జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఉత్తమ ర్యాంకర్ల ప్రస్థానమిది

దేశవ్యాప్తంగా 23 ఐఐటీల్లో బీటెక్‌ పూర్తిచేస్తున్న వారిలో ఎక్కువ మంది ఉత్తమ ప్యాకేజీలతో బహుళజాతి కంపెనీల్లో ఉద్యోగాలు పొందుతున్నారు. ఇంకొందరు ఐఐటీలతో పాటు అమెరికా లాంటి దేశాల్లో బోధన, పరిశోధన రంగాల్లో స్థిరపడుతున్నారు. మరికొందరు కొన్నాళ్లు కొలువుల్లో కొనసాగినా తర్వాత సివిల్స్‌ వైపు మొగ్గు చూపుతున్నారు. ఉదాహరణకు 2011 అడ్వాన్స్‌డ్‌ ప్రథమ ర్యాంకర్‌, ఏపీకి చెందిన పృథ్వీతేజ్‌.. 2017లో సివిల్స్‌లో 24వ ర్యాంకు సాధించారు.. ప్రస్తుతం కడప జిల్లా సబ్‌ కలెక్టర్‌గా ఉన్నారు. 2014-15లో ఐఐటీ చెన్నైలో చేరి, ఇంజినీరింగ్‌ పూర్తిచేసిన ఏపీకే చెందిన కౌశిక్‌, వంశీధర్‌లు సివిల్స్‌కు సన్నద్ధమవుతున్నారు. అనేక మంది మెకానికల్‌, ఎలక్ట్రికల్‌ తదితర బ్రాంచీల్లో బీటెక్‌ పూర్తిచేసినా చివరకు సాఫ్ట్‌వేర్‌లోనే పనిచేస్తున్నారు. తన సివిల్‌ సర్వీసెస్‌ బ్యాచ్‌లో సగం మందికిపైగా ఇంజినీరింగ్‌.. అందులోనూ ఐఐటీల్లోనే చదివిన వారున్నారని పృథ్వీతేజ్‌ చెప్పారు.

గూగులమ్మ గూటికే

ఐఐటీల్లో చదివినవారిలో 10 శాతం మంది గూగుల్‌ సంస్థలోనే పనిచేస్తున్నారు. మైక్రోసాఫ్ట్‌లో 4, ఫేస్‌బుక్‌లో 3 శాతం మంది ఉద్యోగాలు చేస్తున్నారు. బెంగళూరుకు చెందిన ఎక్స్‌ఫీనో సంస్థ నిర్వహించిన తాజా అధ్యయనంలో వెల్లడైన విషయమిది. గోల్డ్‌మన్‌ సాచే, మోర్గన్‌ స్టాన్లీ, ఒరాకిల్‌, అడోబ్‌, ఇంటెల్‌, ఉబర్‌ తదితర కంపెనీల్లోనూ ఐఐటీయన్లు పెద్దసంఖ్యలో ఉన్నారు. మొత్తంగా ఐఐటీయన్లలో 77 శాతం మంది కార్పొరేట్‌ కంపెనీల్లోనే పనిచేస్తున్నారు. మరో 14 శాతం ఆచార్యులుగా, 9 శాతం మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా మారారు. అయితే ఐఐటీల్లో చేరినవారిలో 56 శాతం మంది బీటెక్‌తోనే చదువు ఆపేయగా.. 18 శాతం మంది ఎంఎస్‌ చదివారు. ఎంఎస్‌ చదివిన ప్రతి పదిమంది ఐఐటీయన్లలో తొమ్మిది మంది ఆ ఉన్నతవిద్యను విదేశాల్లోనే పూర్తిచేశారు.

‘తెలుగు’ టాప్‌ ర్యాంకర్లు ఏంచేస్తున్నారు?

దేశంలో 2000 నుంచి 2020 వరకు జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ముగ్గురు తెలుగు విద్యార్థులు మొదటి ర్యాంకు పొందారు. వారిలో ఇద్దరు ఇప్పుడు అమెరికా, స్విట్జర్లాండ్‌లలో పీహెచ్‌డీ చేస్తున్నారు. మరొకరు సంయుక్త కలెక్టర్‌గా ఉన్నారు. గత 20 ఏళ్ల వ్యవధికి చెందిన ప్రథమ ర్యాంకర్లలో తొమ్మిది మంది విదేశాల్లో పీహెచ్‌డీ పూర్తిచేశారు..చేస్తున్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ వర్సిటీలైన ఎంఐటీ, ప్రిన్స్‌టన్‌, స్టాన్‌ఫర్డ్‌, కాలిఫోర్నియా విశ్వవిద్యాలయాల్లోే వారు చేరారు.

రూ.90లక్షల కొలువును కాదని.. సివిల్స్‌ వైపు

2011లో అడ్వాన్స్‌డ్‌లో ప్రథమ ర్యాంకర్‌ అయిన ఇమ్మడి పృథ్వీతేజ్‌ ఐఏఎస్‌ సాధించారు. ఈయనది ప.గో.జిల్లా ద్వారకాతిరుమల. ఐఐటీ బాంబేలో కంప్యూటర్‌ సైన్స్‌లో బీటెక్‌ చేశారు. శామ్‌సంగ్‌ సంస్థలో రూ.90లక్షల ప్యాకేజీతో ఉద్యోగానికి ఎంపికయ్యారు. దక్షిణ కొరియాలో ఏడాదిన్నర పనిచేశాక ఉద్యోగాన్ని వీడి, సివిల్స్‌ బాట పట్టారు. ప్రస్తుతం కడప సబ్‌కలెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఐఏఎస్‌ కావాలనే లక్ష్యంతోనే రూ.లక్షల ఉద్యోగాన్ని వదిలేశానన్నారాయన.

కృత్రిమ మేధ శాస్త్రవేత్తగా...

2011లో 8వ ర్యాంకరైన భార్గవ్‌రెడ్డి ప్రస్తుతం ముంబయిలోని క్యూర్‌ కంపెనీలో కృత్రిమ మేధ(ఏఐ) శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఈయన ఐఐటీ బాంబేలో కంప్యూటర్‌సైన్స్‌ పూర్తిచేశారు. రెండేళ్లపాటు దక్షిణకొరియాలో శామ్‌సంగ్‌ కంపెనీలో పనిచేశారు. స్వదేశంలోనే ఉండాలని భావించి వెనక్కి తిరిగివచ్చారు. ప్రపంచవ్యాప్తంగా తమ వద్దకు వచ్చే క్షయ, కొవిడ్‌ తదితర రోగపీడితుల ఛాతీ ఎక్స్‌రేలను ఏఐ ద్వారా విశ్లేషించి ఏమేరకు ఇన్‌ఫెక్షన్‌ సోకిందో చెబుతామన్నారు.

స్విట్జర్లాండ్‌లో పీహెచ్‌డీ చేస్తూ..

2010లో ప్రథమ ర్యాంకర్‌గా నిలిచిన అలుముల జితేందర్‌రెడ్డి వరంగల్‌ వాసి.. ఐఐటీ బాంబేలో బీటెక్‌ ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తయ్యాక ఎస్‌టీహెచ్‌ జురిచ్‌ వర్సిటీ(స్విట్జర్లాండ్‌)లో చేరి పీహెచ్‌డీ చేస్తున్నారు. వరంగల్‌ ఎన్‌ఐటీలో రిజిస్ట్రార్‌గా పనిచేసిన ఏఆర్‌సీరెడ్డి కుమారుడు ఈయన.

స్టాక్‌ మార్కెట్‌ కొలువులో...

2016లో 25వ ర్యాంకు పొందిన సూర్యాపేటకు చెందిన కొల్లు సాత్విక్‌రెడ్డికి 2020 మేలో బీటెక్‌ పూర్తయింది. అనంతరం స్టాక్‌ మార్కెట్‌లో ట్రేడింగ్‌ వ్యవహారాలను అల్గారిథమ్స్‌ ద్వారా విశ్లేషించే గ్రావిటేషన్‌ రీసెర్చ్‌ కంపెనీలో చేరారు. క్వాంటిటేటివ్‌ రీసెర్చర్‌గా పనిచేస్తున్నారు. వార్షిక వేతనం రూ.45 లక్షలుగా చెప్పారు. ఆయన తండ్రి సత్యనారాయణరెడ్డి ప్రభుత్వ ఉపాధ్యాయుడు.

* 2013లో టాప్‌ ర్యాంకర్‌ ప్రకాశం జిల్లా పొదిలికి చెందిన పల్లెర్ల సాయి సందీప్‌రెడ్డి ఐఐటీ బాంబేలో బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ చదివారు. ఏడాదిపాటు బెంగళూరులో మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగం చేశారు. ఆపై పేరొందిన కార్నెగీ మిలన్‌ విశ్వవిద్యాలయం(అమెరికా)లో పీహెచ్‌డీలో చేరారు.

- ఈనాడు, హైదరాబాద్‌, అమరావతి


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు