close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
నిరుద్యోగుల ఆత్మహత్యలకు కేసీఆర్‌దే బాధ్యత

ఏదో ఒక రోజు తెలంగాణకు సీఎం అవుతా: వైయస్‌ షర్మిల
లోటస్‌పాండ్‌కు పాదయాత్రగా వెళ్తుండగా అడ్డుకున్న పోలీసులు
తోపులాటలో స్పృహ తప్పిన షర్మిల
లోటస్‌పాండ్‌లో దీక్ష కొనసాగింపు

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌, కవాడిగూడ, న్యూస్‌టుడే: రాష్ట్రంలో నిరుద్యోగ యువత బలవన్మరణాలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమాధానం చెప్పాలని వైఎస్‌ షర్మిల డిమాండ్‌ చేశారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో చందమామ లాంటి పిల్లలు మరణిస్తున్నారని అన్న కేసీఆర్‌కు తన పాలనలోనే యువకులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే కనిపించడం లేదా అని ప్రశ్నించారు.చనిపోయిన వారి కుటుంబాలకు కేసీఆర్‌  క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఏదో ఒక రోజు తాను తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతానని ఆమె అన్నారు.  నిరుద్యోగుల సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ హైదరాబాద్‌ ఇందిరాపార్కు ధర్నా చౌక్‌ వద్ద గురువారం ఉదయం ‘ఉద్యోగ దీక్ష’ చేపట్టారు. సాయంత్రం 5 గంటలకు సమయం ముగిసిందని, దీక్షాస్థలిని ఖాళీ చేయాలని పోలీసులు కోరగా లోటస్‌పాండ్‌లోనైనా దీక్ష కొనసాగిస్తానంటూ షర్మిల తెలుగుతల్లి ఫ్లైఓవర్‌ మీదుగా కాలినడకన బయలుదేరగా కార్యకర్తలు అనుసరించారు. పాదయాత్రకు అనుమతి లేదంటూ ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. పరిస్థితి అదుపులోకి రాకపోవటంతో పెద్దసంఖ్యలో పోలీసులు రంగంలోకి దిగారు. పెనుగులాటలో షర్మిల దుస్తులు స్వల్పంగా చిరిగాయి. చేతికి గాయమైంది.   కొద్దిసేపు సొమ్మసిల్లారు. అనంతరం ఆమెను పోలీసు వాహనంలోనే లోటస్‌పాండ్‌ వద్దకు చేర్చారు.
అక్కడ కూడా షర్మిల దీక్ష కొనసాగిస్తూ సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తాను 72 గంటల దీక్షకు పూనుకుంటే పోలీసులు భగ్నం చేయడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. తమ కార్యకర్తలను వదిలేవరకు మంచినీళ్లు కూడా ముట్టనని ప్రకటించారు. ఇంకోసారి తనపై చేయిపడితే సహించేది లేదని హెచ్చరించారు. దివంగత వైఎస్‌ వివేకానందరెడ్డి కుమార్తె సునీత లోటస్‌పాండ్‌ దీక్షా శిబిరం వద్ద షర్మిలను పరామర్శించారు. సామాజికవేత్త కంచె ఐలయ్య, బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్యలు సంఘీభావం తెలిపారు. దీక్ష చేపట్టిన షర్మిలను తల్లి విజయమ్మ ఆశీర్వదించి దీక్షా వేదికపై కొద్దిసేపు ఉండి వెళ్లారు.

అమరులకు సంతాపం
ఉదయం ఇందిరాపార్క్‌ దీక్షాస్థలిలో ఏర్పాటు చేసిన తన తండ్రి వైఎస్సార్‌ విగ్రహం వద్ద నివాళులు అర్పించారు. రాష్ట్ర సాధనలో ప్రాణ త్యాగం చేసిన అమరులకు సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్ర సాధనలో ముందు వరుసలో నిలబడి జీవితాలను త్యాగం చేసింది విద్యార్థులు, యువతే అన్నారు. ప్రస్తుతం వారంతా ఉద్యోగాల్లేక పెళ్లిళ్లు చేసుకోలేని దుస్థితిలో ఉన్నారన్నారు. కొందరు నిరాశకు గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు చెప్పారు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న సునీల్‌ నాయక్‌, మహేందర్‌, సంతోష్‌ కుమార్‌ల గురించి ప్రస్తావించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1,91,000 ఉద్యోగాలను భర్తీ చేయాల్సి ఉన్నా.. ప్రభుత్వం పట్టించుకోవట్లేదని షర్మిల విమర్శించారు. ముందు చెప్పినట్టు తాను 72 గంటలపాటు నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించారు.

వారి సంస్కారానికే వదిలేస్తాం: విజయమ్మ
ప్రజల కోసం పోరాడేటప్పుడు భావోద్వేగం ఉంటుంది. అరెస్ట్‌ చేసి తరలిస్తున్న సమయంలో షర్మిల స్పృహ తప్పి పడిపోయారు. తోపులాటలో చేతికి గాయాలయ్యాయి. ఆమెపై ఇలా దాడికి పాల్పడటాన్ని పోలీసుల సంస్కారానికే వదిలేస్తున్నాం



ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు