close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
విద్యుత్తు ఉద్యోగులకూ పెంపు

పదవీ విరమణ వయసు పెంచుతూ ఉత్తర్వులు

ఈనాడు, హైదరాబాద్‌: విద్యుత్తు ఉద్యోగుల పదవీ విరమణ వయసునూ 61 సంవత్సరాలకు పెంచారు. ఈ మేరకు తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకరరావు గురువారం ఉత్తర్వులు జారీచేశారు. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీచేసింది. ఎయిడెడ్‌ సంస్థలు, సొసైటీలు, యూనివర్సిటీలు, కార్పొరేషన్లు, ఇతర సంస్థలు కూడా ఈ దిశగా చర్యలు చేపట్టాలని సూచించింది. మార్చి 30, 2021 నుంచి ఇవి అమలయ్యేలా చూడాలని పేర్కొంది. దీనికి అనుగుణంగా తెలంగాణ విద్యుత్తు సంస్థలు చర్యలు చేపట్టాలని ఇంధనశాఖ సూచించింది.  అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న అనంతరం ఉద్యోగుల పదవీ విరమణ వయసును పెంచుతూ, కేటగిరీల వారీగా నిబంధనలను పొందుపరిచారు. దీని ప్రకారం క్లాస్‌1, 2, 3 ఉద్యోగుల పదవీ విరమణ వయసు ప్రస్తుతం ఉన్న 58 నుంచి 61 ఏళ్లకు పెరుగుతుంది. జనరల్‌ సర్వీస్‌ ఎంప్లాయిస్‌ (క్లాస్‌ 4)కు ప్రస్తుతం ఉన్న 60 సంవత్సరాల నుంచి 61 సంవత్సరాలకు పెంచారు.
*  ఈ ఏడాది మార్చి 30 తర్వాత పదవీ విరమణ చేసిన ఉద్యోగులు, ఈ ఉత్తర్వులు వెలువడిన రెండు రోజుల్లో తిరిగి డ్యూటీకి హాజరుకావాలి.
*  తిరిగి ఉద్యోగంలో చేరుతున్నవారు ఇంతకు ముందు తమకు చెల్లించిన ప్రయోజనాలకు సంబంధించిన మొత్తాన్ని తిరిగి కార్పొరేషన్‌కు చెల్లించాలి. ఇలా చెల్లించడం ఆలస్యమైతే వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.
*  ఉత్తర్వులు మార్చి 30 నుంచి అమలులోకి వస్తాయి.
*  ఈ ఏడాది మార్చి 30కి ముందు పదవీవిరమణ చేసిన ఉద్యోగులకు ఈ ఉత్తర్వులు వర్తించవు. కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులూ ఈ నిబంధనల పరిధిలోకి రారు.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు