Vaccine: త్వరలో కొత్త టీకాలు
close

ప్రధానాంశాలు

Vaccine: త్వరలో కొత్త టీకాలు

ఆగస్టు-డిసెంబరు మధ్య అందుబాటులోకి 216 కోట్ల డోసులు
వచ్చే వారమే విపణిలోకి స్పుత్నిక్‌-వి
జులై నుంచి భారత్‌లో దాని తయారీ ప్రారంభం
నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌ వెల్లడి

ఈనాడు, దిల్లీ: దేశంలో కరోనా టీకాల లభ్యతను పెంచడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించింది. త్వరలోనే కొత్త టీకాలకు అనుమతులు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది ద్వితీయార్ధంలో మొత్తంగా 200 కోట్లకు పైగా డోసులను సముపార్జించుకోనున్నట్లు తెలిపింది.  రష్యాకు చెందిన స్పుత్నిక్‌-వి వ్యాక్సిన్‌ వచ్చే వారమే మన దగ్గర విపణిలో అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నట్లు వెల్లడించింది. ఈ ఏడాది ఆగస్టు-డిసెంబర్‌ మధ్య ఐదు నెలల కాలంలో 216 కోట్ల డోసులు అందుబాటులోకి రానున్నాయని నీతి ఆయోగ్‌ సభ్యుడు డాక్టర్‌ వీకే పాల్‌ తెలిపారు. వాటిలో భారత్‌ బయోటెక్‌కు చెందిన సింగిల్‌ డ్రాప్‌, సింగిల్‌ డోస్‌ నాసల్‌ వ్యాక్సిన్లు కూడా (ముక్కు ద్వారా తీసుకునేవి) ఉంటాయని వెల్లడించారు. దిల్లీలో గురువారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటివరకు భారత్‌లో దాదాపు 18 కోట్ల డోసులు అందించామని, జులై నాటికి ఈ సంఖ్య 35.6 కోట్లకు చేరుతుందని తెలిపారు. అత్యధిక డోసులు వేసిన దేశాల జాబితాలో అమెరికా, చైనాల తర్వాత భారత్‌ మూడో స్థానంలో ఉందన్నారు. పాల్‌ వెల్లడించిన మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే..

దేశంలో ఇప్పటివరకు 13.76 కోట్ల మంది మొదటి డోసు వేయించుకున్నారు. 3.96 కోట్ల మంది రెండో డోసునూ పొందారు. 45 ఏళ్లు దాటినవారు దేశవ్యాప్తంగా 34 కోట్ల మంది ఉండగా, వారిలో 1/3వ వంతు మందికి ఒక డోసు అందింది. కొవిడ్‌ మృతుల్లో 88% మంది ఈ వయస్సు వారే. వారికి టీకా అందించడంతో మరణాల రేటు తగ్గే అవకాశాలున్నాయి. ఇప్పటివరకు 35.6 కోట్ల డోసులు కొనుగోలు చేశాం. ఇందులో 19.6 కోట్ల డోసుల వినియోగం ఈ నెలాఖరుకల్లా పూర్తవుతుంది. మిగిలిన 16 కోట్ల డోసులు మే-జులై మధ్యలో అందుతాయి. వాటికి ఇప్పటికే చెల్లింపులు పూర్తయ్యాయి. మరో 16 కోట్ల డోసులను రాష్ట్రాలు, ప్రైవేటు ఆసుపత్రులు కలిసి సేకరిస్తున్నాయి. మొత్తంగా జులై నాటికి 51.6 కోట్ల డోసులు అందుబాటులోకి వస్తాయి.

రెండు రోజుల్లోనే లైసెన్సులు
ముక్కు ద్వారా అందించే టీకాపై భారత్‌ బయోటెక్‌ ఇప్పటికే పని మొదలుపెట్టింది. రష్యాకు చెందిన స్పుత్నిక్‌- వ్యాక్సిన్‌ వచ్చే వారం మార్కెట్‌లో అందుబాటులోకి వస్తుంది. భారత్‌లో జులై నుంచి దాని తయారీ ప్రారంభమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు సంస్థల భాగస్వామ్యం పెంచాం. 18 ఏళ్లు నిండినవారు మన దేశంలో 95 కోట్ల మందికి పైగా ఉన్నారు. వారికి రెండు డోసులు అందించడానికి దాదాపు 200 కోట్ల డోసులు అవసరం. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో), అమెరికాకు చెందిన ఎఫ్‌డీఏ అనుమతులు పొందిన ఏ విదేశీ టీకాలైనాసరే భారత్‌కు రావొచ్చు. అవి దిగుమతి లైసెన్సులు అడిగితే రెండు రోజుల్లో ఇవ్వడానికి మేం సిద్ధంగా ఉన్నాం.

* ఫైజర్‌, మోడెర్నా, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌లతో సంప్రదింపులు కొనసాగుతున్నాయి. సాంకేతికత బదిలీ ద్వారా భారతీయ కంపెనీలతో పనిచేయాలని వాటిని ఆహ్వానిస్తున్నాం.
* 45 ఏళ్లు నిండినవారిలో దేశంలో సగటున 32% మందికి కనీసం ఒక డోస్‌ వ్యాక్సిన్‌ అందింది. ఈ విషయంలో జాతీయ సగటు కంటే ఆంధ్రప్రదేశ్‌ (26%) వెనుకబడి ఉంది. తెలంగాణ (37%) కాస్త ముందుంది.

ప్రతి ఒక్కరికీ టీకా

వచ్చే ఏడాది తొలి త్రైమాసికానికి దేశవ్యాప్తంగా మొత్తం 300 కోట్ల డోసులు ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. అందువల్ల ప్రతి ఒక్కరికీ టీకా అందుతుంది. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి కేంద్రం, ప్రైవేటు ఆసుపత్రులతో సమన్వయం చేసుకుంటూ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ నిరంతరం కొనసాగేలా చర్యలు తీసుకోవాలి. బయొలాజికల్‌-ఈ, జైడస్‌ క్యాడిలా వ్యాక్సిన్లు అతి త్వరలో అందుబాటులోకి రానున్నాయి.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని