KCR: కిట్లు పంచుదాం.. పరీక్షలు పెంచుదాం

ప్రధానాంశాలు

KCR: కిట్లు పంచుదాం.. పరీక్షలు పెంచుదాం

కరోనా కట్టడిపై ద్విముఖ వ్యూహం
వ్యవస్థ దీనావస్థలో భయానకంగా ఉంది
మనమంతా మానవతా దృక్పథంతో స్పందించాలి
మూడోదశను ఎదుర్కోడానికి సిద్ధం కావాలి
వ్యాధుల నియంత్రణకే తొలి ప్రాధాన్యం
ఖర్చుకు వెనుకాడం.. అవసరమైతే అప్పు తెస్తాం
లాక్‌డౌన్‌ ఫలిస్తోంది.. కరోనా తగ్గుతోంది  
బ్లాక్‌ఫంగస్‌ చికిత్సకు ప్రత్యేక చర్యలు
ఉన్నతస్థాయి సమీక్షలో సీఎం కేసీఆర్‌
ఈనాడు - హైదరాబాద్‌

రోనా కట్టడిపై ద్విముఖ వ్యూహంతో వ్యవహరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. ఒకవైపు ఇంటింటా జ్వర సర్వే చేస్తూ అవసరమైనవారికి మందుల కిట్లను పంచుతూనే మరోవైపు కొవిడ్‌ లక్షణాలు ఉన్నవారికి పరీక్షలు నిర్వహించి వ్యాధి వ్యాప్తిని అరికట్టవచ్చని చెప్పారు. అటు కరోనా.. ఇటు బ్లాక్‌ ఫంగస్‌ వ్యాధులతో వ్యవస్థ మొత్తం దీనావస్థలో, భయానక పరిస్థితుల్లో ఉందని ఆయన అన్నారు.  ఇలాంటి సమయంలో ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి ప్రభుత్వ వైద్య వ్యవస్థ, యంత్రాంగంతో పాటు, ప్రైవేటు వైద్య రంగం, ఇతర రంగాలు కూడా మానవతా దృకృథంతో స్పందించాలని ఆయన పిలుపునిచ్చారు. మూడోదశ వస్తే దానిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. కరోనా నియంత్రణే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్య అంశమని, ఎంత ఖర్చుకైనా వెనకాడేది లేదని చెప్పారు. ఎన్ని కోట్లయినా వెచ్చిస్తామని, వ్యాధినిర్మూలనకు అవసరమైతే అప్పు తేవడానికైనా సిద్ధమేనని తెలిపారు. కరోనా, బ్లాక్‌ ఫంగస్‌, టీకాలు, లాక్‌డౌన్‌ తదితర అంశాలపై సీఎం సోమవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. టీకాలను సత్వరమే సరఫరా చేయాల్సిందిగా ఉత్పత్తిదారులతో మాట్లాడాలని కరోనా టాస్క్‌ఫోర్సు ఛైర్మన్‌, మంత్రి కేటీఆర్‌ను సీఎం ఫోన్‌లో ఆదేశించారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఖర్చు తగ్గే అవకాశాలున్న శాఖలను గుర్తించాలని, పోలీస్‌, వైద్యారోగ్య శాఖలకు బడ్జెట్‌ను పెంచాలని మంత్రి హరీశ్‌రావును ఆదేశించారు. ఈసందర్భంగా సీఎం మాట్లాడారు..

పీహెచ్‌సీలకు కిట్లు పంపండి  
‘‘ప్రజారోగ్య పరిరక్షణ కోసం రాష్ట్రంలో పెట్టిన లాక్‌డౌన్‌ కఠినంగానే అమలవుతున్నందున సత్ఫలితాలు సాధిస్తున్నాం.. కరోనా తగ్గుముఖం పడుతోంది.. దిల్లీ, మహారాష్ట్ర కరోనా కట్టడిలో సత్ఫలితాలను సాధిస్తున్నాయి.. ఇంకా ఏ ఏ రాష్ట్రాలు బాగా చేస్తున్నాయో.. అందుకు వారు అమలు పరుస్తున్న కార్యాచరణ ఏమిటో తెలుసుకోవాలి. అవసరమైతే వైద్యబృందం వెళ్లి అధ్యయనం చేసి రావాలి. పాజిటివిటీ రేటును 5 శాతానికి తగ్గించగలిగినప్పుడే మనం విజయం సాధించినట్లవుతుంది. పరీక్షలను మరింతగా పెంచాలి. ర్యాపిడ్‌ యాంటిజెన్‌ కిట్లను 50 లక్షలకు పెంచాలి. ఉత్పత్తిదారులతో మాట్లాడి, మంగళవారం నుంచే వాటిని పీహెచ్‌సీలకు, పరీక్ష కేంద్రాలకు అందజేయాలి. వైద్య సిబ్బంది నియామక ప్రక్రియ వేగవంతం చేయాలి. జ్వర సర్వేను నిర్వహిస్తూనే లక్షణాలున్న వారికి మెడికల్‌ కిట్లను అందించాలి.  వైద్యఆరోగ్య శాఖ సంచాలకుడు శ్రీనివాస్‌రావు అన్ని జిల్లాల అధికారులతో నియామక ప్రక్రియ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు తదితర అవసరాలపై నివేదిక రూపొందించాలి. అన్ని పడకలను ఆక్సిజన్‌ బెడ్లుగా మార్చేందుకు, ఆక్సిజన్‌ ఉత్పత్తిని 600 టన్నులకు పెంచే ఏర్పాట్లు చేయాలి.

జనాభా 10 కోట్లు అనుకోవాలి

‘‘ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు తరలి వస్తున్న వారికి చికిత్స అందజేయక తప్పని పరిస్థితి వస్తోంది. రాష్ట్ర జనాభా నాలుగు కోట్లే అయినా కరోనా, బ్లాక్‌ ఫంగస్‌ విషయంలో జనాభాను పది కోట్లుగా అంచనా వేసుకొని అధికారులు ముందుకు సాగాలి.’’

బ్లాక్‌ ఫంగస్‌పై..

బ్లాక్‌ఫంగస్‌ వ్యాధి విస్తరిస్తోంది. దీని చికిత్స కోసం తక్షణమే ఏర్పాటు చేయాలి. ఇందుకోసం ప్రస్తుతం గాంధీలో 150, ఈఎన్‌టీలో 250 చొప్పున మొత్తం 400 పడకలున్నాయి. వాటి సంఖ్యను 1500కు పెంచాలి. హైదరాబాద్‌లో 1100, జిల్లాల్లో 400 ఉండాలి. సరోజిని ఆసుపత్రిలో 200, గాంధీలో మరో 160 పడకలు ఏర్పాటు చేయాలి. బ్లాక్‌ ఫంగస్‌ చికిత్సకు అవసరమైన మందుల కోసం ఆర్డరివ్వాలి. ఔషధాల నిల్వలను పెంచాలి. అవసరమైన వైద్యులను యుద్ధప్రాతిపదికన నియమించుకోవాలి’’ అని సీఎం సూచించారు. ఈ సమావేశంలో మంత్రి హరీశ్‌రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సభ్యులైన జయేశ్‌రంజన్‌, వికాస్‌రాజ్‌, రామకృష్ణారావు, రొనాల్డ్‌రోస్‌, సీఎంవో ఉన్నతాధికారులు నర్సింగ్‌రావు, రాజశేఖర్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, వైద్యశాఖ కార్యదర్శి రిజ్వి, డీజీపీ మహేందర్‌రెడ్డి, పోలీసు కమిషనర్లు అంజనీకుమార్‌, సజ్జనార్‌, మహేశ్‌భగవత్‌ తదితరులు పాల్గొన్నారు.

నేటి నుంచే రెండో డోసు

మొదటి డోసు టీకా తీసుకున్న వారికి మంగళవారం నుంచి రెండో డోసు ప్రారంభించాలి. అలాగే కరోనా వేగంగా వ్యాపింపజేసే అవకాశాలున్న వారిని (వాహకులు- సూపర్‌ స్ప్రెడర్లు) గుర్తించి టీకా వేయడానికి సంబంధించిన విధివిధానాలను రూపొందించాలి.

- సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్‌


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని